sirte
-
ఐసిస్‌ను ఊడ్చిపారేశారు!
లిబియా: ఉగ్రవాదుల చెరు నుంచి లిబియా ఊపిరి పీల్చుకుంది. తమ దేశంలో పాగా వేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను దాదాపు పూర్తిగా ఊడ్చిపారేసింది. అమెరికా సేనల సహాయంతో సిర్టీలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చివరి బేస్ క్యాంపుపై విజయవంతంగా లిబియా సేనలు వైమానిక దాడులు నిర్వహించాయి. దీంతో ఆ ప్రాంతంలోని ఉగ్రవాదుల నివాసాలు, బంకర్లు ధ్వంసమయ్యాయి. అక్కడ ఉన్న ఉగ్రవాదులంతా పరారై పోయారు. దీంతో సిర్టీ, గిజి బరియా జిల్లాలపై లిబియా సైన్యం పూర్తి స్థాయిలో పట్టు సంపాధించినట్లయింది. ఈ దాడులకు ముందు పలువురు మహిళలను, చిన్నపిల్లలను ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. అయితే, దాడులు చేసిన వెంటనే వారిని విడిచిపెట్టి పారిపోయారు. ఈ విజయంతో లిబియా సేనలు అమెరికా సేనలతో కలిసి సంబురాల్లో మునిగిపోయాయి. తమ వీర జవానుల త్యాగం వృధా కాలేదంటూ సైనికులు నినాదాలు చేశారు. సిర్టీలో పట్టు కోల్పోవడం ఇస్లామిక్ స్టేట్ కు పెద్ద ఎదురుదెబ్బ అయింది. ఇతర దేశాల్లో ఆ సంస్థ హవా ఉన్నప్పటికీ లిబియాలో ఎక్కడా కూడా తనకంటూ ప్రత్యేక స్థావరం లేకుండా పోయింది. 2015లో సిర్టీలో చొరబడిన ఉగ్రవాదులు అక్కడే తిష్టవేసి ఆ ప్రాంతంపై పట్టు సాధించి ముప్పు తిప్పలు పెట్టారు. ఈ నేపథ్యంలో లిబియా అమెరికా సంయుక్త సేనలు దాడులకు దిగి విజయం సాధించాయి. ఫ్రాన్స్ రక్షణ మంత్రి జీన్ వెస్ లీ డ్రియాన్ ఈ సందర్భంగా సైనికులకు అభినందనలు చెప్పారు. ఇది నిజంగా ఓ శుభవార్త, ఉగ్రవాదులను దెబ్బకొట్టడం చాలా గొప్ప చర్య అని, సైనికులను అభినందించకుండా ఉండలేకపోతున్నాని చెప్పారు. -
ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఆ ఇద్దరు
హైదరాబాద్: లిబియాలో కిడ్నాప్‌కు గురైన భారతీయుల్లో ఇద్దరి జాడ ఇంకా తెలియరాలేదు. లిబియాలోని సిర్తేలో గత బుధవారం నలుగురు భారతీయులను బందీలుగా తీసుకెళ్లిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు.. శుక్రవారం రాత్రి ఇద్దరిని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఉగ్ర చెరలోఉన్న తెలుగు పౌరులు గోపీకృష్ణ, బలరామ్ కిషన్‌లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎప్పుడు విడుదలవుతారు? అనే విషయాలపై ఉత్కంఠ కొనసాగుతున్నది. కిడ్నాపర్ల చెరనుంచి ఇద్దరి విడుదల సందర్భంగా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో మిగిలిన ఇద్దరిని కూడా విడిపించేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయాత్నాలు సాగాయి? ఫలితమేమిటి? అనే విషయాలపై స్పష్టత రాలేదు. దీంతో హైదరాబాద్ లోని చిలువేరు బలరామ్ కిషన్ నివాసంతోపాటు తిరువీధుల గోపీకృష్ణ కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. కిడ్నాపైన నలుగురూ బుధవారం ట్రిపోలి మీదుగా భారత్‌కు వస్తుండగా వర్సిటీకి 50 కి.మీ. దూరంలోని ఓ చెక్‌పాయింట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్ రాజ్యస్థాపన కోసం ఇరాక్, సిరియాలలో నెత్తుటేర్లు పారిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్ శుక్రవారం విడుదలయ్యారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. మిగతా ఇద్దరినీ విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా కిడ్నాప్ ఉదంతంపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటనలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. 'ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో ఇండియా వ్యాపారం చేస్తోందా? ఇద్దరిమధ్యా ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది చర్చించుకునేందత దగ్గరితనం ఉందా?' అంటూ సుష్మా స్వరాజ్ చేసిన ట్వీట్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. బందీలను విడిపించడం సుష్మా స్వరాజ్ చేతిలో వ్యవహారమైతే గతంలో కిడ్నాప్ కు గురై ఇప్పటికీ ఆచూకీ లేకుండా పోయిన 39 మంది పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.