‘రెరా’ బిల్లును సరళీకృతం చేయాలి
క్రెడాయ్ సూచన
విజయవాడ (లబ్బీపేట) :
నిర్మాణ రంగంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన ‘ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ బిల్లు (రెరా)ను సరళీకృతం చేయాలని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ప్రభుత్వానికి సూచించింది. క్రెడాయ్ ఎపీ, విజయవాడ చాప్టర్ల సంయుక్త ఆధ్వర్యంలో హోటల్ గేట్‌వేలో రెరా బిల్లుపై బిల్డర్లు, ఇంజినీర్లు, సీఏలు, న్యాయవాదులకు అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ బిల్లను నవ్యాంధ్రలో ప్రవేశ పెట్టేలా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచించారు. నిర్మాణరంగ న్యాయ నిపుణులు ఎ. దుర్గాప్రసాద్ బిల్లులో పాటించాల్సిన నిబంధనలు, నిర్మాణ రంగంపై ప్రభావితం చేసే అంశాలను వివరించారు. పలువురు బిల్డర్లు అడిగిన సందేహాలను నివృత్తి చే శారు. క్రెడాయ్ ఏపీ అధ్యక్షులు ఎ. శివారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అథారిటీ బిల్లుపై అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించామన్నారు. క్రెడాయ్ విజయవాడ చాప్టర్ అధ్యక్షులు చిగురుపాటి సుధాకర్, ప్రధాన కార్యదర్శి పి. విజయరామరాజు, విజయవాడ సిటీ ప్లానర్ శ్రీనివాస్, సీఆర్డీఏ డైరెక్టర్ రాముడు, క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షులు సి. శేఖర్‌రెడ్డి, కె. రాజేంద్ర పాల్గొన్నారు.