Skin allergies
-
Health: పెరిగే వయసుతో.. ఈ సమస్యలూ పెరుగుతాయని మీకు తెలుసా!
వయసు పెరుగుతున్నకొద్దీ వెంట్రుకలు తెల్లబడుతుంటే రంగు వేస్తాం. కానీ మార్పులకు లోనయ్యే చర్మాన్ని ఏం చేయగలం? ఎవరెంత రంగు వేసినప్పటికీ... చర్మం తీరును బట్టే ఎదుటివారి వయసును అంచనా వేస్తుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మానికి కొన్ని రకాల వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉదాహరణకు.. చర్మాన్ని పొడిబార్చే జీరోసిస్ మొదలుకొని చర్మం కింద రక్తం పేరుకున్నట్లు కనిపించే పర్‌ప్యూరా వరకు అనేక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అవేమిటో, వాటి నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు / నిర్వహణ పద్ధతులూ, చికిత్సలను తెలుసుకుంటే.. పరుగులు తీసే వయసుకు స్పీడ్‌కు బ్రేకులు వేసి, యూత్‌ఫుల్‌గా కనిపించేందుకు తోడ్పడే కథనమిది. చర్మంలో ప్రధానంగా మూడు పొరలు ఉంటాయి. బయటిపొరను ఎపిడెర్మిస్, మధ్యపొరను డెర్మిస్, దాని కింద సబ్‌క్యుటేనియస్ పొర అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఎపిడర్మిస్ పొర పలుచబారడం మొదలవుతుంది. ఈ పొరలోనే ఉంటూ మేనికి రంగునిచ్చే మెలనోసైట్స్ ఉత్పత్తి తగ్గడం మొదలవుతుంది. అందుకే వృద్ధుల చర్మం పారదర్శకంగా ఉండి, లోపలి రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం పాలిపోయినట్లుగా అవుతుంది. ఇక డెర్మిస్ పొరలో చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్, ఎలాస్టిన్ అనే కణజాలాలు ఉంటాయి. వీటివల్లనే చర్మం బిగుతుగా ఉంటుంది. ఈ బిగువు తగ్గడం వల్లనే వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం సాగి, వదులవుతుంది. డర్మిస్లోని రక్తనాళాలూ బలహీనమవుతాయి. అందుకే వయసు పైబడినవారిలో చిన్న దెబ్బకైనా వెంటనే రక్తస్రావం అవుతుంది. ఇక సబ్‌క్యుటేనియస్ పొరలో కొవ్వు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కొవ్వు తగ్గిపోవడం వల్ల చర్మం మునుపటిలా కాకుండా పలచబారిపోతుంది. ఈ పొరలోనే చెమట గ్రంథులు, నూనెలాంటి పదార్థాన్ని స్రవించే సెబేషియస్ గ్రంథులు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ గ్రంథుల పనితీరు తగ్గుతూ పోయి చర్మం పొడిబారినట్లుగా అవుతుంది. నునుపుదనాన్ని కోల్పోతుంది. వెరసి... ఈ సమస్యలన్నింటి వల్ల చర్మం పటుత్వాన్ని కోల్పోయి వేలాడుతున్నట్లుగా అవడంతోపాటు ముడతలు కూడా పడుతుంది. వయసు పెరగడం వల్ల వచ్చే సమస్యలు.. జీరోసిస్ లేదా ఏస్టియోటిక్ డర్మటైటిస్ : దీన్నే వాడుకలో చర్మం పొడిబారిపోవడం అంటారు. ఈ సమస్య ముందుగా మోకాలి కింద భాగంలో ఉన్న చర్మంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆ తర్వాత దుస్తులు కప్పని ఇతర భాగాల్లోనూ కనిపిస్తుంది. ఏజ్ స్పాట్స్ లేదా లివర్ స్పాట్స్ : చర్మానికి రంగును ఇచ్చే మెలనోసైట్స్ తగ్గడం వల్ల చర్మం పాలిపోయినట్లు అవుతుంది. ఆ తర్వాత నల్లటి మచ్చలు వస్తాయి. వాటిని ఏజ్ స్పాట్స్ లేదా లివర్స్పాట్స్ లేదా లెంటిజీన్స్ అంటారు. చర్మానికి బాగా ఎండ తగిలే ప్రదేశాలలో ఇవి ఎక్కువగా వస్తాయి. చెర్రీ యాంజియోమాస్ : ఈ సమస్య ఉన్నవారిలో కొద్దిపాటి రాపిడికే రక్తనాళాలు చిట్లే ప్రమాదం ఉండడంతో పాటు చర్మంపై నుంచి రక్తనాళాలు ఎరుపు రంగులో పైకి కనిపిస్తూ ఉంటాయి. వాటిని ‘చెర్రీ యాంజియోమాస్’ అంటారు. సెబోరిక్ కెరటోసిస్ : చర్మంపై ముఖ్యంగా చేతుల మీద, ముఖంపైన కందిగింజ సైజులో సెబోరిక్ కెరటోసిస్ అనే గోధుమరంగు మచ్చలు వస్తాయి. స్కిన్ ట్యాగ్స్ లేదా యాక్రోకార్డాన్స్: చర్మం వదులుగా.. ముడత పడినట్లుగా అయి... అదనపు చర్మంలా పొడుచుకు వచ్చి, పులిపిర్లలా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా మెడమీద, బాహుమూలాల వద్ద, తొడలపైన కనిపిస్తాయి. పర్‌ప్యూరా అండ్ హిమటోమాస్: చర్మం కింద ఉన్న రక్తనాళాలు పెళుసుబారి సులువుగా చిట్లుతాయి. దాంతో అక్కడ రక్తం చేరినట్లుగా కనిపిస్తుంది. దాన్ని సినైల్ పర్‌ప్యూరా అంటారు. ఒకవేళ రక్తం పేరుకుపోయి, చర్మం ఉబ్బుగా కనిపిస్తే దాన్ని హిమటోమా అంటారు. ఎయిర్ బార్న్ కాంటాక్ట్ డర్మటైటిస్: వయసు పైబడిన వారిలో చర్మానికి చాలా తేలికగా అలర్జీలు వస్తుంటాయి. పరిసరాల్లో ఉండే మొక్కల కారణంగా చర్మంపై అలర్జీలు వస్తే దాన్ని ఎయిర్ బార్న్ కాంటాక్ట్ డర్మటైటిస్ అని అంటారు. కెరటో అకాంథోమా: వయసు పైబడుతున్న వారిలో, ఎండలో ఎక్కువగా తిరిగే కొందరిలో కాయల్లా కనిపించే వాటిని నాన్ క్యాన్సరస్ స్కిన్ గ్రోత్స్గా చెబుతారు. అవి చాలా పెద్దగా, చుట్టూ ఎత్తుగా... మధ్యలో కొద్దిగా గుంటలా ఉంటాయి. జాగ్రత్తలు.. వయసు పైబడుతున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలాకాలం పాటు చర్మాన్ని సంరక్షించుకోవడమే కాదు... యూత్‌ఫుల్‌గా కనిపించేలా కూడా చూసుకోవచ్చు. అందుకోసం చేయాల్సినవి.. చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్లు వాడాలి. బాగా గాఢంగా ఉండి, ఎక్కువ సువాసనలు వెదజల్లే సబ్బులు వాడకూడదు. బాత్ ఆయిల్స్‌ను దూరం పెట్టాలి. పొగ తాగడం మానేయాలి. ఎండలోకి వెళ్లేటప్పుడు సస్‌స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించాలి. సమతులాహారం, ద్రవపదార్థాలు తీసుకోవాలి. గోరు వెచ్చటి నీటితోనే స్నానం చేయాలి. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఆహారం: చర్మంపై వయసు ప్రభావం కనపడనివ్వకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, పండ్లతోబాటు బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. చికిత్స: సమస్యను బట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మానికీ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. వయసు మళ్లిన వారిలో బేసల్ సెల్ ఎపిథిలియోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మెలనోమా వంటి చర్మ క్యాన్సర్స్ కనిపించవచ్చు. మరికొన్ని తీవ్ర సమస్యలు.. ఇన్ఫెక్షన్లు: వయసు పైబడుతున్న వారి చర్మం తేలిగ్గా ఇన్ఫెక్షన్స్కు గురవుతుంది. బార్టీరియా వల్ల – ఫాలిక్యులైటిస్, సెల్యులైటిస్; ఫంగస్ వల్ల – క్యాండిడియాసిస్, డెర్మటోఫైట్ ఇన్ఫెక్షన్స్; వైరస్ వల్ల – జోస్టర్ వంటివి సోకుతాయి. సోరియాసిస్: పెరిగే వయసుతో సోరియాసిస్ అనే చర్మ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. మొదట పొడిగానూ ఆ తర్వాత వెండిరంగు పొట్టు రాలుతున్న లక్షణాలు కనిపిస్తాయి. న్యూరోడర్మటైటిస్: ఇందులో ప్రధానంగా పాదాల మీద నల్లటి మచ్చలా వచ్చి, చాలా దురదగా ఉంటుంది. — డా. ఎస్. సుష్మా సుకృతి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. ఇవి చదవండి: చిన్నారులు బరువు పెరుగుతున్నారా? అయితే జాగ్రత్త! -
ఇది మెడలో వేసుకుంటే అలెర్జీలకు చెక్!..ధర ఎంతంటే..
వాతావరణం మారినప్పుడు, గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు చాలామందికి అలర్జీ బాధలు తప్పవు. అలర్జీలు తీవ్రమైతే కొందరికి ఉబ్బసం కూడా మొదలవుతుంది. అలెర్జీలకు, ఉబ్బసానికి ఇప్పటి వరకు మందులు, ఇన్హేలర్లే గతి. అలెర్జీలకు పరిష్కారంగా ఎస్టోనియాకు చెందిన ‘రెస్పిరే’ కంపెనీ ఇటీవల మెడలో తొడుక్కునేందుకు వీలైన ‘ఏ ప్లస్ వేర్’ పేరుతో అలెర్జీ ఫిల్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది మెడలో తొడుక్కున్నట్లయితే, గాలిలోని అలెర్జీకి కారణమయ్యే కణాలేవీ దీనిని దాటి ముక్కులోకి చొరబడలేవు. ఇందులోని హెపా ఫిల్టర్లు అలెర్జీలకు దారితీసే సూక్షా్మతి సూక్ష్మకణాలను సైతం ఇట్టే లోపలకు పీల్చేసుకుని, గాలిని శుభ్రం చేస్తాయి. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది చార్జ్ కావడానికి గంటన్నర సమయం పడుతుంది. పూర్తిగా చార్జ్ అయ్యాక ఎనిమిది గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 119 యూరోలు (రూ.10,795). దీనిని వాడటం మొదలుపెడితే అలెర్జీల కోసం మందులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. -
పాపాయికి చెవులు కుట్టిస్తున్నారా?
ఆడపిల్లలైతే వారు ఓ ఏడాది వయసుకు చేరగానే చెవులు కుట్టించడం మన సంప్రదాయం. దీనికి మతాలూ, కులాలన్న తేడా లేదు. అలాగే కాస్తంత పెద్ద వయసు రాగానే అమ్మాయిలు ముక్కు కూడా కుట్టించుకుంటున్నారు. ఇటీవల అయితే కేవలం చెవి తమ్మెకు ఒక చోట మాత్రమే కాకుండా... ఇంకా రెండు మూడు రంధ్రాలు కూడా పెట్టి ఆభరణాలు ధరిస్తున్నారు. ఇలా చెవులు కుట్టించుకోవడంలో కాస్తంత సంప్రదాయంతో పాటు... బోల్డంత కాస్మటిక్ ప్రయోజనాలు కూడా చూస్తున్నారు ఈకాలం మహిళలు. గతంలో ఆభరణాలు తయారు చేసేవారే బంగారు లేదా వెండి వైర్స్తో చెవులు లేదా ముక్కు కుట్టడం చేసేవారు. ఇప్పుడు బ్యూటీ సెలూన్లలో కూడా ఇది చేస్తున్నారు. ఇప్పుడు అధునాతన పియర్సింగ్ గన్స్‌తో చెవులు, ముక్కు లేదా అవసరమైన చోట్ల కుట్టడం జరుగుతోంది. ఈ ప్రక్రియలో రింగులుగా వేయదలచుకున్న బంగారు, వెండి తీగలను ముందుగా స్టెరిలైజ్ చేసి ఈ పని చేస్తున్నారు. ఇలా చెవి, ముక్కు లేదా స్టడ్ వేయాల్సిన ఇతర ప్రదేశాల్లో చిన్న రంధ్రం వేసే సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఆ అనర్థాలను దృష్టిలో పెట్టుకుని కాసిన్ని జాగ్రత్తలు తీసుకుంటే కుట్టించిన ముక్కు, చెవులు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అవి ఆరోగ్యంగా కూడా ఉంటాయి. చెవులు ముక్కు కుట్టించడంలో సహజంగా తలెత్తే సమస్యలు ఇన్ఫెక్షన్స్ : కుట్టాల్సిన చోట సెప్టిక్ కాకుండా ఉండేందుకు ప్రక్రియకు ముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి ముక్కుకు లేదా చెవికి రంధ్రం వేసిన చోట ఇన్ఫెక్షన్ రావచ్చు. సిస్ట్ / గ్రాన్యులోమా ఏర్పడటం: ముక్కు లేదా చర్మంపైన ఇతర ప్రాంతాల్లో కుట్టిన చోట చిన్న బుడిపె వంటి కాయ రావచ్చు. దీన్ని సిస్ట్ లేదా గ్రాన్యులోమా అంటారు. కుట్టగానే చర్మంలో జరిగే ప్రతిస్పందన వల్ల ఈ సిస్ట్ / గ్రాన్యులోమా వస్తుంది. ఇది సాధారణంగా హానికరం కాదు. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. ఏదైనా సమస్య వస్తే డాక్టర్‌కు చూపించి తప్పక చికిత్స తీసుకోవాలి. మచ్చ ఏర్పడటం : కొన్నిసార్లు కుట్టే ప్రక్రియలో వేసే రంధ్రం వద్ద మచ్చలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అలర్జీలు : కొన్ని సందర్భాల్లో కొందరికి కుట్టడానికి ఉపయోగించే బంగారం లేదా వెండి వల్ల అలర్జీ కలగవచ్చు. దీన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. కొందరిలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల కూడా ఇలాంటి అనర్థం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుట్టిన చోట్ల ఇన్ఫెక్షన్ రావడం, దురద, స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ►చెవులు, ముక్కు కుట్టే సమయంలో రంధ్రం పెట్టాల్సిన చోటిని ముందే నిర్ణయించుకోవాలి. తీరా కుట్టే ప్రక్రియ పూర్తయ్యాక రంధ్రం సరైన స్థానంలో లేదని బాధపడటం కంటే ముందే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది. ►మన శరీర భాగాలకు కుట్టే సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. అంతకు ముందు వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉన్నప్పుడే మీరు ఈ కుట్టించుకోవడం చేయండి. ►చెవులు లేదా ముక్కు కుట్టేవారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోండి. ►సాధారణంగా బంగారు, వెండి వైర్లతో కుట్టే సమయంలో అది చాలావరకు ఎలాంటి హానీ చేయదు. కానీ.. ముందుగానే ఆ వైర్లను స్టెరిలైజ్డ్ సొల్యూషన్‌లో శుభ్రపరచుకుని ఉండటం ఎందుకైనా మంచిది. ►చిన్న పోటుతో నొప్పిలేకుండానే కుట్టడం అనే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మరీ నొప్పిగా ఉంటే తప్ప... సాధ్యమైనంత వరకు అనస్థీషియా ఉపయోగించకూడదు. మీరు ఒకేసారి రెండుచోట్ల రంధ్రాలు వేయించడం వంటివి చేస్తున్నప్పుడు మాత్రం లోకల్ అనస్థీషియా క్రీమ్ పూయడం మంచిది. ►తేలిగ్గా మచ్చ పడే చర్మతత్వం ఉన్నవారు ముక్కు కుట్టించుకోకపోవడం మంచిది. ఇలాంటి వారు చెవులు, ముక్కు కుట్టించుకోడానికి ముందే డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం. -
టచ్ రచ్చ
కవర్ చెయ్యాల్సిన బట్టలే కేక పెట్టిస్తే? అందం తెచ్చేవే.. అల్లాడిస్తే?! ఇక ఏం వేసుకుంటాం? ఏం పూసుకుంటాం? అన్నీ స్కిన్‌కి ప్రాబ్లమే. ఎలర్జీ... అమ్మో... టచ్ చేస్తే రచ్చ చేసే స్కిన్ ఎలర్జీలు ఇవి! మనం రోజూ వాడే వస్తువులే కొందరికి ఏ మాత్రం సరిపడకుండా చర్మానికి చేటు తెస్తుంటాయి. మనకు సరిపడని వస్తువు తెచ్చే అనర్థాన్ని అలర్జీలుగా పేర్కొంటాం. తినడం ద్వారా వచ్చే అలర్జీలను పక్కన పెడితే... ఇక్కడ చెప్పుకునేవన్నీ చర్మాన్ని ఏదో అంటుకోవడం వల్ల వచ్చే అలర్జీలు. ఇలా వచ్చే సమస్యను ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ అంటారు. వీటిలో కొన్ని చిత్ర విచిత్రంగా అనిపిస్తాయి. ఆందోళన కలిగిస్తాయి. అలాంటి కొన్ని అలర్జీల గురించి తెలుసుకొంటే, వాటితో బాధపడేవారు, దాన్ని పెద్ద సమస్యగా పరిగణించకుండా... అవగాహన పెంచుకొని, తగిన చికిత్స తీసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం. రకరకాల డర్మటైటిస్లు (చర్మ అలర్జీలు) సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్స్‌తో కొందరిలో సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్స్‌లో ఉండే రసాయనాల కారణంగా అలర్జీలు వస్తుంటాయి.గాజులు, గొలుసులు, ఆభరణాలతో : తయారైన పదార్థాన్ని బట్టి కొందరు మహిళలకు గాజులు కూడా సరిపడవు. అవి అంటి ఉండే ప్రాంతం సాధారణంగా మణికట్టు. కానీ అది గాజు కావడంతో... మణికట్టు నుంచి ముంజేతి వరకూ కదులుతూ ఉండటం వల్ల ఆ మొత్తం ప్రాంతం ప్రభావితమవుతుంది. అలాగే మెడలో వేసుకొనే గొలుసులు, చైన్లు, నెక్లేస్లతోనూ ఇదే ప్రభావం ఉంటుంది. కొందరిలో ఇయర్ రింగ్స్‌కు ఉపయోగించే లోహం కారణంగానో డర్మటైటిస్ వస్తుంటుంది. వృత్తులతో : మన వృత్తుల్లో ఉపయోగించే రకరకాల పదార్థాలతో అలర్జీలతో తమ జీవనోపాధి సైతం ప్రభావితమయ్యేలా సమస్య రావచ్చు. ఉదాహరణకు సిమెంట్, పెయింట్స్ వంటి వాటిలో ఉండే రసాయనాలతో ఒంటికి అలర్జీ ఏర్పడితే ఆ వ్యక్తి ఆరోగ్య జీవితమే గాక... కుటుంబ సభ్యుల ఆర్థిక జీవనమూ ప్రభావితమవుతుంది. అలాగే కొందరికి ఫొటోగ్రాఫిక్ రసాయాలు, వారి వృత్తిలో భాగంగా ఉపయోగించే పదార్థాలతోనూ రావచ్చు. ఇక లోహాలతో నికెల్‌తో చేసిన ఉత్పాదనలు హెయిర్డ్రస్సింగ్, నర్సింగ్, కేటరింగ్, నికెల్ ప్లేటింగ్, వస్త్ర పరిశ్రమలో ఎక్కువ. కాబట్టి ఈ లోహపు ఉత్పాదనలతో వ్యవహరించే వృత్తుల్లో ఉన్నవారికి ‘నికెల్ డర్మటైటిస్’ ఎక్కువ. రైతులకు : కొందరు రైతులకు తాము ఉపయోగించే ఎరువులు, పురుగుమందులలోని రసాయనాలతో అలర్జీలు వస్తే అది కూడా వారి జీవితాన్ని దుర్భరం చేస్తుంది. సౌందర్య సాధనాలతో : ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. కొందరికి బొట్టుబిళ్లలతో అలర్జీ రావడం కనిపిస్తుంది. దీనికి కారణం బొట్టు బిళ్ల వెనక అంటించేందుకు ఉపయోగించే గమ్‌లోని రసాయనం సరిపడకపోవచ్చు. చాలామందిలో హెయిర్‌డై సరిపడదు. దానిలో ఉండే పారాఫినైల్యెనిడయామైన్ వంటి రసాయనాలు అటు వాసన పరంగానూ, ఇటు తమ స్వభావపరంగానూ చాలా ఘాటుగా ఉండటమే కారణం. కొందరిలో షేవింగ్ క్రీమ్స్, షేవింగ్ లోషన్స్లోని రసాయనాల వల్ల చెంపలు, గదమ (చుబుకం) దెబ్బతింటాయి. సౌందర్యసాధానాలలోని రెసార్సిన్, బాల్సమ్ ఆఫ్ పెరూ, పర్ఫ్యూమ్స్లో వాడే రసాయనాలు, వాటిలో స్వల్పంగా ఉండిపోయే తారు వంటి పెట్రోలియమ్ వ్యర్థాలతో అలర్జీ కలిగి కాంటాక్ట్ డర్మటైటిస్ వస్తుంటుంది. కంటి సౌందర్యసాధనాలతో : కొందరికి ఐ–షాడోస్, మస్కారా వంటి వాటితో అలర్జీలు వస్తాయి. ఇక కంటికి ఉపయోగించే మందులైన నియోమైసిన్, క్లోరాంఫెనికాల్, సల్ఫోనమైడ్స్తో పాటు అవి దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి ఉపయోగించే పారాబెన్స్ వంటి సరాయనాలు కనురెప్పకు అలర్జీ కలిగించి ‘ఐలిడ్ డర్మటైటిస్’కు దారితీయవచ్చు. ఉల్లి, వెల్లుల్లి, వంటింటి దినుసులతో : వెల్లుల్లి రెబ్బలు ఒలుస్తుండటం, ఉల్లి తగలడం వంటివి జరిగినప్పుడు కూడా అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా వెల్లుల్లి ఒలిచే వారిలో గోరు మూలం లేదా వేలికీ, గోటికీ మధ్యనున్న చర్మం త్వరగా ప్రభావితమై మంట రావడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. వెల్లుల్లి లేదా ఉల్లిలోని అలిసిన్ అనే రసాయనం సరిపడకపోవడమే ఇందుకు కారణం. కొన్ని కూరగాయలు కోస్తున్నప్పుడు లేదా వాటిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు సరిపడకపోవడంతో వచ్చే అలర్జీలను అందరికీ తెలిసే సాధారణ పరిభాషలో ‘వెజిటబుల్ డర్మటైటిస్’ అంటారు. లక్షణాలు ఎగ్జిమాగా పేర్కొనే అలర్జీలు దురదతో కనిపిస్తాయి. కొన్ని అలర్జీతో ప్రభావితమైన ప్రాంతం నుంచి నీళ్లలా స్రవిస్తుండటం, ఆకృతిలో చర్మం పగుళ్లు బారడం, పొట్టు రాలుతున్నట్లుగా ఉండటం, గాయం విస్తరిస్తుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక దీర్ఘకాలికంగా ఉండే అలర్జీలలో అర్టికేరియా (చర్మంపై ర్యాష్‌లా) వస్తుంది. ఆ ప్రాంతంలో చర్మం రంగు కూడా మారవచ్చు. ఇవన్నీ అలర్జిక్ రియాక్షన్ తీవ్రతను బట్టి ఉంటాయి. కాంటాక్ట్ డర్మటైటిస్లోని లక్షణాలు అన్నీ ఒకేలా ఉండవు. తీవ్రతను బట్టి, అలర్జీ కలిగించే పదార్థాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి. ప్రభావితమైన చర్మం ప్రాంతంలో కొందరికి ఏదో కుట్టిన ఫీలింగ్ ఉంటుంది. మరికొందరికి దురద, తరచూ నొప్పి ఉంటాయి. ఇక చర్మంపై ఏర్పడే మచ్చలు ఎర్రబారడం మొదలుకొని చిన్న పగుళ్లు, గుల్లలు, దద్దుర్లు, తీవ్రమైన గాయాల్లా కనిపించే పగుళ్ల వరకు కనిపిస్తాయి. మరికొందరిలో చర్మం కాలినట్లుగా కావచ్చు. నివారణ మనకు ఏదైనా అలర్జిక్ రియాక్షన్ కనిపించగానే దానికి నిర్దిష్టంగా ఫలానా వస్తువు వల్లనే అనే నిర్ధారణకు వచ్చేయడం సరికాదు. చాలా సునిశితంగా కారణాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. సమస్యకు అసలు కారణాన్ని తెలుసుకోవడం కోసం రోగి ఇంటి దగ్గర ఉపయోగించే వస్తువుల జాబితాను డాక్టర్లు పరిశీలించాల్సి ఉంటుంది. అలర్జీకి గురైన వ్యక్తి పనిచేసే చోట ఉన్న వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఉపయోగించే సౌందర్యసాధనాలు, రెజిన్ ఉత్పాదనల గురించి ఆరాతీయాల్సి ఉంటుంది. కొన్ని సూచనలు... మనకు ఏ పదార్థంతో అలర్జీ వస్తుందో దాని నుంచి దూరంగా ఉండటం అన్నిటికంటే ఉత్తమమైన ప్రక్రియ. ఉదాహరణకు డిటర్జెంట్స్‌తో అలర్జీ ఉన్నప్పుడు చేతులు కేవలం నీళ్లతో మాత్రమే శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ దాని అవసరం ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలతో దాన్ని వాడాలి. ఉదాహరణకు హెయిర్–డై తో చేతులకు అలర్జీ వస్తుంటే మంచి గ్లౌస్ ధరించి దాన్ని వాడుకోవాలి. ఇలా అవసరాన్ని బట్టి మనం తగిన మెళకువలను అనుసరిస్తూ ఈ సమస్యను అధిగమించాలి. సమస్య వచ్చిన చోట తక్కువ మోతాదులో లేదా ఓ మోస్తరు మోతాదులో (మైల్డ్–మాడరేట్) కార్టికోస్టెరాయిడ్ ఉన్న మోమ్యాటోసోన్ ఫ్యూరోయేట్ వంటి క్రీమ్స్ రాస్తుండాలి. అయితే దీని మోతాదును కేవలం చర్మవైద్య నిపుణుల సిఫార్సు మేరకే వాడాలి. చేతులకు డర్మటైటిస్ వచ్చినప్పుడు నాన్–పర్ఫ్యూమ్ హ్యాండ్ క్రీమ్ వాడవచ్చు. చేతులను శుభ్రపరచడానికి చర్మాన్ని పొడిబార్చని మైల్డ్ సోప్ వాడటం మేలు. తీవ్రమైన, శక్తిమంతమైన డిటర్జెంట్లు వాడటం మానేస్తే మంచిది. మనకు సరిపడని వస్తువులతో పనిచేయాల్సి వచ్చినప్పుడు డబుల్ గ్లౌజ్ వేసుకోవడం ఒక మంచి నివారణ ప్రక్రియ. షాంపూ, హెయిర్ డై వంటివి ఉపయోగించే సమయంలోనూ డబుల్ గ్లౌజ్ వాడటం మంచిదే. హెయిర్ ఆయిల్స్, స్టైలింగ్ జెల్స్ వంటివి రాసుకునేప్పుడు నేరుగా ఉత్తిచేతులతోనే రాసుకోవడం అంత సరికాదు. బత్తాయిలు, నారింజపండ్లు ఒలుస్తున్నప్పుడు, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటి పొట్టు తీసుకున్నప్పుడు అది మనకు సరిపడకపోతే చాలాసేపు ఆ పనిని చేయడం సరికాదు. చికిత్స లక్షణాలను, వాటి తీవ్రతను బట్టి దాన్ని తగ్గించే చికిత్స అందించాల్సి ఉంటుంది. స్థూలంగా అలర్జీ వస్తువుల నుంచి దూరంగా ఉండటం, స్టెరాయిడ్స్, లక్షణాలను బట్టి చికిత్స అనే మూడు అంశాల మీదే ఈ సమస్యకు చికిత్స ఉంటుంది. తక్షణం కనిపించే డర్మటైటిస్లకు క్రీములు, దీర్ఘకాలిక సమస్యలకు ఆయింట్మెంట్స్ ఉపయోగించాల్సి రావచ్చు. మందుల ఎంపిక ప్రక్రియలో అలర్జీ ఏ మేరకు వచ్చిందన్న అంశంతో పాటు, ఏ ప్రదేశంలో వచ్చింది, తీవ్రత ఎంత అన్నది కూడా పరిగణనలోకి తీసుకుంటారు. తీవ్రతను బట్టి కొన్నిసార్లు ఒకింత ఆధునిక చికిత్సలైన పూవా, గ్రెంజ్ రేస్, ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్, కొన్ని సందర్భాల్లో యాంటీబయాటిక్స్‌ను కూడా డాక్టర్లు వాడుతుంటారు. డాక్టర్ స్వప్న ప్రియ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ మెటల్ అలర్జీలు బటన్స్, నాణేలు, బకిల్స్ వంటి వాటితో : మన జేబులో ఉండే చిల్లర నాణేలతో కూడా కొందరికి అలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరికి ప్యాంట్ బటన్ / బెల్ట్ బకిల్‌లో ఉండే నికెల్ లోహం తాకి ఉండే పొట్ట భాగంలోనూ అలర్జీ రావచ్చు. అది బటన్ / బెల్ట్బకిల్ ఒరుసుకుపోవడం వల్ల వచ్చే సమస్యగా భావిస్తారు. కానీ సాధారణంగా నాణేలు లేదా బటన్స్ లేదా బకిల్‌లో ఉండే నికెల్ లోహం వల్ల ఆ అలర్జీ వస్తుంది. ఈ లోహం ఉండే రిస్ట్‌వాచీలు, కళ్లజోళ్ల ఫ్రేమ్లతోనూ అవి తగిలే ప్రాంతంలో డర్మటైటిస్ వచ్చే అవకాశం ఉంది. మిగతా అన్ని లోహాలతో పోలిస్తే కాంటాక్ట్ డర్మటైటిస్‌ను ప్రేరేపించే శక్తి నికెల్ లోహానికి చాలా ఎక్కువ. మహిళలు చెవి కమ్మలు, చెవి దుద్దులు, ఇతర ఇయర్ రింగ్స్ ధరిస్తారు కాబట్టి పురుషులతో పోలిస్తే ‘నికెల్ డర్మటైటిస్’ ప్రమాదం వారికే ఎక్కువ. క్రోమియం లోహంతో : మన భూమి ఉపరితలం (క్రస్ట్)లో అత్యధికంగా లభ్యమయ్యే లోహాలలో అత్యంత ముఖ్యమైనది క్రోమియం. సాధారణంగా ఏదైనా సరిపడకపోవడం వల్ల కనిపించే డర్మటైటిస్లలో ‘క్రోమియం సెన్సిటివిటీ’ కేసులు ప్రపంచవ్యాప్తంగా 6 శాతం ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మనం వాడే డిటర్జెంట్స్, బ్లీచింగ్ ఏజెంట్లు, షేవింగ్ క్రీములు, షేవింగ్ లోషన్లలో క్రోమియం ఎక్కువ. కొన్ని చర్మపు ఉత్పాదనల (ముఖ్యంగా షూస్) ప్రాసెసింగ్‌లో దీన్ని వాడతారు. అలాగే పసుపుపచ్చ, నారింజ రంగులో ఉండే ఇంటి పెయింట్స్‌లో, ప్రింటింగ్ పరిశ్రమలో, ఫొటోగ్రఫీలో, ఏదైనా లోహం తుప్పు పట్టకుండా వాడేందుకు ఉపయోగించే పూతల్లో (యాంటీ రస్టింగ్ ఏజెంట్స్)లో క్రోమియం ఎక్కువ. పై ఉత్పాదనలను వాడే వారు తమకు ఏదైనా సమస్య వస్తే అది క్రోమియంతో కావచ్చని భావించి జాగ్రత్తగా ఉండాలి. కోబాల్ట్ లోహంతో : దీన్ని సాధారణంగా నికెల్‌తో కలిపి తయారు చేసే చాలా ఉత్పాదనల్లో ఉపయోగిస్తారు. లోహాలన్నింటిలో నికెల్ చాలా ఎక్కువగా అలర్జీలను కలగజేస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే నికెల్‌తో పాటు కోబాల్ట్ కలిసే ఉత్పాదనలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోబాల్ట్ కారణంగా హెయిర్ డైలు ఉపయోగించేవారిలో, చాలా కఠినమైన లోహాలతో తయారయ్యే డ్రిల్లింగ్ టూల్స్ ఉపయోగించేవారిలో, సెరామిక్ పరిశ్రమలోని వారిలో, గ్లాస్, మెటల్ అల్లాయ్స్, పింగాణీ వంటి పాత్రల తయారీ రంగాలలో ఉన్నవారికి అలర్జీలు వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువ. అల్యూమినియంతో : ఈ లోహం చాలావరకు సురక్షితం. అయితే కొన్ని సందర్భాల్లో అల్యూమినియం ఉన్న కొన్ని పూత మందులు వాడినప్పుడు చాలా అరుదుగా డర్మటైటిస్ రావచ్చు. పాదరసంతో : ఇది జింక్, తగరం, వంటి లోహాలతో ఎక్కువగా కలుస్తుంది. ఆ ఉత్పాదనలను పంటికి వేసే సిమెంట్ తయారీలో ఉపయోగిస్తారు. అది కొందరికి అలర్జీక్ రియాక్షన్‌ను కలిగించవచ్చు. బంగారంతో : ఈ లోహం చాలా మందికి ప్రియమైనది. దాదాపు ఆభరణాల్లో చాలావరకు దీనితోనే తయారవుతాయి. దీనితో వచ్చే అలర్జిక్ రియాక్షన్ చాలా అరుదే అయినా... కొందరిలో బంగారం కూడా అలర్జీక్ రియాక్షన్‌ను కలిగించవచ్చు. ఆభరణాలతో పాటు దీన్ని పంటిపైన వాడే తొడుగులు (క్రౌన్స్), డెంటల్ ఫిల్లింగులు, దంత చికిత్సలో వాడే చాలా వస్తువుల్లో కూడా బంగారాన్ని వాడుతుంటారు. వాటి వల్ల కొందరిలో అలర్జిక్ రియాక్షన్ కనిపిస్తుండవచ్చు. ఇక్కడ పైర్కొన్న లోహాలతో పాటు ప్లాటినమ్, జింక్, రాగి వంటి వాటితోనూ కొన్ని సందర్భాల్లో అలర్జీలు కనిపిస్తాయి. రబ్బర్ డర్మటైటిస్ : మనం వాడే చాలా ఉత్పాదనల్లో రబ్బర్ ఉంటుంది. చేతి తొడుగులు (గ్లౌవ్స్), షూస్, మాస్కులు, స్లిప్పర్లు ఇంకా ఎన్నెన్నో రబ్బర్‌తో తయారవుతాయి. రబ్బర్‌తో అలర్జీ ఉన్నప్పుడు సాధారణంగా చర్మం ఎర్రబారడం మొదలుకొని చిన్న చిన్న గుల్లలు, దద్దుర్లు, ర్యాష్ మొదలుకొని తీవ్రంగా పగుళ్ల వరకు ఈ అలర్జిక్ రియాక్షన్ తీవ్రత ఉంటుంది. రబ్బర్‌తో వచ్చే రియాక్షన్లో చేతులు లేదా కాళ్లు నల్లబారడం లేదా రంగుమారడం వంటి లక్షణాన్ని గమనించనప్పుడు అది వచ్చిన ప్రాంతాన్ని బట్టి దాన్ని ‘బ్లాక్ రబ్బర్ హ్యాండ్ / ఫీట్’ అని వ్యవహరిస్తారు. -
చర్మసౌందర్యం
బ్యూటిప్స్ సౌందర్యాన్ని పెంచడంలో పెదవుల నుంచి పాదాల వరకు అన్నీ తమ పాత్ర పోషిస్తాయి. దేనిని నిర్లక్ష్యం చేసినా ఆ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తూంటుంది. అరగంట సమయం వీటి కోసం కేటాయిస్తే ఆరోగ్యవంతమైన ఆకర్షణీయమైన చర్మం సొంతమవుతుంది. పెదవులు మృదువుగా, కాంతిమంతంగా ఉండాలంటే పచ్చికొబ్బరి తురిమి పాలు తీసి పెదవులకు పట్టించాలి. ఇలా రెండు- మూడు వారాలు చేస్తే ఫలితం ఉంటుంది. పొడి చర్మానికి పది టీ స్పూన్ల గోధుమ పిండిలో ఎనిమిదవ వంతు పసుపు, ఒక టీ స్పూను బాదం నూనె, పాలు వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి మాస్కులా వేసుకోవాలి. ఆరిన తర్వాత మెల్లగా చేత్తో రుద్దుతూ తొలగించి గోరువెచ్చటి నీటితో ముఖం కడగాలి. ఈ ప్యాక్‌ను మూడు నాలుగురోజులకొకసారి వేయవచ్చు. ఈ ప్యాక్ వేసిన తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి సబ్బు వాడకూడదు. కావాలనుకుంటే సున్నిపిండి వాడవచ్చు. ఏ ప్యాక్‌లోనయినా, ఏ చర్మతత్త్వానికైనా తేనె కలుపుకుంటే చర్మలావణ్యం పెరుగుతుంది. క్రమం తప్పకుండా తేనె వాడితే స్కిన్ఎలర్జీలు రావు. పొడి చర్మానికి మూడు టేబుల్ స్పూన్ల అవొకాడో ఆయిల్, మూడు టేబుల్ స్పూన్ల కెమిలియా ఆయిల్, మూడు టేబుల్ స్పూన్ల ‘ఇ’ విటమిన్ ఆయిల్, రెండు మూడు చుక్కల రోజ్‌హిప్ సీడ్ ఆయిల్, రెండు చుక్కల క్యారట్ సీడ్ ఆయిల్, ఒక చుక్క లావెండర్ ఆయిల్, ఒక చుక్క ఫ్రాకింసెన్స్ ఎసెన్షియల్ ఆయిల్‌లను బాగా కలిపి గాలి చొరని సీసాలో నింపి వెలుతురు లేని చోట నిలవ ఉంచాలి. ఈ మిశ్రమాన్ని రోజూ రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి పట్టిస్తే ముడతలు రావు. ఉన్నప్పటికీ త్వరగా తగ్గుతాయి. పైన చెప్పిన నూనెలన్నీ మార్కెట్లో దొరుకుతాయి.