మూతపడిన భూసార పరీక్ష కేంద్రాలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : వ్యవసాయాధికారులు లేక కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. పంటల దిగుబడి, ఎరువుల వాడకం, భూసార పరీక్షల ఫలితాలు, విత్తనాలు, ఎరువులు, పంటల్లో మెలకువలు తదితర అంశాల గురించి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన అధికారులు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఉన్న తక్కువ సిబ్బందిపై పనిభారం పడటంతో విధులకు న్యాయం చేయలేక పోతున్నారు.
ఈ ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా మండలాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో వ్యాపారులు రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అంట గడుతున్నారు. పంట నష్టం సమయంలో నివేదికలు తయారుచేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పథకాల ద్వారా స్ప్రింకర్లు, యంత్రాలు పొందేందుకు రైతులు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నారు.
తెరుచుకోని భూసార కేంద్రాలు
భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాల ఆధారంగా పంట మార్పిడి చేసి అధిక దిగుబడులు సాధించే విధంగా సలహాలు అందించే వారు కరువయ్యారు. జిల్లాలో భూసార పరీక్ష కేంద్రాలు పేరుకునాలుగు ఉన్నా జిల్లా కేంద్రాల్లో మినహా ఇంద్రవెల్లి, నిర్మల్, మంచిర్యాల భూసార పరీక్ష కేంద్రాల్లో సిబ్బంది లేక తెరుచుకోవడం లేదు. ఈ పరీక్ష కేంద్రాలకు 14 ఏవో స్థాయి అధికారులుతోపాటు ఆరుగురు ల్యాబ్ టెక్నీషియన్స్ ఉండాలి. కానీ జిల్లా కేంద్రంలో ఎనిమిది మంది ఉండాల్సిన ఏవోలు ముగ్గురు మాత్రమే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా భూసార పరీక్షల నమూనాల లక్ష్యం 10,500 కాగా ఇక్కడ సిబ్బంది కొరత వల్ల పరీక్షల ఫలితాలు జాప్యం జరుగుతుంది. దీంతో నమూనాల సగం వరకు హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తున్నారు.
ఖాళీల తీరు
జిల్లాలోని 52 మండలాలకు 98 వ్యవసాయ అధికారులు(ఏవో) ఉండాలి. కానీ, 55 మంది అధికారులు మాత్రమే ఉండగా, మరో 43 ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా మండల విస్తరణ అధికారుల(ఏఈవో)134 పోస్టులకు 97 మంది పనిచేస్తున్నారు. మరో 43 ఖాళీగా ఉన్నాయి. అలాగే జిల్లాలో సహాయ ఉపసంచాలకుల మూడు పోస్టు ఖాళీగా ఉన్నాయి. 16 మండ లాలకు జైనథ్ 2, నార్నూర్, జైనూర్, తాంసి, తానూర్, కుభీర్, లక్ష్మణచాంద, కోటపల్లి, జైపూర్, తాండూర్, దహెగాం, సిర్పూర్(యూ) ఇన్చార్జి అధికారులే కొనసాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 6.50 లక్షల హెక్టార్లలలో వివిధ రకాల పంటలు సాగు కానున్నాయి.
జిల్లాలో 3.50 లక్షల చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. మరో 40 వేల వరకు కౌలు రైతులు సాగు చేస్తున్నారు. వీరికి నూతన యంత్రీకరణ సాంకేతిక పద్ధతులు కొత్త వంగడాలు, ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలు, పంట రుణాలు వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తెలిచేయాల్సిన అవసరం ఉంది. కానీ సిబ్బంది కొరత వల్ల రైతులకు సమచారం అందడంలో జాప్యం జరుగుతుంది. ముఖ్యంగా అతివృష్టి, అనావృష్టి వల్ల పంట నష్టం సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో సర్వేలు చెపట్టడంలో అధికారుల కొరత తీవ్రంగా కనిపిస్తుంది. నష్టపోయిన రైతులకు పరిహారం అందడంలేదు. యాంత్రీకరణ పద్ధతులు, సాగు దిగుబడులు తెలియక, పాత పద్ధతులనే అనుసరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అయిన అధికారుల నియామకాలు జరిగితే రైతులకు క్షేత్రస్థాయిలో పంటల సర్వేలు, సూచనలు, అందుతాయని రైతులు ఆశిస్తున్నారు.
సిబ్బంది లేక ఇబ్బందే.. - రోజ్‌లీల, జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకురాలు
తగిన సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నాం. ఒక్కొక్క అధికారి రెండు మండలాలకు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక ఉట్నూర్ డివిజన్ పరిధిలోని 5 మండలాలకు ఇద్దరే వ్యవసాయ అధికారులు పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితమే డివిజన్లలో ఉన్న భూసార పరీక్ష కేంద్రాలలో ఒక ఏవో, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్స్ ఉండాలని కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు.