శేషాచలం జల్లెడ
=స్పెషల్ పార్టీ పోలీసుల కూంబింగ్
=స్మగ్లర్లు, కూలీల కోసం
=బృందాలుగా గాలింపు
=అడవిలోకి ఎవరూ వెళ్లొద్దంటూ నిషేధాజ్ఞలు
సాక్షి, తిరుమల: ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల కోసం సోమవారం స్పెషల్ పార్టీ పోలీసులు తిరుమల శేషాచలం కొండల్ని జల్లెడ పట్టారు. ఆదివారం ఉదయం స్మగ్లర్లు, కూలీల దాడిలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులు హతమవటం, మరో ముగ్గురు సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే. దీంతో నిందితుల కోసం స్పెషల్‌పార్టీ పోలీ సులు గాలింపు వేగవంతం చేశారు. దట్టమైన అడవిలో కూం బింగ్ నిర్వహిస్తున్నారు. తిరుమల చుట్టూ అటవీప్రాంతాల్లోకి ఎవ్వరూ వెళ్లరాదని పోలీసులు, అటవీశాఖ అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు.
కూంబింగ్‌లో చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. శేషాచల కొండలకు పడమర దిశలో ఉన్న తలకోన, ఎర్రవారిపాళెం, భాకరాపేట, రంగంపేట నుంచి తిరుపతి వరకు స్పెషల్‌పార్టీ పోలీసులు బృందాలుగా విడిపోయి అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక తూర్పు దిశలో కరకంబాడి, మామండూరు, బాలపల్లి, రైల్వే కోడూ రు, రాజంపేట సమీప అటవీమార్గంలోని గ్రామాల నుంచి అడవిలోకి వెళ్లి స్పెషల్ పార్టీ పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. స్పెషల్ పార్టీ ఓఎస్డీ ఉదయ్‌కుమార్, డీఎస్పీ ఇలియాస్‌బాషా గాలింపు బృందాలకు నేతృత్వం వహించారు. మొత్తం ఎనిమిది బృందాలు అడవిలోకి వెళ్లాయి. ప్రతి బృందంలోనూ ఏకే47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిళ్లు, గ్రైనేడ్లు, ఇతర ఆయుధాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, జరిగిన సంఘటనపై చిత్తూరు జిల్లా పోలీసు అధికారులు, తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు సమీక్షించారు. సంఘటన ఎలా జరిగింది? ఫారెస్ట్ అధికారుల వెంట సాయుధ పోలీసులు ఉంటే ఏవిధంగా ఉండేది? ఇద్దరు అధికారుల ప్రాణనష్టం? తదితర అంశాలపై చర్చించారు. భవిష్యత్‌లో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది అడవిలోకి వెళ్లే ప్రతి సందర్భంలోనూ పోలీసులు వెంట ఉండాలనే విషయంపై కూడా కూలంకూషంగా చర్చించారు. మరోవైపు శేషాచల అడవులకు ఆనుకునే ఉన్న నల్లమల అడవుల్లో కూడా కర్నూలు జిల్లా స్పెషల్‌పార్టీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ?
ఇద్దరు ఫారెస్ట్ అధికారులను హతమార్చి, మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచిన ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల్లో తమిళనాడుకు చెందిన నలుగురిని స్పెషల్ పార్టీ పోలీసులు పట్టుకున్నారు. వీరితోపాటు సుమారు 50 మంది కూలీలను పట్టుకున్నా ఆదివారం జరిగిన ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న నలుగురిని గుర్తించారు. సంఘటనలో పాల్గొన్న వారిని నేడో రేపో ఎన్కౌంటర్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.