Sikh riot cases
-
కమల్‌నాథ్‌పై సిక్కు అల్లర్ల కేసు!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీలో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కమల్‌నాథ్‌పై నమోదైన కేసును రీ–ఓపెన్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారించనుంది. కమల్‌నాథ్ కేసుతో పాటు మరో 6 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులను సిట్ పునర్విచారణ జరపనుంది. ఈ విషయమై ఢిల్లీ సిక్కుల గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, అకాలీదళ్ ఎమ్మెల్యే మన్జిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ..‘1984 అల్లర్ల కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై నమోదైన కేసును సిట్ పునర్విచారించనుంది. సిక్కుల ఊచకోతకు సంబంధించి 7 కేసుల్లో నిందితులైన ఐదుగురికి కమల్‌నాథ్ ఆశ్రయం కల్పించారు. గతేడాది నేనుచేసిన విజ్ఞప్తి మేరకు స్పందించిన హోంశాఖ, తాజా సాక్ష్యాల ఆధారంగా మళ్లీ విచారణ జరిపేందుకు వీలుగా కేసు నంబర్ 601/84ను రీ–ఓపెన్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇది అకాలీదళ్ సాధించిన విజయమే. ఈ కేసును మళ్లీ విచారించనున్న సిట్‌కు ధన్యవాదాలు. సిక్కులను కమల్‌నాథ్ చంపుతుండగా చూసిన సాక్షులు ధైర్యంగా ముందుకు రండి. భయపడాల్సిన పనిలేదు. కమల్‌నాథ్ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు ముక్తియార్ సింగ్, సంజయ్ సూరీ సిట్ ముందు హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చేందుకు అంగీకరించారు. త్వరలోనే కమల్‌నాథ్ అరెస్ట్ అవుతారు. కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు పట్టిన గతే(యావజ్జీవ శిక్ష) కమల్‌నాథ్‌కు పడుతుంది. ’ అని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెంటనే కమల్‌నాథ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలనీ, విచారణ నిష్పక్షపాతంగా సాగేందుకు సహకరించాలని మన్జిందర్ సింగ్ కోరారు. కమల్‌నాథ్‌ను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో దాక్కున్న ఖలిస్తాన్ ఉగ్రవాది జర్నైల్‌సింగ్ బింద్రన్‌వాలేను పట్టుకునేందుకు ప్రధాని ఇందిర ఆదేశాలతో ఆర్మీ ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను చేపట్టింది. ఆపరేషన్‌లో స్వర్ణ దేవాలయం తీవ్రంగా దెబ్బతినడం, ఆర్మీ బూట్లతో ఆలయంలోకి వెళ్లడంతో ఈ చర్యను తమ మతంపై దాడిగా సిక్కులు భావించారు. ఈ క్రమంలో 1984, అక్టోబర్ 31న సిక్కు మతస్తులైన సొంత బాడీగార్డులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఇందిరాగాంధీని కాల్చిచంపారు. దీంతో దేశవ్యాప్తంగా సిక్కు మతస్తులు లక్ష్యంగా అల్లరిమూకలు దాడులకు తెగబడ్డాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అల్లర్లలో దేశవ్యాప్తంగా 3,500 మంది సిక్కులు చనిపోగా, ఒక్క ఢిల్లీలోనే 2,800 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ ఢిల్లీలోని రాకాబ్‌గంజ్ గురుద్వారా వద్ద కమల్‌నాథ్ నేతృత్వంలో విధ్వంసానికి దిగిన అల్లరిమూక ఇద్దరు సిక్కులను చంపేసింది. ఈ ఘటనపై 2000లో బీజేపీ ప్రభుత్వం నానావతి కమిషన్‌ను నియమించింది. ఈ సందర్భంగా కమిషన్ ముందు విచారణకు హాజరైన కమల్‌నాథ్.. ‘ఆ రోజున నేను ఘటనాస్థలిలోనే ఉన్నా. ఆవేశంతో ఊగిపోతున్న అల్లరిమూకను శాంతింపజేసేందుకు ప్రయత్నించా’ అని వాంగ్మూలమిచ్చారు. చివరికి నానావతి కమిషన్ ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కమల్‌నాథ్‌ను ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద విడిచిపెట్టింది. తాజాగా ఈ కేసులో కమల్‌నాథ్ పాత్రకు సంబంధించి కొత్త ఆధారాలున్నాయని భావించిన కేంద్రం, కేసును రీ–ఓపెన్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
సజ్జన్ కుమార్ దోషే
న్యూఢిల్లీ: 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జన్ కుమార్(73)ను ఢిల్లీ హైకోర్టు దోషిగా తేల్చింది. ఆయన ఇక మిగిలిన తన జీవిత కాలమంతా జైలులోనే గడపాలని ఆదేశిస్తూ జీవిత ఖైదు విధించింది. సిక్కుల ఊచకోత జరిగిన 34 ఏళ్ల తరువాత సోమవారం కోర్టు తీర్పు వెలువరిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆనాడు రాజకీయ పలుకుబడి, మద్దతు ఉన్న వారే మతం పేరిట హింసకు పాల్పడ్డారని పేర్కొంది. సిక్కు వ్యతిరేక అల్లర్లను మానవత్వంపై జరిగిన నేరంగా అభివర్ణించిన కోర్టు..సజ్జన్ కుమార్‌పై హత్య, వేర్వేరు మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడానికి నేరపూరిత కుట్ర పన్నడం, గురుద్వారాను అపవిత్రం, విధ్వంసం చేయడం తదితర అభియోగాలను మోపింది. ఈ కేసులో సజ్జన్‌తో పాటు ఇది వరకే దోషులుగా తేలిన మరో ఐదుగురు ఢిల్లీ వదిలి వెళ్లొద్దని, ఈ నెల 31 లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సజ్జన్ తరఫు లాయర్ వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు చారిత్రకమని బీజేపీ, శిరోమణి అకాలీదళ్, ఆప్ స్వాగతించాయి. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసును ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో ముడిపెట్టొద్దని కాంగ్రెస్ పేర్కొంది. ముగ్గురు సాక్షుల పోరాట ఫలితం: ఈ కేసులో నిందితులైన సజ్జన్ కుమార్‌తో పాటు మరో ఐదుగురిపై 2010లో విచారణ ప్రారంభమైంది. మూడేళ్ల తరువాత సజ్జన్ కుమార్ మినహా మిగిలిన వారంతా దోషులని కింది కోర్టు తేల్చింది. ఈ తీర్పును సీబీఐ సవాలు చేయగా తాజాగా జస్టిస్ ఎస్.మురళీధర్, జస్టిస్ వినోద్ గోయల్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సజ్జన్ కూడా దోషి అని ప్రకటించింది. ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు జగదీశ్ కౌర్, ఆమె కజిన్ జగ్షీర్ సింగ్, నిర్ప్రీత్ కౌర్‌ల అలుపెరుగని పోరాటం వల్లే సజ్జన్‌కు శిక్ష పడిందని బెంచ్ పేర్కొంది. నిందితులకు శిక్ష పడేందుకు మూడు దశాబ్దాలు పట్టినా కూడా సత్యం గెలిచి, న్యాయం జరుగుతుందని బాధితులకు భరోసా ఇవ్వడం ముఖ్యమని వ్యాఖ్యానించింది. సీబీఐ రంగప్రవేశం చేశాకే సాక్షులు ధైర్యంగా ముందుకొచ్చి నోరు విప్పారని పేర్కొంది. మరోవైపు, సజ్జన్ కుమార్ ఢిల్లీలోనే ఉన్నారని, డిసెంబర్ 31లోగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తరఫు లాయర్ వెల్లడించారు. ఒకవేళ ఆలోగా అత్యున్నత న్యాయ స్థానంలో తాజా తీర్పును సవాలుచేయకుంటే సజ్జన్‌కుమార్ లొంగిపోతారని తెలిపారు. కళంకితుడిని సీఎం ఎలా చేస్తారు?: జైట్లీ సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు విధించడాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. ఇదే కేసులో సిక్కులు దోషిగా భావిస్తున్న కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించడాన్ని తప్పుపట్టారు. సిక్కుల ఊచకోతలో సజ్జన్‌కుమార్ ఒక మాయని మచ్చలా మిగిలిపోయారని, దేశం ఇంత పెద్ద ఎత్తున హత్యాకాండను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. సిక్కుల దృష్టిలో దోషిగా నిలబడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజే ఈ తీర్పు రావడం గమనార్హమని పరోక్షంగా కమల్‌నాథ్‌ను ఉద్దేశించి అన్నారు. 1984 సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును రాజకీయం చేయడం సరికాదని, చట్టం తన పనిని తాను చేసుకుపోవాలని కాంగ్రెస్ పేర్కొంది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో చెలరేగిన హింసలో కమల్‌నాథ్ పాత్ర కూడా ఉందని, ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎలా నియమిస్తారని బీజేపీ, శిరోమణి అకాలీదళ్ కాంగ్రెస్‌ను నిలదీసిన సంగతి తెలిసిందే. అయితే కమల్‌నాథ్ తనపై వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఈ కేసులో తాను నిందితుడిని కాదని, తనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేశాక పేర్కొన్నారు. 4 రోజుల్లో 2,733 మంది సిక్కుల ఊచకోత 1984, అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులైన ఇద్దరు సిక్కులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీంతో నవంబర్ 1–4 మధ్య రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా చెలరేగిన హింసలో 2,733 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. దక్షిణ ఢిల్లీలోని పాలమ్ కాలనీలో ఐదుగురు సిక్కుల హత్య కేసులో సజ్జన్ నిందితుడిగా ఉండగా, కోర్టు తాజాగా తీర్పును ప్రకటించింది. జగదీశ్ కౌర్ భర్త, కొడుకు, ఆమె ముగ్గురు కజిన్లు కేఖర్ సింగ్, గురుప్రీత్ సింగ్, రఘువేందర్ సింగ్‌లతో పాటు నరేందర్ పాల్ సింగ్, కుల్దీప్ సింగ్..మొత్తం ఐదుగురిని అల్లరి మూకలు దారుణంగా హత్య చేశారు. తన తండ్రిని సజీవంగా దహనం చేయడాన్ని నిర్ప్రీత్ కౌర్ ప్రత్యక్షంగా చూసింది. 34 ఏళ్లు అంటే సుదీర్ఘ కాలమే అయినా నిందితుల అసలు రంగు బయటపెట్టేందుకు కృత నిశ్చయంతో పోరాడామని జగదీశ్ కౌర్, నిర్ప్రీత్ కౌర్ చెప్పారు. తాజా తీర్పు తమకు కొంత సాంత్వన చేకూర్చిందని, ఇన్నాళ్లూ తాము అనుభవించిన అన్యాయం, క్షోభ మరొకరికి రావొద్దని అన్నారు. -
జగదీశ్ టైట్లర్ పై కేసులో నిర్ణయం వాయిదా
న్యూఢిల్లీ: సిక్కు అల్లర్ల కేసులో బాధితుల తరఫు సీనియర్ న్యాయవాది దాఖలుచేసిన పరువు నష్టం వ్యాజ్యాన్ని పరిశీలించిన స్థానిక న్యాయస్థానం కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్‌పై నేరపూరిత బెదిరింపు అభియోగాలపై నిర్ణయాన్ని ఈ నెల రెండో తేదీకి వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జగదీష్ టైట్లర్ శనివారం స్థానిక ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గౌరవ్రావ్ ఎదుట హాజరయ్యారు. 2004, సెప్టెంబర్ ఏడో తేదీన ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రతిష్టకు భంగం కలిగేవిధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్. ఫుల్కా చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఇందుకు సంబంధించి తన నిర్ణయాన్ని ఈ నెల రెండో తేదీకి వాయిదా వేశారు. కాగా కోర్టు బయట ఈ సమస్యను పరిష్కరించుకుంటారా అని కోర్టు అడిగినప్పటికీ ఫుల్కా అందుకు నిరాకరించారు. తనపై అత్యంత తీవ్రమైన అభియోగాలు చేశారని ఆరోపించారు.