‘మన జిల్లా - మన ప్రణాళిక’కు 6500 కోట్లు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ‘మన ఊరు - మన ప్రణాళిక’ ఓ కొలిక్కి వచ్చింది. రానున్న ఐదేళ్లలో జిల్లాలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం ఒక రూపం తీసుకొచ్చింది. గ్రామస్థాయి నుంచి మండలాలు, ఆ తర్వాత జిల్లా స్థాయిలోని ప్రతిపాదనలను కలగలపి ప్రయోగాత్మక ప్రతిపాదనలను సిద్ధం చేశారు జిల్లా ఉన్నతాధికారులు. జిల్లాలో మౌలిక వసతుల కల్పన, సామూహిక ప్రయోజనలే లక్ష్యంగా రూపొందించిన ‘మన ప్రణాళిక’లో కీలక శాఖలకు సంబంధించి రూ.6500 కోట్లకు పైగా ప్రతిపాదనలు తయారు చేశారు.
ఇందులో పారిశ్రామిక అభివృద్ధితో పాటు, కమ్యూనిటీ డెవలప్మెంట్, వైద్య, విద్య సదుపాయాలు, గృహనిర్మాణం, నీటిపారుదల శాఖ, రవాణా సౌకర్యాలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, దళితుల అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి, విద్యుత్ సౌకర్యాల మెరుగుదల, గ్రామీణ నీటి సరఫరా వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నివేదికను జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్రస్థాయి అధికారులకు అందజేశారు.
వీటికి సంబంధించి గ్రామ, మండల స్థాయి ప్రతిపాదనలను ఆన్లైన్లో కూడా ఉంచారు. వీటికి సీఎం ఆమోదం తెలిపి బడ్జెట్‌తో తగిన నిధులు కేటాయిస్తే ఐదేళ్ల తర్వాత జిల్లా రూపురేఖలే మారిపోనున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లాలో కీలక శాఖల అభివృద్ధికి సంబంధించి అధికారులు రూపొందించిన ముఖ్య ప్రతిపాదనలు ఇవే...
జిల్లాలో సాఫ్ట్వేర్ అండ్ ఎలక్ట్రానిక్ హబ్‌కు రూ. 50 కోట్లు. ప్రతి మండలంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్. ఇందుకోసం మండలానికి రూ.3 కోట్లు.
* జిల్లాలోని పేదలకు కొత్తగా 50 వేలకు పైగా గృహాల మంజూరు. ప్రతి ఇంటి నిర్మాణ వ్యయం రూ.3.50 లక్షల చొప్పున రూ.1100 కోట్లు.
* భారీ నీటిపారుదల సౌకర్యాల కోసం రూ. 450 కోట్లు. అందులో రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకానికి రూ.130 కోట్లు, ఇందిరాసాగర్ ఎత్తిపోతలకు రూ.110 కోట్లు. మధ్యతరహా నీటిపారుదల సౌకర్యాల కల్పనకు రూ.27 కోట్లు.
* జిల్లాలోని అన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరాలో భాగంగా ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైపులైన్లు, నల్లాల ఏర్పాట్లకు రూ. రూ.794 కోట్లు.
* జిల్లాలో మరో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పాటు రెండు ఏరియా ఆసుపత్రుల ఉన్నతీకరణకు ప్రతిపాదనలు. ఇందుకోసం రూ. 900 కోట్ల వ్యయం.
* అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, పౌష్టికాహార పంపిణీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాల కోసం రూ.121 కోట్లు.
* జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు. ఇందుకోసం రూ.1.5 కోట్ల అంచనా వ్యయం. డీఈవో, డిప్యూటీ డీఈవో కార్యాలయ భవనాల కోసం రూ.2.5 కోట్లు.
* భూసార పరీక్ష కేంద్రాలు, వ్యవసాయ శాఖ అ దికారుల భవనాల నిర్మాణం, 100 హెక్టార్లలో విత్తనోత్పత్తి కేంద్రం కోసం రూ.10 కోట్లు.
* ఏజెన్సీలో అభివృద్ధి పనుల నిమిత్తం ఐటీడీఏకు రూ. 7 కోట్లు. మార్కెటింగ్ శాఖకు 5 పనుల నిమిత్తం రూ.37 కోట్లు.
* జిల్లాలో ఉద్యాన వర్శిటీ ఏర్పాటుకు రూ.1000 కోట్లు. విద్యుత్ సౌకర్యాల కల్పనకు రూ.300 కోట్లు. ఖమ్మంలో కొత్త బస్టాండ్ నిర్మాణం, ఇల్లెందులో బస్‌డిపో ఏర్పాటు కోసం రూ.12 కోట్లు.
* ఒక్కోటి 11.70 లక్షల వ్యయంతో జిల్లాలో 39 చోట్ల ధాన్యం గోడౌన్లల ఏర్పాటు. జిల్లా సమాఖ్య భవనాలను రూ.35 ల క్షల వ్యయంతో నిర్మాణం. జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఒక్కోటి రూ.20 లక్షల వ్యయంతో వృద్ధాశ్రమాల ఏర్పాటు, రూ.50 లక్షలతో ఒక వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఏర్పాటు.
* ఒక్కో నియోజకవర్గానికి ఒక పని చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో రూ.75 కోట్ల వ్యయంతో పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం. భద్రాచలం, ఇల్లెందులలోని మత్స్య పరిశోధన కేంద్రాలలో రూ.2.5 కోట్ల వ్యయంతో చేప పిల్లల కేంద్రం ఏర్పాటు.
* జిల్లాలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనకు సెట్కంకు రూ.31 కోట్లు. ఎస్సీ నిరుద్యోగ యువత కోసం స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, దళితులకు ఫంక్షన్‌హాళ్ల నిర్మాణం కోసం రూ.30 కోట్లు.