Singur Pipeline
-
హైదరాబాద్‌లో 1, 2 తేదీల్లో నీటి సరఫరాకు అంతరాయం
సాక్షి,హైదరాబాద్: సింగూరు ఫేజ్– 3 పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతుల కారణంగా బుధ, గురువారాల్లో నగరంలో పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జలమండలి ప్రకటించింది. బుధవారం (జూన్ 1) ఉదయం 6 గంటల నుంచి గురువారం (జూన్2) ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్‌కు నీటి లీకేజీలు నివారించేందుకు శంకర్పల్లి సమీపంలో మూడు చోట్ల మరమ్మతు పనులను చేపట్టనున్నారు. దీంతో గండిపేట, నార్సింగి, మంచిరేవుల, మణికొండ, కోకాపేట, పుప్పాలగూడ, చందానగర్, హుడా కాలనీ, బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ, తారానగర్, గంగారం, లింగంపల్లి రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీ, నల్లగండ్ల, గోపన్‌పల్లి, గుల్మొహర్ పార్కు, నేతాజీనగర్, నెహ్రూ నగర్, తెల్లాపూర్, వట్టినాగులపల్లి, చింతలబస్తీ, విజయనగర్ కాలనీ, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. (క్లిక్: సర్కారు స్థలాల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణ సర్వే షురూ..) -
మది నిండా నువ్వే..
సాక్షి, సంగారెడ్డి: ఆరోగ్యశ్రీ.. 108 అంబులెన్స్.. పింఛన్లు.. ఇందిరమ్మ ఇళ్లు.. ప్రాజెక్టులు.. రుణమాఫీ.. ఉచిత విద్యుత్ ఇలా.. ఒకటేమిటి నిరుపేదల అభ్యున్నతి, సంక్షేమం కాంక్షించి అనేక పథకాలను రూపొందించి అమలు చేశారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. బడుగుల గుండెల్లో గూడు కట్టుకుని నిలిచారు. ఆరోగ్యశ్రీ పథకంతో ఎంతోమంది నిరుపేదలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. గుండె జబ్బుతో బాధపడుతూ శస్త్రకిత్సలు చేయించుకొని ప్రస్తుతం కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు. తమకు ప్రాణదానం చేసిన ఆ మహనీయుడిని గుండె గుడిలో నిలుపుకొన్నారు. నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనాలు.. అచ్చతెలుగు పంచెకట్టు..మోములో ఎప్పుడూ చెరగని చిరునవ్వు.. పేదలకు ఏదో చేయాలనే నిరంతర తలంపు.. తపన. నేనున్నానంటూ ఆప్యాయంగా పలకరించే మనస్తత్త్వం.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ,, ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్, వైద్య కోర్సులను చదవడానికి ఫీజు రీయింబర్స్మెంట్, ప్రమాదాలబారిన పడిన వారిని క్షణాల్లో ఆసుపత్రులకు చేర్చడానికి 108 అంబులెన్స్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి 104 మొబైల్ వైద్యశాలలు, ఉచిత విద్యుత్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఎన్నెన్నో వినూత్న పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు. ఉన్నత విద్య, నాణ్యమైన వైద్యం ప్రభుత్వ బాధ్యతలుగా చేసిన మహామనీషి, నిరుపేదల ఇలవేల్పు.. ఆయనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆ మహానేత పరమపదించి దశాబ్దకాలం కావస్తున్నా.. నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడుగా జీవించే ఉన్నారు. ఆయన చేసిన సహాయాన్ని ఇంకా మదిలో పదిలంగా దాచుకున్నారు. ఆయన సంగారెడ్డి జిల్లా ప్రజలపై చెరగని ముద్రవేశారు. ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఆయన జిల్లాకు 14 సార్లు విచ్చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. దశాబ్దాల తరబడి ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి పనులను చేసి జిల్లా ప్రజలకు మరింత చేరువయ్యారు. ఈనాటికీ ఆయన జ్ఞాపకాలు, మధురస్మృతులను జిల్లా ప్రజలు నెమరువేసుకుంటున్నారు. సింగూరు స్వప్నం..వైఎస్సార్ సంకల్పం 2003లో చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డిలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పర్యటించారు. జిల్లాలోని జోగిపేట మీదుగా వెళ్తూ సింగూరును సందర్శించారు. తాగునీటికే వినియోగిస్తున్న సింగూరుకు నిధులు కేటాయించి సాగునీరు కూడా ఇవ్వాలని ఆయనకు రైతులు విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు తాగునీటి కోసమే వినియోగిస్తున్న సింగూరు ప్రాజెక్టును అభివృద్ధి చేసి సేద్యానికి కూడా అందిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత నిధులను కేటాయించి 2006 జూన్ 7వ తేదీన స్వయంగా తానే కాల్వ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కాల్వ పనులకు గాను రూ.98.99 కోట్లను కేటాయించారు. దీంతో ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టు తాగునీరుతో పాటుగా సాగునీటికి కూడా బహుళార్థకంగా ఉపయోగపడుతోంది. వైఎస్సార్ కృషి ఫలితంగా పుల్కల్, అందోల్ మండలాల పరిధిలోని 40 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందుతోంది. జీవితాల్లో వెలుగులు నింపిన జలప్రదాత హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గ మెట్ట ప్రాంత రైతులను దుర్బిక్షం, అనావృష్టి, కరువు వెంటాడుతోంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ ప్రాంత ప్రజల కనీళ్లు తుడిచెనాథుడే కరువయ్యాడు. దశాబ్ధాల కాలంగా ఈ ప్రాంతంలో సాగునీరు లేక పరితపించిపోతున్నారు. కష్టాలు, కన్నీళ్లను తెలుసుకునేందుకు ఈ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేశాడు. అడుగడుగున రైతులు పడుతున్న కష్టాలను చూశాడు. వరుణుడు కరుణిస్తేనే ఇక్కడి రైతులకు జీవనాధారమని భావించాడు. పాదయాత్ర చేసిన సమయంలో రైతుల బాధలు, కడగండ్లను చూసి చలించిపోయాడు. ఇక్కడి రైతులకు ప్రాజెక్టులే శరణ్యమని భావించాడు. ఆ సందర్భంలో తాము అధికారంలోకి వస్తే వరద కాలువ ద్వారా సాగు నీటిని అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ ఒక్కమాట ఈ ప్రాంత రైతాంగంలో ఆశలు చిగురించాయి. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మాట మరువని మడిమ తిప్పని నాయకుడిగా హామీని నిలబెట్టుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత హుస్నాబాద్ మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు దేశ చరిత్రలోనే ఒకే నియోజకవర్గంలో మూడు ప్రాజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కింది. ఏళ్లుగా వరద కాలువ కోసం పోరాటాలు చేసినా చివరకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రాజెక్టుల రూపకల్పనకు బీజం వేశాడు. ఈ మెట్ట ప్రాంత రైతుల్లో ఆనందం నింపెందుకు నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి, గండిపెల్లి, చిగురుమామిడి మండలంలోని ఓగులాపూర్‌లో (తోటపల్లి) ప్రాజెక్టుల నిర్మాణ పనులకు వైఎస్సార్ 09, సెప్టెంబర్, 2007న ఏక కాలంలో శంకుస్థాపన చేశారుఏన్నో ఏళ్లుగా సాగునీరు కోసం ఎదరుచూసిన రైతాంగానికి ప్రాజెక్టుల నిర్మాణాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపినట్లైయింది. ఈ మూడు ప్రాజెక్టులతో మిడ్ మానేర్ నుంచి తాగునీరుందించేందుకు సీపీడబ్యూఎస్ పథకానికి శంకుస్థాపన చేశారు. సింగూరు జలాలు వైఎస్ పుణ్యమే జోగిపేట(అందోల్): సింగూరు జలాలను కాలువల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరుగా అందించడమేకాక ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని ఇక్కడి రైతులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని స్మరించుకుంటున్నారు. జూలై 8న వైఎస్ జయంతిని పురస్కరించుకొని వారు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. సింగూరు జలాలను సాగుకు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని రైతులు కొన్నేళ్లుగా చెప్పుకుంటున్నారు. అందోలు నియోజకవర్గం పరిధిలోని 40వేల ఎకరాలకు కాలువల ద్వారా సింగూరు నీటిని అందించేందుకు 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.88.89 కోట్లు మంజూరు చేశారు. అదే సంవత్సరం జూన్ 7న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్వయంగా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు వద్దకు వచ్చి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సింగూరు జలాలను సేద్యానికి రెండు టీఎంసీల నీరు ఇచ్చేందుకు 136 జీఓ జారీ చేయించారు. దీంతోనే నియోజకవర్గ ప్రజలు సాగు చేయగలుగుతున్నారు. 2009వ సంవత్సరంలో ట్రయల్ రన్ పేరుతో పుల్కల్, అందోలు మండలాల్లోని 20 చెరువుల వరకు నీరును కాలువల ద్వారా తరలించగలిగారు. 2003వ సంవత్సరంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర నిర్వహించిన వైఎస్ సింగూరు జలాలను సేద్యానికి ఇవ్వాలని దీక్షలను ప్రారంభించారు. -
మాది రైతు ప్రభుత్వం
సంగారెడ్డి అర్బన్: రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు.బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన ఐఐటీ కళాశాల నిర్మాణంలో భూములు కోల్పోయిన 20 మంది రైతులకు ఇంటి స్థలాల పట్టాలు, సింగూర్ పైప్‌లైన్ వల్ల భూములు కోల్పోయిన 47 మంది రైతులకు రూ. 56.37 లక్షల పరిహారాన్ని మంత్రి హరీష్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిహారం అందాల్సిన వారు ఇంక ఎవరున్నా వారికి కూడా త్వరలోనే పరిహారం పంపిణీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం పరిహారంగా ఎకరాకు రూ.3 లక్షల చెల్లించగా, ప్రస్తుతం ఆ పరిహారాన్ని పెంచి రైతులకు న్యాయం చేస్తున్నామన్నారు. రుణమాఫీ కింద ఇప్పటికే రూ.499 కోట్లు జిల్లాలోని రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. ఇప్పటివరకు రైతులకు రూ.700 కోట్ల కొత్త రుణాలు రైతులకు మంజూరు చేయించామన్నారు. అంతేకాకుండా రైతులకు మద్దతు ధర దక్కేలా జిల్లా వ్యాప్తంగా మక్క, వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రం లోనే ప్రయోగాత్మకంగా జిల్లాలో సేకరించిన మొక్కజొన్నకు కూడా ఆన్లైన్ ద్వారా రైతులకు చెల్లింపులు ప్రారంభించామన్నారు. 72 గంటల్లో రైతులకు డబ్బు చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అంతేకాకుండా పాడి రైతుకు మేలు జరిగేలా లీటరుకు రూ. 4 పెంచినట్లు వివరించారు. షేడ్‌నెట్ కింద రైతులు కూరగాయలు పండించేందుకు రూ. 280 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోందన్నారు. డ్రిప్ ఇరిగేషన్ సాగు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీతో, చిన్న సన్న కారు రైతులకు 90 శాతం, మిగతా రైతులందరికీ 80 శాతం సబ్సిడీతో పరికరాలను సమకూర్చనున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక శాసన సభ్యులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, ఎంతో కాలంగా పెండింగ్‌లోఉన్న పరిహారాన్ని , ఇళ్ల స్థలాల పట్టాలను నూతన ప్రభుత్వం మంజూరు చేసి రైతులను ఆదుకుందన్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయినట్లయితే సంబంధిత తహశీల్దార్ల ద్వారా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. 8న పింఛన్ల పంపిణీ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, జిల్లాలో ఆహార భద్రత కార్డులకు 8 లక్షల దరఖాస్తులు అందగా, ఇప్పటి వరకు 50 శాతం పరిశీలన పూర్తయిందని తెలిపారు. పింఛన్ కోసం 4 లక్షలకు పైగా దరఖాస్తులందగా, 60 శాతం పరిశీలన పూర్తయిందన్నారు. నవంబర్ 1 తేదీ నాటికి పరిశీలన పూర్తిచేసి 8వ తేదీన అందరికి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఆహార భద్రత కార్డులు, పింఛన్ల కోసం అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు చివరి తేదీ అంటూ ఏమీ లేదన్నారు. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్, జేసీ శరత్, అదనపు జేసి మూర్తి, డీఆర్ఓ దయానంద్, సంగారెడ్డి తహశీల్దార్ గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.