Singapore court
-
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థపై దివాలా పిటిషన్
సింగపూర్: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐటీఎన్‌ఎల్) విదేశీ అనుబంధ సంస్థ ఐటీఎన్‌ఎల్ ఆఫ్‌షోర్ పీటీఈ లిమిటెడ్‌పై సింగపూర్ కోర్టులో గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్ఎస్బీసీ దివాలా అస్త్రాన్ని ప్రయోగించింది. సంస్థపై ‘వైండింగ్ అప్’ పిటిషన్ దాఖలు చేసింది. రూ.1,000 కోట్లకుపైగా బకాయిలు రాబట్టే క్రమంలో హెచ్ఎస్బీసీ ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని ఒక సంస్థపై ఈ తరహా పిటిషన్ దాఖలు కావడం ఇదే తొలిసారి. ఐటీఎన్‌ఎల్ ఆఫ్‌షోర్ పీటీఈ లిమిటెడ్ జారీచేసిన 1,000 మిలియన్ల చైనా యువాన్ల (రూ.1,050 కోట్లకుపైగా) విలువైన బాండ్లలో హెచ్ఎస్బీసీ పెట్టుబడులు పెట్టింది. నిజానికి ఈ బాండ్లు 2021లో మెచ్యూరిటీకి వస్తాయి. -
నీరవ్ మోదీకి సింగపూర్ హైకోర్టు షాక్..!
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త నీరవ్ మోదీ కుటుంబసభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలంటూ సింగపూర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం నీరవ్ మోదీ సోదరి పుర్వి మోదీ, బావ మయాంక్ మెహతాల ఖాతాలను అక్కడి బ్యాంకులు స్తంభింపచేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. ఈ అకౌంట్స్‌లో సుమారు 6.122 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 44.41 కోట్లు) ఉన్నట్లు పేర్కొంది. బ్యాంకులను మోసం చేయడం ద్వారా వచ్చిన సొత్తులో ఇది కూడా భాగమేనని, దీన్ని నిందితులు విత్‌డ్రా చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడంతో న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే నీరవ్ మోదీకి స్విస్ బ్యాంకుల్లో ఉన్న నాలుగు ఖాతాలను అక్కడి బ్యాంకులు స్తంభింపచేశాయి. వీటిలో దాదాపు రూ. 283 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. పీఎన్బీని నీరవ్ మోదీ దాదాపు రూ. 14,000 కోట్ల మేర మోసం చేసి, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును ఈడీ, సీబీఐ తదితర ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. -
వివాదాస్పద వీడియో పోస్ట్.. యువకుడి అరెస్ట్
సింగపూర్: సింగపూర్ జాతిపిత, వ్యవస్థాపక తొలి ప్రధాని, ఇటీవల మరణించిన లీ క్యుయాన్ యోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 16ఏళ్ల టీనేజర్ అమోస్ యీ పాంగ్ కౌన్ను సింగపూర్ కోర్టు విచారించింది. వరుసగా మూడురోజులపాటు ఓ మతాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తూ ఆన్లైన్లో పోస్ట్‌లు పెట్టడంతో అతగాణ్ని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అమోస్ లీ కావాలనే ఓ మతాన్ని అవమానపర్చడం, దుష్ప్రచారం చేయటంతో పాటు ఆ మతస్తుల మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జీసస్, లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అమోస్ యి పాంగ్ కౌన్పై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. 'ఎట్టకేలకు లీ మరణించాడు' అనే పేరుతో ఎనిమిది నిమిషాల నిడివి గల ఒక వీడియోను యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేయడంతో వివాదం రగిలింది. నిందితుడిపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలపైనే కేసు నమోదైనట్టు సమాచారం. అయితే కోర్టు నిర్ణయం తరువాత కూడా అమోస్ యీ పాంగ్ కౌన్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. కోర్టు ఆవరణలో నిందితుడి ప్రవర్తన పలువురిని విస్మయపర్చిందట. నిందితుడి తండ్రి 'లీ.... నన్ను క్షమించు' అని వేడుకుంటోంటే.. అతగాడు మాత్రం విలేకర్లను చూసి చేతులూపుతూ, నవ్వుతూ కనిపించాడట. కాగా ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 17 వ తేదీకి వాయిదా వేసింది. 91 సంవత్సరాల సింగపూర్ మాజీ ప్రధాని లీ క్యుయాన్ యో మార్చి 23 వ తేదీ మరణించారు. వివిధ దేశాధినేతల అశ్రునివాళుల మధ్య సింగపూర్‌లో గత ఆదివారం ఆయన అంత్యక్రియలు ముగిసిన సంగతి తెలిసిందే. -
భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి మరణశిక్ష
సింగపూర్: మత్తుమందును అక్రమ రవాణా చేస్తున్న కేసులో భారతీయ సంతతికి చెందిన ప్రభాకరన్ శ్రీ విజయన్‌పై నేరం రుజువు అయింది. ఈ నేపథ్యంలో అతడికి మరణశిక్ష విధిస్తూ సింగపూర్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ మేరకు స్థానిక మీడియా మంగళవారం తెలిపింది. మలేషియా జాతీయుడైన ప్రభాకరన్ శ్రీ విజయన్ 2012లో తన కారులో దాదాపు 25 కేజీల మత్తుమందు మలేసియా జోహర్ బారు నుంచి అక్రమంగా తరలిస్తున్నాడు. కాగా ఉడ్‌ల్యాండ్ చెక్‌పోస్ట్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అతడి కారులో భారీగా మత్తు మందు ఉన్నట్లు గుర్తించారు. మత్తుమందును స్వాధీనం చేసుకుని... అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో దాదాపు రెండేళ్లు విచారణ అనంతరం నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 15 కేజీల మించి ఎవరైనా మత్తుమందు అక్రమ రవాణా చేస్తే సింగపూర్ కోర్టు మరణశిక్ష విధించే సంప్రదాయం ఉన్న సంగతి తెలిసిందే. మలేసియాలో ప్రభాకరన్ పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడని మీడియా తెలిపింది.