SLR
-
ఆర్బీఐ కీలక చర్యలు: రూపాయికి బూస్ట్
సాక్షి, ముంబై: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రోజుకో రికార్డు కనిష్టానికి జారిపోతుండటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) స్పందించింది. ఈసీబీ రూటులో రుణ పరిమితిని రెట్టింపు చేయడంతో సహా విదేశీ మారకపు ప్రవాహాన్ని పెంచేందుకు నిబంధనలను మరింత సరళీకృతం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. అస్థిరతను తగ్గించడానికి, గ్లోబల్ స్పిల్‌ఓవర్‌లను తగ్గించేందుకు, డెట్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు కొన్ని నిబంధనలను సడలించింది. మొత్తం స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వాన్ని భరోసా ఇచ్చేలా ఫారెక్స్ ఇన్‌ఫ్లోలను పెంచడానికి ఐదుచర్యలను చేపట్టాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. అలాగే ఫారెక్స్ మార్కెట్లో లిక్విడిటీ పరిస్థితులను నిరంతరం, నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. క్రమబద్ధమైన మార్కెట్ పనితీరును నిర్ధారించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నామని ఆర్బీఐ పేర్కొంది. ► విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ డిపాజిట్లు FCNR(B), NRE టర్మ్ డిపాజిట్లపై క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్), స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) నుంచి మినహాయింపు ► విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్(బీ) ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు. ఈ సడలింపు అక్టోబర్ 31, 2022 వరకు అందుబాటులో ఉంటుంది. ► రుణంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు పెట్టుబడులు. ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లలో మూడు మార్గాల ద్వారా ఎఫ్‌పీఐలు పెట్టుబడి పెట్టవచ్చు. ఎఫ్‌పీఐ పెట్టుబడులను ప్రోత్సహించేలా అక్టోబర్ 2015లో ప్రవేశపెట్టిన మధ్యస్థ-కాల ఫ్రేమ్‌వర్క్ (ఎంటీఎఫ్); (బి) మార్చి 2019లో ప్రవేశపెట్టిన వాలంటరీ రిటెన్షన్ రూట్ (వీఆర్ఆర్); (సి) ఏప్రిల్ 2020లో ఎఫ్ఏఆర్ నిబంధనల్లో మార్పులు చేసింది. ► అధీకృత డీలర్ కేటగిరీ I (AD కేటగిరీ-I) బ్యాంకుల ద్వారా విదేశీ కరెన్సీ రుణాలు ► బాహ్య వాణిజ్య రుణాలు(ECBs):ఆటోమేటిక్ ఈసీబీ మార్గంలో, అర్హత కలిగిన రుణగ్రహీతలు ఆర్బీఐని సంప్రదించకుండానే ఆర్థిక సంవత్సానికి తీసుకునే పరిమితిని 750 మిలియన్ల డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్లకు పెంచింది. అలాగే ఆల్ ఇన్ కాస్ట్ సీలింగ్ కూడా 100 బేసిస్ పాయింట్లకు పెంచింది. రుణ గ్రహీత పెట్టుబడి గ్రేడ్ రేటింగ్‌కు లోబడి ఇది ఉంటుంది. -
ఫోర్టిస్, ఎస్ఆర్ఎల్ల విలీనం రద్దు
న్యూఢిల్లీ: ఫోర్టిస్ మలార్ హాస్పిటల్స్, ఎస్ఆర్ఎల్ (డయాగ్నస్టిక్స్ విభాగం) విలీనం రద్దయింది. ఈ రెండు సంస్థల విలీనాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. ఈ రంగంలో సమస్యలు ప్రబలంగా ఉండటం, విలీన ప్రక్రియలో సుదీర్ఘ జాప్యం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఈ రెండు సంస్థల విలీనం 6–8 నెలల్లో పూర్తవ్వగలదని అంచనా వేశామని, కానీ తమ నియంత్రణలో లేని కారణాల వల్ల ఈ ప్రక్రియ 19 నెలలుగా సాగుతోందని తెలిపింది. ఇంత సుదీర్ఘ కాలం జరిగినా ఇంకా విలీనం పూర్తవ్వలేని పేర్కొంది. కాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) చండీగఢ్ బెంచ్ వద్ద ఈ విలీన స్కీమ్ పెండింగ్‌లో ఉందని తెలిపింది. ఈ 19 నెలల కాలంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఎన్నో సమస్యలు చోటు చేసుకున్నాయని, డయాగ్నస్టిక్స్ వ్యాపారం ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంది. అందుకు విలీన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నామని, దీనికి ఎన్సీఎల్టీ ఆమోదం పొందాల్సి ఉందని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. -
వడ్డీ రేట్లలో మార్పులు చేయని RBI
-
సెన్సెక్స్ ఆల్‌టైమ్ రికార్డు
ముంబై: స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో(ఎస్ఎల్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు రిజర్వు బ్యాంకు మంగళవారం ప్రకటించడంతో స్టాక్ మార్కెట్ ఉవ్వెత్తున ఎగిసింది. సెన్సెక్స్ 174 పాయింట్లు పెరిగి 24,858.59 పాయింట్ల ఆల్ టైమ్ గరిష్టం వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 53.35 పాయింట్ల వృద్ధితో 7,415.85 పాయింట్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయి వద్ద క్లోజైంది. ఎస్ఎల్ఆర్ తగ్గింపుతో బ్యాంకులకు రూ.40 వేల కోట్ల మేరకు నిధులు అందుబాటులోకి రానున్నాయి. అయితే, కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఎనిమిది కీలక రంగాలు ఏప్రిల్‌లో 4.2 శాతం వృద్ధి సాధించడం కూడా మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపిందని బ్రోకర్లు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐ తొలి ద్రవ్య విధాన సమీక్ష మంగళవారం జరిగింది. మార్కెట్ ఊహించినట్లుగానే కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. బ్యాంకులు, రియల్టీ రంగానికి లబ్ధి కలిగించే ఎస్ఎల్ఆర్ కోతను ప్రకటించింది. ధరలకు అనుగుణంగా స్పందించే రియాలిటీ ఇండెక్స్ 3.15 శాతం పెరిగింది. చైనాలో ఫ్యాక్టరీ, సేవా రంగాలు చాలా కాలం తర్వాత మేలో ఉత్తమ ఫలితాలు సాధించడంతో మెటల్ స్టాక్స్ ప్రకాశించాయి. టాటా స్టీల్ 6.69, సెసా స్టెరిలైట్ 6.53 శాతం పెరిగాయి. సెన్సెక్స్‌లో 17 పైకి... సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 17 షేర్లు పెరగ్గా 13 దిగువముఖం పట్టాయి. ధర పెరిగిన షేర్లు : కోల్ ఇండియా 5.29, ఓఎన్జీసీ 4.40, భెల్ 3.48, హిందాల్కో 3.23, ఎన్టీపీసీ 3.14, హీరో మోటోకార్స్ 2.96, హెచ్డీఎఫ్సీ 1.69, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.15 శాతం వృద్ధి చెందాయి. డాక్టర్ రెడ్డీస్ 3.15, గెయిల్ ఇండియా 2.07, హెచ్‌యూఎల్ 1.51, ఐటీసీ 1.16 శాతం ధర క్షీణించాయి. రంగాల వారీగా బీఎస్ఈ సూచీలను గమనిస్తే... మెటల్ 5.06, రియల్టీ 3.15, ఆయిల్ అండ్ గ్యాస్ 1.76, విద్యుత్తు 1.44, కన్సూమర్ బ్యూరబుల్స్ 1.44, కన్సూమర్ గూడ్స్ 1.25 శాతం ఎగిశాయి. మార్కెట్లో ట్రేడయ్యే మొత్తం షేర్లను పరిశీలిస్తే... 1,921 కంపెనీల స్టాక్స్ ధరలు పెరగ్గా, 1,089 కంపెనీల షేర్ల రేట్లు క్షీణించాయి. మిగిలిన 96 షేర్లు స్థిరంగా ఉన్నాయి. సోమవారం టర్నోవరు రూ.3,619.44 కోట్లు కాగా మంగళవారం రూ.4,084.34 కోట్లకు పెరిగింది. 20 శాతం వరకు పెరిగిన సుగర్ ఈక్విటీలు... బయ్యర్లు ఎగబడడంతో చక్కెర కంపెనీ షేర్ల ధరలు 20 శాతం వరకు ఎగిశాయి. దేశంలో పంచదార పరిశ్రమ పునరుత్తేజం పొందుతుందని బయ్యర్లు ఆశాభావంతో ఉన్నారు. మార్కెట్ ధోరణిని ప్రతిబింబిస్తూ త్రివేణి ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ షేరు ధర 19.91 శాతం, ధామ్‌పూర్ సుగర్ మిల్స్ షేరు రేటు 11.44 శాతం పెరిగాయి. శ్రీరేణుకా సుగర్స్ 10.44, బజాజ్ హిందుస్థాన్ 9.82 శాతం వృద్ధిచెందాయి. దిగజారిన బ్యాంక్ షేర్లు ... కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో బ్యాంకుల షేర్లు విక్రయాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 0.28, ఎస్బీఐ 0.03 శాతం క్షీణించాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.91, కోటక్ మహింద్రా బ్యాంక్ 1.46, ఐడీబీఐ బ్యాంక్ 1.27 శాతం తగ్గాయి. బీఎస్ఈ బ్యాంకెక్స్ ఇండెక్స్ 0.18 శాతం తగ్గుదలతో 17,478.99 పాయింట్ల వద్ద ముగిసింది. -
కీలక పాలసీ వడ్డీరేట్లు యథాతథం..
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లుచల్లారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగమనం కొనసాగుతున్నా.. ద్రవ్యోల్బణం కట్టడికే ప్రాధాన్యమిచ్చారు. కీలక పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని మంగళవారం జరిగిన పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ నిర్ణయించింది. అయితే, చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)ను మాత్రం అర శాతం తగ్గించడంద్వారా వ్యవస్థలోకి ద్రవ్యసరఫరా పెంచే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం గనుక మరింత తగ్గుముఖం పడితే వడ్డీరేట్లను తప్పకుండా తగ్గిస్తామని చెప్పడం ఒక్కటే కాస్తలోకాస్త ఊరటనిచ్చే విషయం. అయితే, ఎస్ఎల్ఆర్ను తగ్గించినప్పటికీ... తాము ఇప్పట్లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశం లేదని బ్యాంకర్లు తేల్చిచెప్పారు. ముంబై: మోడీ నేతృత్వంలోని కొత్త సర్కారు కొలువైన తర్వాత తొలిసారిగా చేపట్టిన ఆర్బీఐ పాలసీ సమీక్షలో దాదాపు అందరి అంచనాలకు అనుగుణంగానే నిర్ణయం వెలువడింది. కీలక పాలసీ రేట్లను మార్చకుండా వదిలేసినప్పటికీ.. ఎస్ఎల్ఆర్ను అర శాతం ఆర్బీఐ తగ్గించింది. దీంతో ప్రస్తుతం 23 శాతంగా ఉన్న ఎస్ఎల్ఆర్ 22.5 శాతానికి తగ్గింది. ఈ నెల 14 నుంచి ఈ తగ్గింపు నిర్ణయం అమలవుతుందని పేర్కొంది. తాజా చర్యలతో వ్యవస్థలోకి సుమారు రూ.40,000 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకులకు రుణాలిచ్చేందుకు నిధుల లభ్యత పెరగనుంది. ఇదిలాఉండగా... రెపో రేటు 8 శాతం, రివర్స్ రెపో రేటు 7 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతం చొప్పున ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగనున్నాయి. బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్)లను కూడా ప్రస్తుత 9 శాతం వద్దే ఉంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వరుసగా రెండోసారీ నో చేంజ్... ఆర్బీఐ గవర్నర్‌గా గతేడాది సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన రాజన్.. ఆతర్వాత మూడుసార్లు పావు శాతం చొప్పున రెపో రేటును పెంచడం తెలిసిందే. అయితే, తాజాగా రేట్లను యథాతథంగా ఉంచడంద్వారా వరుసగా రెండోసారి పాలసీ రేట్లను పెంచడం లేదా తగ్గించకుండా వదిలేసినట్లయింది. ప్రధానంగా ద్రవ్యోల్బణం కట్టడికే తమ తొలిప్రాధాన్యమంటూ వస్తున్న రాజన్.. తాజాగా మోడీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా ఇదే పల్లవిని వినిపించారు. గతేడాది జీడీపీ వృద్ధి రేటు ఇంకా మందగమనంలోనే 4.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. కాగా, సరఫరాపరమైన అడ్డంకుల నేపథ్యంలో ఆర్బీఐ లక్ష్యానికి అనుగుణంగా ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశాలు లేవని విశ్లేషకులు అంటున్నారు. దీనివల్ల డిసెంబర్‌లోపు మరో విడత పాలసీ రేట్ల పెంపు తప్పకపోవచ్చని బ్రోకరేజి దిగ్గజం క్రెడిట్ సూసే అభిప్రాయపడింది. పాలసీలో ఇతర ముఖ్యాంశాలు... ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు గతంలో అంచనావేసినట్లుగానే 5.5 శాతంగా ఉండొచ్చు. ఫారెక్స్ మార్కెట్లో సానుకూల పరిస్థితుల నేపథ్యంలో(డాలరుతో రూపాయి విలువ బలపడటం) వ్యక్తిగతంగా విదేశాల్లో పెట్టే వార్షిక పెట్టుబడుల పరిమితి పెంపు. ప్రస్తుత 75,000 డాలర్ల స్థాయి నుంచి 1.25 లక్షల డాలర్లకు పెంచుతూ నిర్ణయం. బంగ్లాదేశ్, పాకిస్థాన్ పౌరులు మినహా భారత, విదేశీ పౌరులు భారత్ నుంచి బయటికి వెళ్లినప్పుడు ఇకపై రూ.25,000 వరకూ భారతీయ కరెన్సీని పట్టుకెళ్లేందుకు అనుమతి. ప్రస్తుతం విదేశాలకు వెళ్లే భారతీయులు రూ.10,000 వరకూ మాత్రమే దేశీ కరెన్సీని తమతో తీసుకెళ్లేలా ఆర్బీఐ పరిమితి ఉంది. ఫారెక్స్ మార్కెట్లో దేశీయ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కరెన్సీ డెరివేటివ్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు కూడా లావాదేవీలు జరిపేం దుకు అనుమతి. ఈ విభాగంలో ట్రేడింగ్ పరిమాణం తగ్గడంతో దీన్ని బలోపేతం చేసేందుకు చర్యలు. ఎక్స్పోర్ట్ క్రెడిట్ రీఫైనాన్స్ సదుపాయం కింద నిధుల లభ్యత తగ్గింపు. ప్రస్తుతం ఎగుమతిదారులు తాము చెల్లించాల్సిన రుణ మొత్తంలో మరో 50 శాతం వరకూ రుణం తీసుకోవడానికి వీలుండగా.. దీన్ని ఇప్పుడు 32 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను తగ్గించలేం తేల్చిచెప్పిన బ్యాంకర్లు ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ను అర శాతం తగ్గించినప్పటికీ.. తాము మాత్రం వడ్డీరేట్ల తగ్గించే అస్కారం లేదని బ్యాంకర్లు స్పష్టం చేశారు. పాలసీ సమీక్ష తమ అంచనాలకు అనుగుణంగానే ఉందన్నారు. ఆర్బీఐ పాలసీపై ఎవరేమన్నారంటే... ఆర్బీఐ నిర్దేశించిన స్థాయికంటే ప్రస్తుతం బ్యాంకుల ఎస్ఎల్ఆర్ స్థాయి అధికంగానే ఉంది. దీన్ని తగ్గించడంవల్ల తక్షణం ఎలాంటి ప్రభావం ఉండదు. ద్రవ్యసరఫరా పెంపు సంకేతమిది. సమీప కాలంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశాల్లేవు. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్మన్ కొత్త ప్రభుత్వం రానున్న నెలల్లో వృద్ధి పెంపునకు, ద్రవ్యోల్బణం కట్టడి కోసం తీసుకోబోయే పాలసీ విధానపరమైన చర్యలను పరిశీలించి తదనుగుణంగా తగిన నిర్ణయం తీసుకోవడానికివీలుగానే ఆర్బీఐ పరపతి విధాన నిర్ణయం ఉంది. కేంద్రంలో కొలువుదీరిన మోడీ సర్కారు వృద్ధికి చేయూతనిస్తుందన్న అంచనాల నేపథ్యంలో వేచిచూసే ధోరణితో ఆర్బీఐ వ్యవహరించింది. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ ఎస్ఎల్ఆర్ తగ్గింపు వల్ల మాకు రూ.1,600 కోట్ల నిధుల లభ్యత పెరిగినప్పటికీ వడ్డీరేట్లలో మార్పులను మేం పరిశీలించే అవకాశం లేదు. - ఎం.నరేంద్ర, ఐఓబీ సీఎండీ ఎస్ఎల్ఆర్ కోతను స్వాగతించిన కార్పొరేట్లు పాలసీ వడ్డీరేట్లను తగ్గించనప్పటికీ.. ఎస్ఎల్ఆర్ను అర శాతం తగ్గించడంపట్ల పారిశ్రామిక వర్గాలు హర్హం వ్యక్తం చేశాయి. ఈ చర్యతో కార్పొరేట్ రంగానికి రుణాలు పెంచేందుకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని చాంబర్లు పేర్కొన్నాయి. సరళ పాలసీని అనుసరించడం ద్వారా పెట్టుబడులను పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలను ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్దార్థ్ బిర్లా ప్రశంసించారు. కాగా, ఎస్ఎల్ఆర్ తగ్గింపు వల్ల పారిశ్రామిక రంగానికి పెట్టుబడులకు రుణ లభ్యత పెరిగి, వృద్ధికి కూడా ఊతమిస్తుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. కాగా, అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ మాత్రం నిధుల లభ్యత పెరగడం కంటే వడ్డీరేట్ల తగ్గింపే ప్రస్తుతం పారిశ్రామిక రంగానికి అత్యవసరమని చెప్పారు. రియల్టర్ల అసంతృప్తి: పాలసీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపట్ల రియల్ ఎస్టేట్ రంగం అసంతృప్తి వ్యక్తం చేసింది. వృద్ధికి ఊతమిచ్చేవిధంగా మళ్లీ హౌసింగ్ డిమాండ్ పెంచాలంటే ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించాలని రియల్టీ డెవలపర్ల సంఘాల సమాఖ్య(క్రెడాయ్) డిమాండ్ చేసింది. ‘వ్యవస్థలోకి ద్రవ్యసరఫరా పెంచేలా ఎస్ఎల్ఆర్ను తగ్గించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. అయితే, వడ్డీరేట్ల తగ్గింపు ద్వారా ఇళ్ల కొనుగోళ్లు పెంచే చర్యల కోసం రియల్టీ పరిశ్రమల వేచిచూస్తోంది’ అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ సి.శేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీర్ఘకాలం పాటు వడ్డీరేట్లు తగ్గకుండా అక్కడే ఉంటే ఇళ్ల కొనుగోళ్లు జోరందుకోవడం కష్టమని క్రెడాయ్ చైర్మన్ లలిత్ జైన్ పేర్కొన్నారు. ఆర్బీఐ అస్త్రాలు... నగదు నిల్వల నిష్పతి(సీఆర్ఆర్): బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో కచ్చితంగా ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన మొత్తమే సీఆర్ఆర్. రెపో రేటు: బ్యాంకులు తన వద్దనుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా పేర్కొంటారు. రివర్స్ రెపో: బ్యాంకులు తన వద్ద ఉంచే అదనపు నిధులపై రిజర్వ్ బ్యాంక్ చెల్లించే వడ్డీనే రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఎస్ఎల్ఆర్: బ్యాంకులు తమ వద్దనున్న డిపాజిట్లలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ సెక్యూరిటీ(బాండ్లు)ల్లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. దీన్నే చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)గా వ్యవహరిస్తారు. రుణ వృద్ధిని నియంత్రించేందుకు ఆర్బీఐ దీన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది.