వివరాలు వెల్లడిస్తున్న అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్. చిత్రంలో ముసుగులతో నిందితులు
గుంటూరు ఈస్ట్ : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్ వద్ద యువతిపై లైంగికదాడి చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితుల్లో ఒకరిని అర్బన్ పోలీసులు అరెస్టుచేశారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్లను తాకట్టు పెట్టుకున్న వ్యక్తిని కూడా అరెస్టుచేశారు. అర్బన్ ఎస్పీ కార్యాలయంలో శనివారం ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.
నేరం చేసిందిలా..
తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌కు చెందిన కృష్ణకిశోర్ సీలింగు వర్కులు, అలాగే.. మహానాడు ప్రాంతానికి చెందిన ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకటరెడ్డి కబోర్డు పనులు చేసుకుంటుంటారు. గత జూన్ 19 రాత్రి వీరిద్దరూ సీతానగరం రైల్వే బ్రిడ్జిపై కాపర్ వైర్లు దొంగతనం చేస్తుండగా దానిని చూసిన వ్యక్తిని అక్కడే హత్యచేసి మృతదేహాన్ని నదిలోకి తోసేసి ఇసుకలో నడుచుకుని వెళ్తున్నారు. అదే సమయంలో పుష్కర్‌ఘాట్ వద్ద ఓ యువతి, ఆమె స్నేహితుడు వారికి కనిపించారు. మద్యం మత్తులో ఉన్న నిందితులిద్దరూ వారిని తాళ్లతో కట్టేసి యువతిపై లైంగికదాడి చేశారు.
అనంతరం వారి సెల్‌ఫోన్లు లాక్కుని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. అనంతరం నిందితులు విజయవాడ వైపు వెళ్లి రాత్రంతా రాణిగారితోటలో నది ఒడ్డున ఇసుకలో పడుకున్నారు. మరుసటి రోజు తాడేపల్లి వచ్చి బాధితుల వద్ద లాక్కున సెల్‌ఫోన్లను స్నేహితుడైన హబీబ్ వద్ద తాకట్టు పెట్టారు. అక్కడి నుంచి ఇద్దరూ ఒంగోలు వెళ్లారు. అనంతరం కృష్ణకిశోర్ హుబ్లీ, నిర్మల్, బైంసా ఆ తర్వాత సికింద్రాబాద్‌లో తిరిగాడు. తన తల్లిని చూసేందుకు ఇటీవల విజయవాడ చేరుకున్న క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో నిందితుడు పరారీలో ఉన్నాడు.
మారు వేషాలలో పోలీసుల గాలింపు
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాలకు వెళ్లి గాలించారు. నిందితులు కొన్నిచోట్ల అడుక్కుంటూ, కొన్ని ప్రాంతాలలో ఖాళీ సీసాలు అమ్ముకుని బతుకుతుండగా పోలీసులు వీరి కోసం ఆయా వేషాలతో జల్లెడ పట్టారు. చివరకు కృష్ణకిషోర్‌ను అరెస్టుచేశారు. నిందితుల్ని పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ హఫీజ్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment