శివ.. శివా!
♦ 11 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్న
♦ శివసాగర్ ప్రాజెక్టు పనులు
♦ ప్రతి ఏడాదీ పెరుగుతున్న అంచనా వ్యయం
♦ నైరాశ్యంలో ఆయకట్టు రైతన్నలు
యాలాల: పదకొండేళ్లుగా శివసాగర్ ప్రాజెక్టు పనులు కొనసాగుతూనే ఉన్నా యి. దీంతో ఇక్కడి రైతులకు ప్రాజెక్టు ద్వారా నీరందడం తీరని కలగానే కనిపిస్తుంది. శివసాగర్ ప్రాజెక్టు విషయమై రాష్ట్ర బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడంతో ఈ ఏడాది కూడా ఇది పూర్తి కావ డం అనుమానంగానే కనిపిస్తుంది. దీం తో ఆయకట్టు రైతులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. జలయజ్ఞంలో భాగంగా యాలాల మండలం విశ్వనాథ్‌పూర్ కాక్రవేణి నదిపై శివసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 2005లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టు, ఐదు గ్రామాల రైతులకు ఉపయోగకరంగా ఉండేలా రూపకల్పన చేశారు. రూ. 5కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పనులు పూర్తవడానికి అనేక రకాల అవాంతరాలు ఎదురయ్యాయి.
ప్రాజెక్టు ఇంకా అసంపూర్తిగానే ఇక్కడి రైతులను వెక్కిరిస్తుంది. అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లు నాసిరకమైన పనులు చేపట్టడంతో కుడివైపు తూము కూలిపోయింది. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు అలుగు రెవిట్మెంట్తో పాటు దిగువ, ఎగువ ప్రాంతాలు కోతకు గురయ్యాయి. ప్రాజెక్టు పూర్తికోసం అంచనా వ్యయాన్ని గత ప్రభుత్వాలు రూ.9 కోట్లకు పెంచినా పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. కాగా ఇటీవల ప్రాజెక్టు కాల్వలకు సంబంధించి భూసేకరణ కోసం ఇరిగేషన్ అధికారులు సర్వే పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో కూడా ఊసే లేకపోవడంతో ఇక్కడి రైతుల్లో తీవ్ర నైరాశ్యం నెల కొంది. 11ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఇంకా నిర్మాణ దశలోనే కుంటు పడటంతో ప్రాజెక్టు నిర్మాణంపై ఆయకట్టు రైతులు ఆశలు వదులుకున్నారు.
ప్రభుత్వం దృష్టి పెట్టాలి..!
11 ఏళ్లుగా శివసాగర్ ప్రాజెక్టు వెక్కిరిస్తుంది. ఇటీవల కాల్వల నిర్మాణం కోసం భూసర్వేను అధికారులు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పత్రికల్లో చూశా. ప్రస్తుతం మిషన్ కాకతీయలో చెరువులకు మరమ్మతులు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శివసాగర్ ప్రాజెక్టుపై దృష్టిసారించాలి. శివసాగర్ ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడి రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుంది. -వీరేశం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
కలగానే మిగిలేలా ఉంది..!
శివసాగర్ ప్రాజెక్టు రైతన్నలకు కలగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది. ప్రభుత్వాలు మారుతున్నా శివసాగర్ తలరాత మాత్రం మారడం లేదు. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనైనా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఇక్కడి రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ విషయంలో ఇరిగేషన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి.
-గాజుల బస్వరాజ్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి