పోలీస్ పహారాలో పాతబస్తీ
చాంద్రాయణగుట్ట : ఎన్కౌంటర్లో మృతి చెందిన సిమి ఉగ్రవాదుల మృతదేహాలు బుధవారం నగరానికి తరలించిన నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కరుడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్, రియాసత్నగర్కు చెందిన మహ్మద్ అంజద్, షాయిన్నగర్ వాదే ముస్తఫాకు చెందిన మహ్మద్ జకీర్ల మృతదేహాలను బుధవారం సాయంత్రం వారి వారి నివాసాలకు తరలించారు. ఈ నేపథ్యంలో సున్నితమైన పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు హెచ్చరిస్తుండడంతో పోలీసుల అప్రమత్తంగా ఉన్నారు. దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ బందోబస్తును పర్యక్షించారు. ఆర్ఏఎఫ్, టీఎస్పీ బలగాలతో పాటు స్థానిక పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.