సిరిసిల్లలో టెక్స్టైల్స్ అడ్వైజరీ కమిటీ
- పదిహేను మంది సభ్యులుండే అవకాశం
- మరో నాలుగు ప్రత్యేక కమిటీలు
- నేత కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
- వస్త్ర పరిశ్రమపై సర్కారు ఆజమారుుషీ
- కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఆటుపోట్ల వస్త్ర పరిశ్రమకు ఊరట లభించేనా?
సిరిసిల్ల : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తరచూ ఎదుర్కొంటున్న ఆటుపోట్లను అధిగమించేం దుకు టెక్స్టైల్స్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆత్మహత్యలు, ఆకలిచావులు, సమ్మెలు, సంక్షోభాల వస్త్ర పరిశ్రమను ఒడ్డుకు చేర్చేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు చేపడుతోంది. ప్రైవేటు యాజమాన్యం చేతుల్లో ఉన్న వస్త్ర పరిశ్రమపై ప్రభుత్వ పరంగా అజమాయిషీ ఉండేలా చర్యలు తీసుకుంటోంది.
సిరిల్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 34వేల మరమగ్గాలు ఉండగా, 25వేల మంది కార్మిక కుటుంబాలు వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డాయి. అంతర్జాతీయంగా నూలు ధరలు పెరగడం, తగ్గడం వంటి సమస్యలతో వస్త్ర పరిశ్రమ తరచూ కుదేలవుతోంది. ఇక్కడ ఉత్పత్తయిన గుడ్డకు ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో వస్త్రోత్పత్తుల కొనుగోళ్లు ఆధారపడి ఉండడంతో ప్రభుత్వ పరంగా అజమాయిషీ లేదు.
దీంతో వస్త్రం అమ్మక నిల్వలు పేరుకుపోయి పెట్టుబడులు లేక యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లకోసారి కూలీ రేట్లు పెంచడం, పాలిస్టర్, కాటన్ గుడ్డ ఉత్పత్తిలో పన్నెండు గంటల పాటు శ్రమిస్తున్నా గిట్టుబాటు కూలీ రావడం లేదని కార్మికులు సమ్మె చేయడం పరిపాటిగా మారింది. ఈ సమస్యలన్నింటీపై సమగ్ర అధ్యయనం, సహేతుకమైన కూలీ రేట్ల నిర్ణయం, పని గంటల విధానం వంటి అంశాలపై అధ్యయనం చేసి అధికారులు, పారిశ్రామికవేత్తలు, కార్మిక సంఘాల నేతలు, జౌళి శాఖ అధికారులు సభ్యులుగా మొత్తం 15 మందితో అడ్వైజరీ కమిటీ నియమించాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందులో నాలుగు కమిటీలు వేసి వస్త్ర పరిశ్రమ సంక్షోభాలను అధిగమించాలని భావిస్తోంది.
కమిటీ ఏం చేస్తుందంటే...
అడ్వరుజరీ కమిటీ పర్యవేక్షణలో వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, భవిష్యత్‌లో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తిస్తూ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన సహకారాన్ని నిర్దేశించనుంది. వస్త్రాన్ని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేయని పక్షంలో స్థానికంగా నిల్వ చేసి యజమానులకు బ్యాంకు రుణాలు ఇప్పించడం, తక్కువ వడ్డీతో వస్త్ర పరిశ్రమ నడిచేలా చర్యలు తీసుకోవడం, కార్మికులకు నిరాటంకంగా ఉపాధి కల్పించడం వంటి చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేస్తూ వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తుంది.
సిరిసిల్లలో పన్నెండు గంటల పని విధానం అమలవుతుండగా, దాన్ని కుదించడం, అవసరమైన సమయాల్లో పెంచుకోవడం, కార్మికుల మనోభావాలను గుర్తించడం, ఆర్థిక ఇబ్బందులున్న కార్మిక కుటుంబాలకు ప్రభుత్వ పరంగా చేయూతనివ్వడం వంటివి కమిటీ పర్యవేక్షణలో జరుగుతారుు. అలాగే వస్త్ర పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం, వారికి ఎదురయ్యే ఆరోగ్య పరమైన సమస్యలను అధిగమించడం, దురలవాట్లకు దూరంగా ఉంచేందుకు కౌన్సెలింగ్ నిర్వహించడం, పింఛన్లు, అంత్యోదయ కార్డులు, పని భద్రత కల్పించడం, సామూహిక బీమా సదుపాయం, కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు ఇవ్వడం, కార్మిక కుటుంబాల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి ప్రత్యక్షంగా కార్మికుల సంక్షేమానికి పాటుపడడం ఈ కమిటీ లక్ష్యం.
ఆత్మహత్యల నివారణపై దృష్టి
సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం, కమ్యూనిటీ ఫెసిలిటేటర్ల సంఖ్యను పెంచి కార్మికుల స్థితిగతులపై నిఘా ఉంచడం వంటి చర్యలను కమిటీ చేపట్టనుంది. ప్రస్తుతం కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఉండగా, మరో ఎనిమిది మందిని నియమించి కార్మిక క్షేత్రంలో మానసిక వేదనకు గురయ్యే నేతన్నలను గుర్తించేందుకు కమిటీ పని చేస్తుంది. కూతురు పెళ్లి చేసేందుకు ఇబ్బందిపడేవారు, ఇతర ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారిని మహిళా సంఘాల సాయంతో గుర్తించడం వంటి మార్గాల్లో నేతన్నల ఆత్మహత్యలను నివారించానికి కృషి చేస్తుంది.
కార్మిక వాడల్లో సామూహిక కౌన్సెలింగ్ నిర్వహించడం, మద్యానికి బానిసైన వారిని ఆ వ్యసనం నుంచి దూరం చేయడం వంటి చర్యలను ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. మొత్తంగా టెక్నికల్, నాన్‌టెక్నికల్ పారిశ్రామికవేత్తలు, జౌళి శాఖ అధికారులు, వస్త్ర వ్యాపారులు, కార్మిక నేతలతో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి కోసం కమిషనర్‌ను నియమించి, పార్క్ నిర్వహణతో పాటు మౌలిక సదుపాయూలను మెరుగుపర్చడం మరో ప్రధానమైన ఉద్దేశం.