నడిరోడ్డుపై నిద్రించిన సీఎం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా నడి రోడ్డు మీదనే పడుకున్నారు. చలి వణికిస్తున్నా లెక్కచేయకుండా మంత్రులు, మద్దతుదారులతో కలిసి రైల్ భవన్ ఎదుటే రాత్రంతా గడిపారు. డ్రగ్స్, వ్యభిచార రాకెట్‌పై దాడి చేయడానికి నిరాకరించిన పోలీసులపై చర్య తీసుకోవాలన్న డిమాండ్‌తో ఆయన మళ్లీ ఉద్యమబాటలోకి వెళ్లిన విషయం తెలిసిందే. గణతంత్ర వేడుకలు జరిగే రాజ్‌పథ్‌ను లక్షలాది మంది ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులతో ముట్టడిస్తానని కేజ్రీవాల్ హెచ్చరించారు. చర్చలకు తావులేదని, ఉద్యమం ఆపే ప్రసక్తి లేదని, ఢిల్లీలో మహిళల భద్రత అనే అంశం చర్చించాల్సింది కాదని, చర్యలు తీసుకోవాల్సిందని ఆయన అన్నారు.
ఢిల్లీలో ఇన్ని నేరాలు జరుగుతుంటే అసలు హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు నిద్ర ఎలా పడుతోందని ఆయన మండిపడ్డారు. నగరంలో మహిళలకు రక్షణ ఎప్పుడుంటుందని, దీనిపై తాము చర్చించేది లేదని స్పష్టం చేశారు. వందలాది మంది ఆప్ మద్దతుదారులు ఇప్పటికే రైల్ భవన్ ఎదురుగా, రిపబ్లిక్ డే వేడుకలు జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. ఆరుగురు మంత్రులతో పాటు సీఎం కేజ్రీవాల్ కూడా రాత్రంతా రైల్ భవన్ బయటే కూర్చుని ఉన్నారు. నడిరోడ్డుమీదే ఆయన నిద్రపోయారు. కొందరు మద్దతుదారులు మాత్రం రాత్రి పాటలు పాడుతూ నినాదాలు చేస్తూ గడిపారు. మంత్రులు కూడా రోడ్డుమీదే పడుకున్నారు. తమ డిమాండ్లు అంగీకరించకపోతే లక్షలాది మంది మద్దతుదారులు రాజ్‌పథ్‌కు వస్తారని, కేంద్రం ప్రజల మాట వినాల్సిందేనని కేజ్రీవాల్ అన్నారు. జంతర్ మంతర్ వద్దకు ధర్నా వేదికను మార్చాలని పోలీసులు చెప్పినా, ఆయన నో అనేశారు. నిర్ణయాలు వారంతట వారే తీసుకునే హక్కును ఢిల్లీ వాసులు వాళ్లకిచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలు ఆ హక్కు తనకిచ్చారని, తానెక్కడ కూర్చోవాలో చెప్పడానికి షిండే ఎవరని నిలదీశారు. నిన్నంతా తాము రైల్ భవన్లో ఉన్న టాయిలెట్‌ను ఉపయోగించుకున్నామని, కానీ ఈరోజు దాన్ని కూడా వాళ్లు మూసేశారని చెప్పారు. ఇక్కడకు ఆహారం తెచ్చుకోడానికి కూడా అనుమతించట్లేదని, టీ తెచ్చుకోడానికి తాను కూడా బ్యారికేడ్ల వరకు వెళ్లాల్సి వచ్చిందని అంటూ.. కేంద్రం తన ఆందోళనను అణిచేయడానికి ఎంతలా ప్రయత్నిస్తోందో కళ్లకు కట్టినట్టు చెప్పారు. ఇక్కడ నిరసన తెలుపుతున్నవాళ్లు పాకిస్థానీలో, అమెరికన్లో కారని, వాళ్లంతా మన సొంత మనుషులేనని గుర్తుచేశారు. షిండే ఈ సొంత వాళ్లపైనే యుద్ధం ప్రకటించారని మండిపడ్డారు.