బ్రెగ్జిట్‌లో కీలక పరిణామం
మరికొన్ని నెలల్లో బ్రెగ్జిట్ చర్చలు ప్రారంభం కాబోతున్నాయనే తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యూరోపియన్ యూనియన్‌కు బ్రిటన్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సర్ ఇవాన్ రోజర్స్ తన పదవికి రాజీనామా చేశారు. సర్ ఇవాన్ రోజర్స్ రాజీనామా చేసినట్టు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈయనకు యూకేలో అత్యంత అనుభవం కల్గిన యూరోపియన్ రాయబారిగా పేరొంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియ చర్చలు అధికారికంగా మరికొద్ది నెలల్లో ప్రారంభం కానున్నాయి. బ్రెగ్జిట్ ట్రేడ్ డీల్స్ దశాబ్దం వరకు పట్టవచ్చని సర్ ఇవాన్ రోజర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయం రివీల్ చేసి నెల తిరగక ముందే ఆయన రాజీనామా చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం గమనార్హం. 2013లో సర్ ఇవాన్‌కు శాశ్వత ప్రతినిధి బాధ్యతను అప్పజెప్పుతూ ఆ దేశ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ నియమించారు. బ్రెగ్జిట్ చర్చల్లో ఈయన కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేశారు. కానీ ఆయన అనూహ్యంగా తన పదవి నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏ కారణాలచే సర్ ఇవాన్ తన బాధ్యత నుంచి వైదొలుగుతున్నారో విదేశీ కార్యాలయం వెల్లడించలేదు.