కోట్లు ఖర్చు చేసి మురికి నీటిలో స్నానాలు: ఆర్కే
గుంటూరు : పుష్కరాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భక్తులను మురికి నీటిలో స్నానాలు చేయిస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) మండిపడ్డారు. పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం సీతానగరంలోని పుష్కరఘాట్‌లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అరకొరగా వచ్చిన కొద్దిమంది భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
లక్షలాదిగా భక్తులు తరలివస్తే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. లీడింగ్ చానల్ ఏర్పాటుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, భక్తులు స్నానాలు చేసే ఘాట్‌లో మురికి నీరు తోడిపోస్తున్నారని విమర్శించారు. నీటిని తోడేందుకు ఏర్పాటుచేసిన మోటార్లు పనిచేస్తున్నాయో లేదో కూడా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. స్నానం చేసిన అనంతరం శరీరంపై దద్దుర్లు, దురదలు వస్తున్నాయని పలువురు భక్తులు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు.
పుష్కరాల తొలి రోజే ఇలా ఉంటే, మిగిలిన 11 రోజుల్లో భక్తుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిధులు ఖర్చు చేసి ఘాట్‌లు నిర్మించినా.. నీళ్లు వదలడంలో అధికారులు చేతులెత్తేశారని విమర్శించారు. పుష్కరాల పేరుతో చేయించిన పనులు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకా? లేక భక్తుల కోసం చేసినవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కర విధులు నిర్వహిస్తున్న అధికారులతో ఏర్పాట్లపై మాట్లాడారు. ఆర్కే వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకుడు ఈదురుమూడి డేవిడ్‌రాజు, పట్టణాధ్యక్షుడు వేణుగోపాలస్వామిరెడ్డి తదితరులున్నారు.