హెల్త్
వయసు పెరుగుతున్నకొద్దీ వెంట్రుకలు తెల్లబడుతుంటే రంగు వేస్తాం. కానీ మార్పులకు లోనయ్యే చర్మాన్ని ఏం చేయగలం? ఎవరెంత రంగు వేసినప్పటికీ... చర్మం తీరును బట్టే ఎదుటివారి వయసును అంచనా వేస్తుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మానికి కొన్ని రకాల వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉదాహరణకు.. చర్మాన్ని పొడిబార్చే జీరోసిస్ మొదలుకొని చర్మం కింద రక్తం పేరుకున్నట్లు కనిపించే పర్‌ప్యూరా వరకు అనేక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అవేమిటో, వాటి నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు / నిర్వహణ పద్ధతులూ, చికిత్సలను తెలుసుకుంటే.. పరుగులు తీసే వయసుకు స్పీడ్‌కు బ్రేకులు వేసి, యూత్‌ఫుల్‌గా కనిపించేందుకు తోడ్పడే కథనమిది.
చర్మంలో ప్రధానంగా మూడు పొరలు ఉంటాయి. బయటిపొరను ఎపిడెర్మిస్, మధ్యపొరను డెర్మిస్, దాని కింద సబ్‌క్యుటేనియస్ పొర అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఎపిడర్మిస్ పొర పలుచబారడం మొదలవుతుంది. ఈ పొరలోనే ఉంటూ మేనికి రంగునిచ్చే మెలనోసైట్స్ ఉత్పత్తి తగ్గడం మొదలవుతుంది. అందుకే వృద్ధుల చర్మం పారదర్శకంగా ఉండి, లోపలి రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం పాలిపోయినట్లుగా అవుతుంది. ఇక డెర్మిస్ పొరలో చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్, ఎలాస్టిన్ అనే కణజాలాలు ఉంటాయి.
వీటివల్లనే చర్మం బిగుతుగా ఉంటుంది. ఈ బిగువు తగ్గడం వల్లనే వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం సాగి, వదులవుతుంది. డర్మిస్‌లోని రక్తనాళాలూ బలహీనమవుతాయి. అందుకే వయసు పైబడినవారిలో చిన్న దెబ్బకైనా వెంటనే రక్తస్రావం అవుతుంది. ఇక సబ్‌క్యుటేనియస్ పొరలో కొవ్వు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కొవ్వు తగ్గిపోవడం వల్ల చర్మం మునుపటిలా కాకుండా పలచబారిపోతుంది. ఈ పొరలోనే చెమట గ్రంథులు, నూనెలాంటి పదార్థాన్ని స్రవించే సెబేషియస్ గ్రంథులు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ గ్రంథుల పనితీరు తగ్గుతూ పోయి చర్మం పొడిబారినట్లుగా అవుతుంది. నునుపుదనాన్ని కోల్పోతుంది. వెరసి... ఈ సమస్యలన్నింటి వల్ల చర్మం పటుత్వాన్ని కోల్పోయి వేలాడుతున్నట్లుగా అవడంతోపాటు ముడతలు కూడా పడుతుంది.
వయసు పెరగడం వల్ల వచ్చే సమస్యలు..
- జీరోసిస్ లేదా ఏస్టియోటిక్ డర్మటైటిస్ : దీన్నే వాడుకలో చర్మం పొడిబారిపోవడం అంటారు. ఈ సమస్య ముందుగా మోకాలి కింద భాగంలో ఉన్న చర్మంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆ తర్వాత దుస్తులు కప్పని ఇతర భాగాల్లోనూ కనిపిస్తుంది.
- ఏజ్ స్పాట్స్ లేదా లివర్ స్పాట్స్ : చర్మానికి రంగును ఇచ్చే మెలనోసైట్స్ తగ్గడం వల్ల చర్మం పాలిపోయినట్లు అవుతుంది. ఆ తర్వాత నల్లటి మచ్చలు వస్తాయి. వాటిని ఏజ్ స్పాట్స్ లేదా లివర్‌స్పాట్స్ లేదా లెంటిజీన్స్ అంటారు. చర్మానికి బాగా ఎండ తగిలే ప్రదేశాలలో ఇవి ఎక్కువగా వస్తాయి.
- చెర్రీ యాంజియోమాస్ : ఈ సమస్య ఉన్నవారిలో కొద్దిపాటి రాపిడికే రక్తనాళాలు చిట్లే ప్రమాదం ఉండడంతో పాటు చర్మంపై నుంచి రక్తనాళాలు ఎరుపు రంగులో పైకి కనిపిస్తూ ఉంటాయి. వాటిని ‘చెర్రీ యాంజియోమాస్’ అంటారు.
- సెబోరిక్ కెరటోసిస్ : చర్మంపై ముఖ్యంగా చేతుల మీద, ముఖంపైన కందిగింజ సైజులో సెబోరిక్ కెరటోసిస్ అనే గోధుమరంగు మచ్చలు వస్తాయి.
- స్కిన్ ట్యాగ్స్ లేదా యాక్రోకార్డాన్స్: చర్మం వదులుగా.. ముడత పడినట్లుగా అయి... అదనపు చర్మంలా పొడుచుకు వచ్చి, పులిపిర్లలా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా మెడమీద, బాహుమూలాల వద్ద, తొడలపైన కనిపిస్తాయి.
- పర్‌ప్యూరా అండ్ హిమటోమాస్: చర్మం కింద ఉన్న రక్తనాళాలు పెళుసుబారి సులువుగా చిట్లుతాయి. దాంతో అక్కడ రక్తం చేరినట్లుగా కనిపిస్తుంది. దాన్ని సినైల్ పర్‌ప్యూరా అంటారు. ఒకవేళ రక్తం పేరుకుపోయి, చర్మం ఉబ్బుగా కనిపిస్తే దాన్ని హిమటోమా అంటారు.
- ఎయిర్ బార్న్ కాంటాక్ట్ డర్మటైటిస్: వయసు పైబడిన వారిలో చర్మానికి చాలా తేలికగా అలర్జీలు వస్తుంటాయి. పరిసరాల్లో ఉండే మొక్కల కారణంగా చర్మంపై అలర్జీలు వస్తే దాన్ని ఎయిర్ బార్న్ కాంటాక్ట్ డర్మటైటిస్ అని అంటారు.
- కెరటో అకాంథోమా: వయసు పైబడుతున్న వారిలో, ఎండలో ఎక్కువగా తిరిగే కొందరిలో కాయల్లా కనిపించే వాటిని నాన్ క్యాన్సరస్ స్కిన్ గ్రోత్స్‌గా చెబుతారు. అవి చాలా పెద్దగా, చుట్టూ ఎత్తుగా... మధ్యలో కొద్దిగా గుంటలా ఉంటాయి.
జాగ్రత్తలు..
వయసు పైబడుతున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలాకాలం పాటు చర్మాన్ని సంరక్షించుకోవడమే కాదు... యూత్‌ఫుల్‌గా కనిపించేలా కూడా చూసుకోవచ్చు. అందుకోసం చేయాల్సినవి..
- చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్లు వాడాలి.
- బాగా గాఢంగా ఉండి, ఎక్కువ సువాసనలు వెదజల్లే సబ్బులు వాడకూడదు.
- బాత్ ఆయిల్స్‌ను దూరం పెట్టాలి.
- పొగ తాగడం మానేయాలి.
- ఎండలోకి వెళ్లేటప్పుడు సస్‌స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి.
- సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించాలి.
- సమతులాహారం, ద్రవపదార్థాలు తీసుకోవాలి.
- గోరు వెచ్చటి నీటితోనే స్నానం చేయాలి.
- ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి.
ఆహారం: చర్మంపై వయసు ప్రభావం కనపడనివ్వకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, పండ్లతోబాటు బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి.
చికిత్స: సమస్యను బట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మానికీ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. వయసు మళ్లిన వారిలో బేసల్ సెల్ ఎపిథిలియోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మెలనోమా వంటి చర్మ క్యాన్సర్స్ కనిపించవచ్చు.
మరికొన్ని తీవ్ర సమస్యలు..
ఇన్ఫెక్షన్‌లు: వయసు పైబడుతున్న వారి చర్మం తేలిగ్గా ఇన్ఫెక్షన్స్‌కు గురవుతుంది. బార్టీరియా వల్ల – ఫాలిక్యులైటిస్, సెల్యులైటిస్; ఫంగస్ వల్ల – క్యాండిడియాసిస్, డెర్మటోఫైట్ ఇన్ఫెక్షన్స్; వైరస్ వల్ల – జోస్టర్ వంటివి సోకుతాయి.
సోరియాసిస్: పెరిగే వయసుతో సోరియాసిస్ అనే చర్మ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. మొదట పొడిగానూ ఆ తర్వాత వెండిరంగు పొట్టు రాలుతున్న లక్షణాలు కనిపిస్తాయి.
న్యూరోడర్మటైటిస్: ఇందులో ప్రధానంగా పాదాల మీద నల్లటి మచ్చలా వచ్చి, చాలా దురదగా ఉంటుంది.
— డా. ఎస్. సుష్మా సుకృతి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్.
ఇవి చదవండి: చిన్నారులు బరువు పెరుగుతున్నారా? అయితే జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment