న్యూఢిల్లీ: సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితుల న్యాయవాది హెచ్.ఎస్.ఫూల్కా దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పడానికి కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్ అంగీకరించారు. అయితే ఇందుకు తిరస్కరించిన ఫూల్కా, టైట్లర్ క్షమాపణను అంగీకరిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆక్షేపించారు. ఈ కేసులో ప్రజాప్రయోజనం ఏదీ లేదు కాబట్టి తన కక్షిదారు ఫూల్కాకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని నిందితుడి న్యాయవాది అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గౌరవ్‌రావుకు విన్నవించారు. ‘ఇది 2004లో నమోదైన కేసు. మనం ఇప్పుడు 2014లో ఉన్నాం.. అంటే పదేళ్లు గడిచాయి. నా కక్షిదారు ప్రజాజీవితంలో ఉన్నారు. ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని న్యాయమూర్తికి వివరించారు. దీనిపై ఏమంటారని న్యాయమూర్తి ఫూల్కాను ప్రశ్నించగా, క్షమాపణకు అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టైట్లర్ 2004, సెప్టెంబర్ ఏడున ప్రైవేటు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ ఫూల్కా పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఇంటర్వ్యూ సీడీ, రాతప్రతులు సమర్పించాలని ఫిర్యాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల రెండుకు వాయిదా వేసింది.
ఫూల్కాకు క్షమాపణ చెబుతానన్న టైట్లర్
Published Wed, Jul 2 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement