రూ. 50 కోట్లతో వైఎస్సార్–ఐటీ ఏజెన్సీ
కర్నూలు (ఓల్డ్‌సిటీ): వైఎస్సార్–ఐటీ ఏజెన్సీని రూ. 50 కోట్ల వ్యయంతో స్థాపించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రాంగణంలో స్థాపించిన క్లస్టర్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ (ఎంఎస్‌యూపీ)లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆదివారం ధ్రువపత్రాలు బహూకరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగ సాధనలో విద్యార్థులను ముందు వరుసలో నిలిపే ఈ కార్యక్రమాన్ని కేవలం ఈ వర్సిటీలో మాత్రమే డిజైన్ చేశారు. కార్యక్రమానికి ఉన్నత విద్యా శాఖ రాష్ట్ర ఛైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులోని మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 460 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని, ఇందులో 252 మంది ఉత్తీర్ణత సాధించడం ఒక గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో గూగుల్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకునే ఉద్దేశం ఉందని తెలిపారు. క్లస్టర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డీవీఆర్ సాయిగోపాల్, వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసులు, రాయలసీమ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆనందరావు మాట్లాడారు. కార్యక్రమంలో మూడు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ వీవీఎస్ కుమార్, డాక్టర్ కళావతి, డాక్టర్ ఇందిరా శాంతి పాల్గొన్నారు. (క్లిక్: తరగతుల విలీనంపై తప్పుడు వార్తలు)