ఎలక్టరోల్‌కు ఒకే డాటాబేస్
కొత్త అంశాలపై సిబ్బందికి శిక్షణ
సంగారెడ్డి జోన్: దేశ వ్యాప్తంగా ఎలక్టరోల్‌కు సంబంధించి ఒకే డేటాబేస్ తయారు చేసేందకు భారత ఎన్నికల సంఘం ఒక కొత్త సర్వర్‌ను అందుబాటులోకి తెచ్చిందని జిల్లా రెవెన్యూ అధికారి దయానంద్ అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్లో జాతీయ ఎలక్టరోల్ ప్యూరిఫికేషన్-2016పై ఒక రోజు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఒకే డేటాబేస్ ఉండటం వలన ఓటర్లకు మరిన్ని వివరాలు అందుబాటులోకి రావడంతో పాటు కుటుంబంలోని ఓటర్లు ఇకపై ఒకే పోలింగ్ స్టేషన్లో ఓటు వేసే అవకాశం కలుగుతుందున్నారు. ఇప్పటికే కొందరు రాష్ట్రస్థాయిలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చామని, వారిచే జిల్లాస్థాయిలో అధికారులకు తిరిగి శిక్షణ ఇప్పిస్తామన్నారు.
ఇక నుంచి ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ లోకేషన్ గురించి వాకబు చేయాల్సిన అవసరం ఉండదని, ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తే ఓటరు తమ పోలింగ్‌స్టేషన్ లోకేషన్‌ను గుర్తించడంతోపాటు పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సిన రూట్ మ్యాప్కూడా తెలుస్తుందన్నారు. పోలింగ్ స్టేషన్లో మొత్తం ఓటర్ల సంఖ్య, అందుబాటులో ఉన్న వసతులను కూడా తెలుసుకోవచ్చన్నారు.
జిల్లా ఎన్ఐసీ అధికారి శాంతకుమార్ శిక్షణ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన ఎలక్టరోల్ డేటాను సీఇవో సర్వర్‌కు ఎలా అప్లోడ్ చేయాలో అధికారులకు వివరించారు. గతంలో ఎలక్టరోల్ రోల్డేటాలో తప్పొప్పులు, మార్పులు చేర్పులు అంతా జిల్లాస్థాయిలోనే చేసేవారమని, ఇప్పడు ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఈఆర్‌ఎంఎస్ పోర్టల్‌లోకి వెళ్లి మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుందన్నారు.
దేశ వ్యాప్తంగా ఒకే డేటాబేస్ ఉండటం వల్ల డేటాను మానిటర్ చేయడం సులభతరమవుతుందన్నారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే డూప్లికేటు ఓటర్లను తొలగించవచ్చన్నారు. ఓటర్లు తమతమ ఎపిక్ ఐడీని కంప్యూటర్లో నమోదు చేసిన వెంటనే అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. జనవరి1,2017నాటికి ఓటు వేసేందుకు అర్హత గల వారి పేర్లతో కూడిన డ్రాప్ట్ ఓటర్ లిస్టులను సెప్టెంబర్ 15న అందుబాటులో ఉంచుతామన్నారు. శిక్షణా కార్యక్రమంలో సర్వశిక్షాఅభియాన్ పీవో యాస్మిన్ బాషా, జిల్లాలోని ఈఆర్వోలు, డిప్యూటీ ఈఆర్ఓలు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.