పాడుబడ్డ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదు అస్థిపంజరాలు
బెంగళూరు: కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఓ పాడుబడ్డ ఇంట్లో ఐదు అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి. అస్థిపంజరాలన్నీ ఒకే కుటుంబానికి చెందినవిగా స్థానిక సమాచారం. కుటుంబం ఒంటరిగా ఉండేదని, తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతుండేవారని బంధువులు పోలీసులకు తెలిపారు.
బాధిత కుటుంబ సభ్యులు చివరిగా జూలై 2019లో కనిపించారు. అప్పటి నుంచి వారి నివాసం తాళం వేసి ఉంది. ఇంటి ప్రధాన గుమ్మం తలుపు పగిలిపోయి ఉండటాన్ని సుమారు రెండు నెలల క్రితం స్థానికులు గుర్తించారు. అయినప్పటికీ వారు పోలీసులకు సమాచారం అందించలేదు. బాధిత ఇంట్లో పలు అనుమానాస్పద అంశాలు కనిపించాయని పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు.. ఒక గదిలో నాలుగు అస్థిపంజరాలు (మంచాలపై రెండు, నేలపై రెండు), వేరే గదిలో మరో అస్థిపంజరం కనిపించాయి. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం, సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్స్ (ఎస్‌ఓసిఓలు) సాక్ష్యాలను సేకరించారు. ఆ ఇంటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్