న్యూఢిల్లీ: సిక్కు అల్లర్ల కేసులో బాధితుల తరఫు సీనియర్ న్యాయవాది దాఖలుచేసిన పరువు నష్టం వ్యాజ్యాన్ని పరిశీలించిన స్థానిక న్యాయస్థానం కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్‌పై నేరపూరిత బెదిరింపు అభియోగాలపై నిర్ణయాన్ని ఈ నెల రెండో తేదీకి వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జగదీష్ టైట్లర్ శనివారం స్థానిక ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గౌరవ్‌రావ్ ఎదుట హాజరయ్యారు.
2004, సెప్టెంబర్ ఏడో తేదీన ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రతిష్టకు భంగం కలిగేవిధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్. ఫుల్కా చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఇందుకు సంబంధించి తన నిర్ణయాన్ని ఈ నెల రెండో తేదీకి వాయిదా వేశారు. కాగా కోర్టు బయట ఈ సమస్యను పరిష్కరించుకుంటారా అని కోర్టు అడిగినప్పటికీ ఫుల్కా అందుకు నిరాకరించారు. తనపై అత్యంత తీవ్రమైన అభియోగాలు చేశారని ఆరోపించారు.