sitanagaram ghat
-
తాడేపల్లి అత్యాచార ఘటనలో.. నిందితుడి అరెస్టు
గుంటూరు ఈస్ట్ : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్ వద్ద యువతిపై లైంగికదాడి చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితుల్లో ఒకరిని అర్బన్ పోలీసులు అరెస్టుచేశారు. నిందితుల నుంచి సెల్ఫోన్లను తాకట్టు పెట్టుకున్న వ్యక్తిని కూడా అరెస్టుచేశారు. అర్బన్ ఎస్పీ కార్యాలయంలో శనివారం ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. నేరం చేసిందిలా.. తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌కు చెందిన కృష్ణకిశోర్ సీలింగు వర్కులు, అలాగే.. మహానాడు ప్రాంతానికి చెందిన ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకటరెడ్డి కబోర్డు పనులు చేసుకుంటుంటారు. గత జూన్ 19 రాత్రి వీరిద్దరూ సీతానగరం రైల్వే బ్రిడ్జిపై కాపర్ వైర్లు దొంగతనం చేస్తుండగా దానిని చూసిన వ్యక్తిని అక్కడే హత్యచేసి మృతదేహాన్ని నదిలోకి తోసేసి ఇసుకలో నడుచుకుని వెళ్తున్నారు. అదే సమయంలో పుష్కర్‌ఘాట్ వద్ద ఓ యువతి, ఆమె స్నేహితుడు వారికి కనిపించారు. మద్యం మత్తులో ఉన్న నిందితులిద్దరూ వారిని తాళ్లతో కట్టేసి యువతిపై లైంగికదాడి చేశారు. అనంతరం వారి సెల్ఫోన్లు లాక్కుని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. అనంతరం నిందితులు విజయవాడ వైపు వెళ్లి రాత్రంతా రాణిగారితోటలో నది ఒడ్డున ఇసుకలో పడుకున్నారు. మరుసటి రోజు తాడేపల్లి వచ్చి బాధితుల వద్ద లాక్కున సెల్ఫోన్లను స్నేహితుడైన హబీబ్ వద్ద తాకట్టు పెట్టారు. అక్కడి నుంచి ఇద్దరూ ఒంగోలు వెళ్లారు. అనంతరం కృష్ణకిశోర్ హుబ్లీ, నిర్మల్, బైంసా ఆ తర్వాత సికింద్రాబాద్‌లో తిరిగాడు. తన తల్లిని చూసేందుకు ఇటీవల విజయవాడ చేరుకున్న క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో నిందితుడు పరారీలో ఉన్నాడు. మారు వేషాలలో పోలీసుల గాలింపు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాలకు వెళ్లి గాలించారు. నిందితులు కొన్నిచోట్ల అడుక్కుంటూ, కొన్ని ప్రాంతాలలో ఖాళీ సీసాలు అమ్ముకుని బతుకుతుండగా పోలీసులు వీరి కోసం ఆయా వేషాలతో జల్లెడ పట్టారు. చివరకు కృష్ణకిషోర్‌ను అరెస్టుచేశారు. నిందితుల్ని పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ హఫీజ్ అభినందించారు. -
సీతానగరం ఘాట్ వద్ద బారికేడ్లు తొలగింపు
సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాల సందర్భంగా సీతానగరం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగిస్తున్నారు. భారీ అంచనాలతో కృష్ణా పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1700 కోట్లు ఖర్చుచేస్తోంది. లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేసింది. అందులో భాగంగా దుర్గా, కృష్ణవేణి, పున్నమి, సీతానగరం, పద్మావతి, తాళ్లాయపాలెం, అమరావతి, పవిత్రసంగమం ఘాట్లు ముఖ్యమైనవి. ఒక్కో ఘాట్‌కు సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసింది. ఘాట్ వద్ద రూ.15 లక్షలతో ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్లలలో సీతానగరం ఘాట్‌కు ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారని భావించిన అధికారయంత్రాంగం ఉండవల్లి సెంటర్ నుంచి మూడులైన్ల బారికేడ్లను ఏర్పాటు చేసింది. కాని ఆ మేరకు యాత్రికులు రాకపోవడంతో ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగిస్తున్నారు. -
మహానేతను మరవలేము
అమరావతి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్‌లో సోమవారం కొందరు యువకులు పిండప్రదానం చేసి ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. పుష్కరాల్లో పవిత్రస్నానం చేయటానికి వచ్చేవారిలో అధికశాతం పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతలకు చెందిన 45 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, కొందరు యువకులు వైఎస్సార్ చిత్రపటంతో తాడేపల్లి పరిధిలోని సీతానగరం ఘాట్‌కు చేరుకున్నారు. ముందుగా చిత్రపటంతో ఘాట్‌లో స్నానం చేశారు. అనంతరం పిండప్రదానం షెడ్ వద్ద చిత్రటానికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. తిరిగి ఘాట్ వద్దకెళ్లి కృష్ణా నదిలో పిండాలను విడిచిపెట్టారు. వైఎస్సార్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరినీ వైఎస్ ఆదుకున్నారన్నారు. ఆయన మరణం తరువాత రాష్ట్రం అవస్థల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన సభ్యులు మూర్తాల ఉమామహేశ్వరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఓర్సు కాశయ్య, తిరుపతిరెడ్డి, గుండా కిషోర్, సర్పంచ్ గుర్రాల రాజు, ఉప సర్పంచ్ ఏలూరు సత్యనారాయణ, ఎంపీటీసీలు ఉమ్మా రామాంజనేయరెడ్డి, జి.పద్మజానాథ్రెడ్డి, బీసీ సెల్ మండల కన్వీనర్ తిరుపతిరావు, చెవిరెడ్డి ఏరువ, పమ్మి సీతారామిరెడ్డి తదితరులు ఉన్నారు. -
కోట్లు ఖర్చు చేసి మురికి నీటిలో స్నానాలు: ఆర్కే
గుంటూరు : పుష్కరాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భక్తులను మురికి నీటిలో స్నానాలు చేయిస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) మండిపడ్డారు. పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం సీతానగరంలోని పుష్కరఘాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అరకొరగా వచ్చిన కొద్దిమంది భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. లీడింగ్ చానల్ ఏర్పాటుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, భక్తులు స్నానాలు చేసే ఘాట్‌లో మురికి నీరు తోడిపోస్తున్నారని విమర్శించారు. నీటిని తోడేందుకు ఏర్పాటుచేసిన మోటార్లు పనిచేస్తున్నాయో లేదో కూడా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. స్నానం చేసిన అనంతరం శరీరంపై దద్దుర్లు, దురదలు వస్తున్నాయని పలువురు భక్తులు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. పుష్కరాల తొలి రోజే ఇలా ఉంటే, మిగిలిన 11 రోజుల్లో భక్తుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిధులు ఖర్చు చేసి ఘాట్లు నిర్మించినా.. నీళ్లు వదలడంలో అధికారులు చేతులెత్తేశారని విమర్శించారు. పుష్కరాల పేరుతో చేయించిన పనులు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకా? లేక భక్తుల కోసం చేసినవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కర విధులు నిర్వహిస్తున్న అధికారులతో ఏర్పాట్లపై మాట్లాడారు. ఆర్కే వెంట వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు ఈదురుమూడి డేవిడ్‌రాజు, పట్టణాధ్యక్షుడు వేణుగోపాలస్వామిరెడ్డి తదితరులున్నారు.