మారుతి, ఎన్ఎస్డీసీతో ఉబెర్ భారీ ప్రణాళిక
న్యూఢిల్లీ: ప్రముఖ టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆటో మేజర్ మారుతి సుజుకి, నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో క్యాబ్ డ్రైవర్ల శిక్షణ, మరియు సంక్షేమం కోసం ఒక పథకాన్ని ప్రకటించింది. సుమారు నాలుగు లక్షలమంది డ్రైవర్లతో అమెరికా తరువాత దేశంలో రెండవ అతిపెద్ద క్యాబ్ ప్రొవైడర్ గా ఉన్న ఉబెర్ డ్రైవర్లకు మెరుగైన శిక్షణ, సదుపాయాలకోసం కృషి చేస్తోంది. 2018 నాటికి పది లక్షల మందికి జీవనోపాధి అవకాశాలు సృష్టించే యోచనలో మారుతీ, ఎన్ఎస్డీసీ భాగస్వామ్యంతో 'ఉబెర్ షాన్ ' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మారుతీ సుజుకి భాగస్వామ్యంతో 2018 నాటికి సుమారు పదిలక్షలమందికి జీవనోపాధి అవకాశాలను కల్పించాలనే తమ లక్ష్యం నెరవేరనుందని ఉబెర్ తెలిపింది. ఈ కార్యక్రమం కింద 30,000 డ్రైవర్లకు శిక్షణ అందించాలని భావిస్తున్నామని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్ ఎస్ కల్సి తెలిపారు.
నైపుణ్యం లేని డ్రైవర్లకు శిక్షణ అందించి తీర్చిదిద్దేందుకు ఈ పథకం ఉద్దేశించిందని ఉబెర్ భారతదేశం అధ్యక్షుడు అమిత్ జైన్ పీటీఐకి తెలిపారు. అలాగే డ్రైవర్లు వాణిజ్య లైసెన్సుల, వాహనం ఫైనాన్సింగ్, లీజింగ్ పరిష్కారాల్లో ఈ ప్రణాళిక సహాయాన్నంది స్తుందన్నారు. ఢిల్లీ / ఎన్సీఆర్, హైదరాబాద్, చెన్నైలలో 4నెలల పైలట్ ప్రోగ్రాంను నిర్వహించనున్నామన్నారు. ఇది పూర్తయ్యాక దీని ఆధారంగా భారతదేశం అంతటా ఇతర నగరాలకు విస్తరిస్తామని జైన్ ప్రకటించారు. ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్డీసీ శిక్షణా కేంద్రాల ద్వారా కొత్త, పాత డ్రైవర్లకు నైపుణ్య శిక్షణ అందిస్తామని, ఆటోమొబైల్ సెక్టార్ లో స్కిల్ బిల్డింగ్ కు ఇది ప్రోత్సాహాన్నందిస్తుందని పేర్కొన్నారు.