SiraSri
-
సుక్కు... సౌండ్ బాగుంది
‘‘శివనాగేశ్వరరావుగారు ‘వన్స్ మోర్’ అని యూట్యూబ్ చానల్ పెట్టి, తన అనుభవాలను అబద్ధం లేకుండా చెబుతున్నారు. నేను ఆయనకు ఫ్యాన్’’ అన్నారు దర్శకుడు సుకుమార్. ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్, అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోచేవారెవరురా’. బొడ్డు కోటేశ్వరరావు నిర్మాత. రోహిత్ వర్ధన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సుక్కు.. సుక్కు ....’ అంటూ సాగే పాటని సుకుమార్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘సుక్కు.. సౌండ్ బాగుంది. నా పేరుతో వచ్చే ఈ పాటకు అజయ్ ఘోష్‌తో డాన్స్ చేయించాలనే ఆలోచన శివ నాగేశ్వర రావుగారికి రావడం హ్యాట్సాఫ్’’ అన్నారు. ఈ పాటను సిరాశ్రీ రాశారు. ‘‘సుక్కు..’ పాటని విడుదల చేయగలరా? అని సుకుమార్‌కి మెసేజ్ పెట్టాను.. ఓకే అని పది నిమిషాల్లోనే రిప్లయ్ వచ్చింది’’ అన్నారు శివ నాగేశ్వరరావు. ఈ సినిమాకి కెమెరా: ఆర్లి గణేష్, లైన్ ప్రొడ్యూసర్: శామ్ సన్. -
వర్మగారి నమ్మకమే ముందుకు నడిపించింది
‘‘అవకాశం వచ్చినప్పుడే మనలో ఉన్న సామర్థ్యం బయటకు తెలుస్తుంది. నా పదిహేనేళ్ల కెరీర్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ కోసమే ఎదురుచూస్తున్నాను. సంగీతదర్శకునిగా ఇది నా 16వ సినిమా. వర్మగారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశాను. నా కెరీర్‌ను బిఫోర్ ఆర్జీవీ (రామ్‌గోపాల్ వర్మ).. ఆఫ్టర్ ఆర్జీవీ అని చెప్పేంత స్పందన వచ్చింది ఈ సినిమాకు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను మెచ్చుకుంటున్నారు’’ అన్నారు కల్యాణీ మాలిక్. విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి, శ్రీతేజ ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’. ఏ జీవీ, ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంగీతం అందించిన కల్యాణీ మాలిక్, గీత రచయిత సిరాశ్రీ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. కల్యాణీ మాలిక్ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా సంగీత దర్శకుడిని అయ్యాను. మా అన్నయ్య (యం.యం. కీరవాణి), నేను ఇద్దరం మ్యూజిక్ డైరెక్టర్స్ విభాగంలోనే ఉన్నాం. క్రిష్ ‘యన్.టీ.ఆర్’కి అన్నయ్య సంగీత దర్శకునిగా చేశారు. నేను వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రానికి సంగీతం అందించాను. ఎవరి సృజనాత్మక శైలి వారికి ఉంటుంది. ఆయనతో నాకు పోలిక పెట్టడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పోలికలు పెట్టడం కామనే. కానీ ఆయన స్థాయికి నేను అస్సలు సరిపోను. ఆయనతో నేను సరితూగుతానా? అన్న భయం నాకు జీవితాంతం ఉంటుంది. కానీ ట్రావెల్లో ముందుకు వెళ్లాలి. రాజమౌళి సినిమాలకు సౌండ్ సూపర్ విజనింగ్ చేస్తుంటాను. అన్నయ్య ప్రతి సినిమాకు నేను పని చేయలేదు. వర్మగారితో తొలిసారి పని చేయడం హ్యాపీ. నేను ఊహించినదానికన్నా ఎక్కువగా ఈ సినిమాకు నాకు పేరు వచ్చింది. ఈ సినిమాకు ముందు రామ్‌గోపాల్‌వర్మగారితో నాకు పరిచయం లేదు. రచయిత సిరాశ్రీ వల్లే ఈ సినిమాకు పని చేసే అవకాశం నాకు వచ్చింది. సిరాశ్రీగారితో కూడా నాకు ఇంతకుముందు పరిచయం లేదు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మేము. ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం డెస్టినీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకు అవకాశం వచ్చినప్పుడు ‘నేను సంగీతం అందించగలనా?’ అనే భయం వేసింది. వర్మగారు నా పై ఉంచిన నమ్మకం నన్ను ముందుకు నడిపించింది. ఇందులో 11 పాటలు ఉన్నాయి. ఇలాంటి పాటలు చేయలేదు. నా కెరీర్‌కు బాగా ఫ్లస్ అయ్యింది. వివాదాలను మా వరకు రానివ్వరు వర్మగారు. ఆయన దగ్గర పక్కా ప్రణాళిక ఉంటుంది. నా కెరీర్ పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. కల్యాణీ మాలిక్ మంచి సంగీతం ఇవ్వగలడనే పేరును నిలబెట్టుకోవాలి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘అస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం నేను పేర్లు మార్చుకోలేదు. ఇక కెరీర్లో కల్యాణీ మాలిక్గానే కొనసాగుతాను. కీర్తీసురేశ్ సినిమాకు వర్క్ చేస్తున్నాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఫైనల్ స్టేజ్‌లో సౌండ్ సూపర్ విజనింగ్లో నా పని మొదలవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఆయన ఆంచనాలకు అందరు సిరాశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు దాదాపు 150 పాటలు రాశాను. అందులో 50కి పైగా పాటలు వర్మగారి చిత్రాలకు రాశాను. ఆయన పిలిస్తే ఇండస్ట్రీలో చాలా మంది లిరిసిస్టులు ఉన్నారు. కానీ ఆయన నాకే అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వర్మగారిని నేను ఒక ఈవెంట్‌గా చూస్తాను. మన మైండ్సెడ్తో ఆయన్ను అర్థం చేసుకోలేం. ఫిలసాఫికల్ ఔట్లుక్ వస్తుంది. వర్మగారు అంచనాలకు అందనివారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మ్యూజిక్ డిస్కషన్స్‌లో ‘ఇది ఆర్జీవీ మ్యూజిక్‌లా ఉండకూడదంటే ఏం చేయాలి. ‘శంకరాభరణం, మేఘ సందేశం’లా బెంచ్‌మార్క్ క్లాసిక్ సంగీతంలా ఉండాలి’’ అని నాతో ఆర్జీవీగారు అన్నారు. వెంటనే నాకు కల్యాణీ మాలిక్‌గారి పేరు మైండ్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆయన సంగీతం అందించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలోని పాటను వినిపించాను. వెంటనే ఆర్జీవీగారు కల్యాణి మాలిక్‌ను తీసుకుందాం అన్నారు. వర్మగారికి సాహిత్యంపై పట్టు ఉంది. ఆయనకు ఎన్టీఆర్‌గారంటే విపరీతమైన అభిమానం. అగస్త్య మంజు ఈ సినిమాకు చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పడిన కష్టానికి దర్శకత్వంలో అర్ధభాగం ఇచ్చారు వర్మగారు. జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. నా కెరీర్ పట్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఖాళీ లేకుండానే పని చేస్తున్నాను’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రం విడుదల కాకపోవడం చాలా బాధగా ఉంది. బాగా నిరుత్సాహపడ్డాను. ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అక్కడ కూడా విడుదలైతే... ఇంత మంచి పేరు అక్కడ కూడా వచ్చి ఉండేదనే ఫీలింగ్ ఉంది. నా పరంగానే కాదు నిర్మాత కూడా చాలా నష్టపోయి ఉంటారు. నా సొంత ఊరు కొవ్వూరు. నా సొంత ఊరు కొవ్వూరులో నేను పని చేసిన సినిమా విడుదల కాలేదు. -
శ్రీదేవీ జీవితంపై వర్మ సినిమా?
ముంబై : అనంతలోకాలకి వెళ్ళిన అందాల తార శ్రీదేవి మరణాన్ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అసలు తట్టుకోలేకపోతున్నారు. శ్రీదేవీ మరణించిందన్న విషయం తెలిసిన దగ్గర్నుంచి వర్మ బాధ వర్ణనాతీతం. సముద్రమంత ప్రేమను కురిపిస్తున్న అభిమానుల కోసమైనా దేవుడు తన మనసును మార్చుకుని ఆమెని వెనక్కి పంపాలంటూ పలు ట్వీట్స్ సైతం చేశారు. శ్రీదేవీ జీవితం గురించి ఎవరికీ తెలియని విషయాలంటూ అభిమానులకు ఓ ప్రేమ లేఖ కూడా రాశాడు. ఇప్పుడిక శ్రీదేవీ జీవితంపై సినిమా తీయాలని నిర్ణయించారట. శ్రీదేవీ జీవితం రామ్ గోపాల్ వర్మ సినిమా తీయబోతున్నారంటూ.. ఆయనకు అత్యంత సన్నిహితుడు, గీత రచయిత సిరశ్రీ ఓ టీవీ ఛానల్ ప్రొగ్రామ్‌లో చెప్పినట్టు తెలుస్తోంది. స్టోరీ తుది రూపం దాల్చగానే, ఈ బయోపిక్‌పై వర్మ అధికారిక ప్రకటన చేస్తారంటూ సిరశ్రీ చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఆర్జీవీ నుంచి దీనిపై ఎలాంటి ప్రకటనలు రాలేదు. అయితే రామ్ గోపాల్ వర్మ, శ్రీదేవీ జీవితంపై సినిమా తీయబోతున్నాడంటూ వార్తలు హల్ చల్ చేస్తున్న క్రమంలో, ఆయన ఈ సినిమాను ఏఏ కోణాల్లో తెరకెక్కిస్తారంటూ సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘శ్రీదేవి అభిమానులకు నా ప్రేమలేఖ’’ అంటూ వర్మ పెట్టిన పోస్టులో బయటి ప్రపంచం ఊహించే దానికంటే సెలబ్రిటీల వాస్తవ జీవితం భిన్నంగా ఎలా ఉంటుందో... వాటన్నిటిలోకల్లా ప్రత్యేకమైనది శ్రీదేవి జీవితం అంటూ చెప్పుకొచ్చారు. శ్రీదేవీని అమితంగా ప్రేమించే రామ్ గోపాల్ వర్మ, ఆమెతో పాటు క్షణం క్షణం సినిమా తీశారు. -
వర్మ మరింత రాజేశాడు...!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా కడప పేరుతో వెబ్ సీరీస్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమాగా తెరకెక్కిస్తే సెన్సార్ బోర్డ్ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తను అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించేందుకు డిజిటల్ మీడియంను ఎంచుకున్నట్టుగా తెలిపారు వర్మ. అందుకు తగ్గట్టుగా విపరీతమైన రక్తపాతంతో కడప ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. తాజాగా ఈ వెబ్ సీరీస్ కు సంబంధించిన టైటిల్ సాంగ్ తో పాటు లిరికల్ వీడియోనే రిలీజ్ చేశాడు. వర్మ ఆస్థాన రచయిత సిరాశ్రీ సాహిత్యమందించిన ఈ పాటకు రవిశంకర్ సంగీతమివ్వగా.. నవరాజ్ హన్స్ ఆలపించాడు. అంతా కొత్తవారితో తెరకెక్కిస్తున్న ఈ సీరీస్ ను ఎన్ అండ్ ఎన్ క్రియేషన్స్, ఏ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. -
అమితాబ్ సినిమాకు పాట రాసిన తెలుగు రచయిత
దక్షిణాది నుంచి హిందీ సినిమాల్లో పనిచేసే నటులుంటారు, సంగీత దర్శకులు ఉంటారు, దర్శకులు ఉంటారు. కానీ గీతరచయితల గురించి ఎప్పుడైనా విన్నామా? తొలిసారిగా తెలుగు సినీగీతరచయిత సిరాశ్రీ బాలీవుడ్ సినిమాకి పాట రాసారు. అది కూడా ఏకంగా అమితాబ్ బచ్చన్ సినిమాకి. రామ్ గోపాల్ వర్మ చాలా కాలం తర్వాత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న 'సర్కార్-3' చిత్రానికి గాను సిరాశ్రీ 'థాంబా..' అంటూ ఒక హిందీ పాట రాశాడు. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అమితాబ్ సినిమాకు పాట రాయటంపై సిరాశ్రీ స్పందిస్తూ, 'తెలుగులో పాటలు రాసుకునే నేను హిందీ సినిమాకు పాట రాస్తానని కలలో కూడా అనుకోలేదు. అది కూడా సాక్షాత్తు అమితాబ్ బచ్చన్‌కి రాస్తానని అసలు ఊహలో కూడా లేదు. ఆర్జీవి ఇక తెలుగులో సినిమాలు చెయ్యను అన్నారు. అది జరిగితే, ఇక ఆయనకు నాతో గీతరచయితగా జర్నీ ఆగిపోయినట్టే. అది జరగడం ఇష్టం లేదు. అందుకే ఇలా నా నుంచి హిందీపాట తన్నుకొచ్చింది అని నా ఫీలింగ్. 'నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్' కదా! ఏళ్ల తరబడి చూసిన హిందీ సినిమాలు, విన్న హిందీ పాటలు, కాలేజీ రోజుల్లో ఎన్సీసీ క్యాంపుల వల్ల పట్టుబడిన కొంత హిందీ, ఆర్జీవీ సాహచర్యం వల్ల పెరిగిన హిందీ మిత్రులు...ఇలా అన్ని విషయాలు నాకు తెలియకుండానే ఉపయోగపడ్డాయి'. అని ఫేస్ బుక్ లో తన ఆనందాన్ని పంచుకున్నాడు.