పేదల నిజాయితీకి మోదీ సలాం!
భారతదేశంలో నిరుపేదల నీతి, నిజాయితీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలాం కొట్టారు. ప్రధానమంత్రి జనధన యోజన కింద పేదలతో బ్యాంకు ఖాతాలు తెరిపించిన విషయాన్ని సిడ్నీలోని ఆల్ఫోన్స్ ఎరెనాలో వేలాది సంఖ్యలో హాజరైన ప్రవాస భారతీయులకు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా దేశంలో నిరుపేదల నిజాయితీ గురించి చెబుతూ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు.
జనధన యోజన కింద ఒక్క రూపాయి కూడా వేయక్కర్లేకుండానే ఖాతాలను ప్రారంభించుకోవచ్చని తాము తెలిపామని, కానీ మోదీ చెబితే చెప్పారు.. మనం నిజాయితీగా ఉండాలనే వాళ్లు భావించారని అన్నారు. అందుకే ఒక్కొక్కళ్లు 100, 200 రూపాయల చొప్పున ఆ ఖాతాల్లో జమచేసి మొత్తం 5 వేల కోట్ల రూపాయలతో ఖాతాలను తెరిచారన్నారు. ఈ విషయం ఆయన చెప్పగానే.. ఒక్కసారిగా ప్రేక్షకులంతా ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో అభినందించారు.