YSRCP Plenary Meeting 2022: AP CM YS Jagan Speech Highlights - Sakshi
Sakshi News home page

CM Jagan Speech At YSRCP Plenary: మీ అందరికి సెల్యూట్‌ చేస్తున్నా..

Published Fri, Jul 8 2022 12:06 PM | Last Updated on Sat, Jul 9 2022 8:51 AM

CM YS Jagan Speech At YSRCP Plenary 2022 - Sakshi

‘పావురాలగుట్టలో 13 ఏళ్ల క్రితం.. అంటే 2009 సెప్టెంబరు 25న ఈ సంఘర్షణ మొదలైంది. ఓదార్పు యాత్రతో ఓ రూపం సంతరించుకుని, 2011 మార్చిలో వైఎస్సార్‌సీపీగా ఆవిర్భవించింది. 11 ఏళ్ల క్రితం నాన్న గారి ఆశయాల సాధన కోసం.. మనందరి ఆత్మాభిమానం కోసం ఈ పార్టీ పుట్టింది. మీరంతా అవమానాలను సహించి, కష్టాలను భరించి, నన్ను అమితంగా ప్రేమించారు. ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, అక్కకు, చెల్లెమ్మకు, అవ్వా తాతలకు, ప్రతీ కార్యకర్తకు, ప్రతి అభిమానికి.. మన జెండా తమ గుండెగా మార్చుకున్న వైఎస్సార్‌సీపీ యోధులకు, కోట్లమంది మనసున్న మనుషులకు మీ జగన్‌ ప్రేమ పూర్వకంగా, హృదయ పూర్వకంగా, కృతజ్ఞతా పూర్వకంగా, మీ వాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా సెల్యూట్‌ చేస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగంతో అన్నారు.

వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: శుక్రవారం విజయవాడ గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి ప్రభంజనంలా తరలివచ్చిన శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో 95 శాతం హామీలను అమలు చేసి.. సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం చేయడమంటే ఇలా అని చాటిచెప్పామన్నారు. మనం ప్రజలకు చేస్తున్న మంచిని చూసి జీర్ణించుకోలేకే అసూయతో ప్రతిపక్షం మనపై నిందలేస్తోందని మండిపడ్డారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

నా గుండె బెదరలేదు.. సంకల్పం చెదర లేదు 
►2009 నుంచి ఈ రోజు వరకు అంటే ఈ 13 సంవత్సరాల ప్రయాణంలో మన బాటలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎన్ని ముళ్లున్నా, మన మీద ఎన్ని రాళ్లు పడినా, ఎవరు పగబట్టినా, ఎన్ని వ్యవస్థలు మన మీద కత్తి కట్టినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు విలువ లేదు.. నా గుండె బెదరలేదు. నా సంకల్పం చెదరలేదు. 
►నాన్న చనిపోయిన తర్వాత నాకు ఇచ్చిన ఈ జగమంత కుటుంబం ఏనాడూ నా చేయి విడవలేదు. తోడుగా నిలబడ్డారు. అడుగులు వేయడంలో బలాన్నిచ్చారు. కాబట్టే 2019లో అంటే మూడేళ్ల క్రితం చరిత్రలో కనీ వినీ ఎరగని విధంగా మెజారిటీ వచ్చింది. దేవుడి దయ, మీ అందరి అండతో పాటు, ప్రజలు గొప్పగా ఆశీర్వదించారు. ఆ ఆశీస్సులు, దేవుడి దయతో 175 స్ధానాలకుగాను ఏకంగా 151 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు.
►ఒకవైపు 175 స్థానాలకు 151 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజలు మనకు అధికారం ఇవ్వగా.. మరోవైపు ఆ దేవుడి దయ చూడండి.. 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొన్న వారిని 23 ఎమ్మెల్యే స్థానాలకు, మూడు ఎంపీ స్థానాలకు పరిమితం అయ్యేటట్టు చేశారు. 
మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌  
►అధికారం అంటే అహంకారం కాదు. అధికారం అంటే ప్రజల మీద మమకారం అని నిరూపిస్తూ.. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారం వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల్లో అయినా ప్రజల కోసమే బతికాం. పేదల కోసం, సామాన్యూల కోసం, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారి కోసమే బతికాం. అనుబంధాల కోసమే బతికాం. చెప్పిన మాట నిలబెట్టుకునేందుకే ప్రతిక్షణం తపిస్తూ బతికాం.
►గతంలో ఎన్నికలప్పుడు మేనిఫెస్టో విడుదల చేసేవారు. ఆ తర్వాత దానిని చెత్తబుట్టకే పరిమితం చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో చూశాం. అటువంటి పరిస్థితి నుంచి మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి ఈ మూడేళ్లు పాలన సాగించాం. ఈ పరిస్థితిలో తన మేనిఫెస్టోను చూపించడానికి టీడీపీ భయపడి.. యూట్యూబ్‌ నుంచి, వారి వెబ్‌సైట్‌ నుంచి తీసేయించింది. మన మేనిఫెస్టోను చూసి భయపడుతోంది.
►మనం ఈ మూడేళ్లలోనే 95 శాతం హామీలు అమలు చేశాం. ఈ మేనిఫెస్టోను చూపిస్తూ.. గడప గడపకూ వెళ్లి మనిషి, మనిషినీ కలుస్తున్నాం. అక్కా, అన్నా.. అవ్వా.. తాతా.. ఈ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలన్నీ మీకు అందాయా అని అడుగుతుంటే.. వారు చిరునవ్వుతో అందాయని ఆశీర్వదిస్తుండటం కనిపిస్తోంది. 
ప్రతి రంగంలోనూ మనదైన ముద్ర 
►ప్రతి రంగంలో మనదైన ముద్ర వేయగలిగాం. మూడేళ్ల పాలనలో రెండు సంవత్సరాలు కరోనా సవాల్‌ విసిరినా.. ఆర్థికంగా అంతకు ముందు పాలకుడు, గత ప్రభుత్వంలో చంద్రబాబు రాష్ట్రాన్ని ముంచేసిపోయినా..  వారు పెట్టిన బకాయిలు మనమే కట్టాల్సి వచ్చినా చెల్లించాం. నవరత్నాల పాలనను అందిస్తామని చెప్పిన మాటను తప్పకుండా అమలు చేస్తానని మీ అన్నదమ్మునిగా తెలియజేస్తున్నాను. 
►2009 నుంచి 2019 వరకు కానివ్వండి.. 2019 నుంచి 2022 వరకు కానివ్వండి.. ఇక మీదట జరగబోయే ప్రయాణం కానివ్వండి.. ఒక మాట కోసం, నిబద్ధత కోసం, విలువల వ్యవస్థ సాధించడం కోసం మన పాలన, మన ప్రయాణం సాగుతుంది. 

ఒక్క పథకానికీ చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌ కాదు 
►మూడేళ్లలోనే నవరత్నాలులో ప్రతి పథకాన్ని అమలు చేసిన మన పార్టీ మీద, మన ప్రభుత్వం మీద.. 14 ఏళ్లు సీఎంగా పని చేసినప్పటికీ.. ఆయన పేరు చెబితే ఏ ఒక్క పథకానికీ కేరాఫ్‌ అడ్రస్‌ కాని వ్యక్తి నోరు పారేసుకుంటున్నాడు. ఆ విమర్శలు, కట్టుకథలు, పచ్చి బూతులకు అబద్ధాలు జోడించి ప్రచారం చేసే వాళ్లు ఈ రోజు పత్రికలు, టీవీలు నడుపుతున్న పరిస్థితి. మన కర్మ కొద్దీ చూస్తున్నాం. 
►వీరంతా అప్పట్లో అధికారాన్ని అడ్డు పెట్టుకుని బాగా మెక్కేసారు. బాగా నొక్కేశారు. బాగా దోచుకుని పంచుకున్నారు. ఇప్పుడు ఆ పంచుకోవడం ఆగిపోయింది. ఈ గజ దొంగల ముఠాకు అందుకే నిద్ర పట్టడం లేదు. అందుకే వీరికి కడుపు మంట ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. ఎన్ని జలిసిల్‌ మాత్రలు ఇచ్చినా వీళ్ల కడుపు మంట తగ్గదు.  
నాకు వాళ్ల తోడు ఉండకపోవచ్చు..
►నాకు ఈ చంద్రబాబు మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు. వాళ్ల మాదిరిగా దత్తపుత్రుడి అండా ఉండకపోవచ్చు. కానీ నాకు ఉన్నది మీ తోడు ►ఈ విషయాలన్నింటిపై మనతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఆలోచించేలా ఈ ప్లీనరీలో తీర్మానాలు, చర్చలు, ప్రసంగాలు ఉపయోగపడతాయని ఆకాంక్షిస్తున్నా. రేపు (శనివారం) సాయంత్రం విస్తృత స్థాయిలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన, వస్తున్న కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి మరోసారి మాట్లాడతాను. 

గజ దొంగల ముఠాకు చేతలతోనే సమాధానం 
►ఎలాంటి అడుగులు వేశాం, చరిత్రలో ఎప్పుడైనా గతంలో ఇలాంటి అడుగులు పడ్డాయా? ఇంతటి మార్పు ఎప్పుడైనా చూశామా? అన్నది కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తున్నా, అసూయతో గిట్టని వారు విమర్శిస్తూ నిందలు వేస్తున్నారు. మంచి చేసిన చరిత్రగానీ, మాటకు విలువ ఇచ్చిన నైతికతగానీ ఏనాడైనా ప్రతిపక్షానికి ఉన్నాయా? అని ఇవాళ నేను సవాల్‌ విసురుతున్నా.
►దుష్ట చతుష్టయం అంటే మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీరికితోడు వీరికొక దత్తపుత్రుడు. ఈ ఎల్లో మీడియా, ఎల్లో పార్టీల జాయింట్‌ గజ దొంగల ముఠా రాతలు, పైశాచిక మాటలకు మనం చేతల్లోనే సమాధానమిస్తాం.
►అన్ని రకాలుగా ఇంటింటికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సామాజిక వర్గానికి చేసిన మంచి ద్వారా మనం సమాధానమిస్తాం. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఇప్పటికే 95 శాతం అమలు చేసిన పార్టీ వైఎస్సార్‌సీపీ.  చెప్పిన ఏ ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేసిన వారు ఈ రోజు విమర్శలు చేస్తున్నారు.

మాటకు కట్టుబడిన పార్టీ వైఎస్సార్‌సీపీ 
►మన పార్టీ అంటే వైఎస్సార్‌సీపీ ఆడిన మాటకు కట్టుబడి ఉన్నామనే దానికి అర్థం తెచ్చిన పార్టీ అని సగర్వంగా తెలియజేస్తున్నా. ఈ మూడేళ్ల పరిపాలన, అంతకు ముందు మన ప్రయాణంలో చేసిన యుద్ధం.. అన్నింటిలో కూడా దేవుడి దయ మనకు పుష్కలంగా ఉంది. 
►ఈ రోజు మన ప్రభుత్వం రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏమిటో చూపించింది. ఇది గ్రామాన్ని, గ్రామ పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా, అనుకూలంగా, పారదర్శకంగా అవినీతి, వివక్ష లేకుండా ఎలా చేయగలమో, ఎలా మార్చామో చూపించింది. 
►రైతుల మీద మమకారం.. సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయం, పరిపాలనా సంస్కరణలు, అక్కచెల్లెమ్మల సాధికారత, అవ్వా తాతల మీద మమకారం, పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే విద్యా విధానం, ఆరోగ్య రంగంపై ప్రేమ, పేదల సొంతింటి కలను నిజం చేయడం, అవినీతికి తావు లేకుండా, లంచాలు అడిగే పరిస్థితి లేకుండా పారదర్శక పాలన అంటే ఈ మాదిరిగా ఉంటుందని ఈ మూడేళ్లలో చేసి చూపించింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement