మహానేతను మరవలేము
అమరావతి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్‌లో సోమవారం కొందరు యువకులు పిండప్రదానం చేసి ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. పుష్కరాల్లో పవిత్రస్నానం చేయటానికి వచ్చేవారిలో అధికశాతం పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతలకు చెందిన 45 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, కొందరు యువకులు వైఎస్సార్ చిత్రపటంతో తాడేపల్లి పరిధిలోని సీతానగరం ఘాట్‌కు చేరుకున్నారు. ముందుగా చిత్రపటంతో ఘాట్‌లో స్నానం చేశారు. అనంతరం పిండప్రదానం షెడ్ వద్ద చిత్రటానికి ప్రత్యేకపూజలు నిర్వహించారు.
తిరిగి ఘాట్ వద్దకెళ్లి కృష్ణా నదిలో పిండాలను విడిచిపెట్టారు. వైఎస్సార్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరినీ వైఎస్ ఆదుకున్నారన్నారు. ఆయన మరణం తరువాత రాష్ట్రం అవస్థల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన సభ్యులు మూర్తాల ఉమామహేశ్వరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఓర్సు కాశయ్య, తిరుపతిరెడ్డి, గుండా కిషోర్, సర్పంచ్ గుర్రాల రాజు, ఉప సర్పంచ్ ఏలూరు సత్యనారాయణ, ఎంపీటీసీలు ఉమ్మా రామాంజనేయరెడ్డి, జి.పద్మజానాథ్‌రెడ్డి, బీసీ సెల్ మండల కన్వీనర్ తిరుపతిరావు, చెవిరెడ్డి ఏరువ, పమ్మి సీతారామిరెడ్డి తదితరులు ఉన్నారు.