ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం వద్దు
కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్: అనంతపురం అర్బన్:విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల చెల్లింపులో జా ప్యం చేయవద్దని కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అధికారులను ఆదేశించారు. ఆయన తన చాంబర్లో బుధవారం సంక్షేమ శాఖల అధికారులుతో సమావేశమయ్యారు. ఫీజురీయిబర్స్‌మెంట్, ఉపకార వేతనాల చెల్లింపు ప్రక్రియపై సమీక్షించారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ (2013-14 సంవత్సరం) బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.30.28 కోట్లు నిధులను మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
గిరిజన విద్యార్థులకు నూరు శాతం చెల్లింపులు పూర్తి అయ్యాయన్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి రూ.7.5 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ.16 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ కు రూ.678 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్లు సంబంధిత అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత శాఖల కమీషనర్లతో మాట్లాడారు. బకాయిలను విడుదల చేసినట్లు వారు కలెక్టరుకు తెలిపారు.
డిసెంబర్ మొదటి వారం నుంచి విద్యార్థులకు బకాయిలను చెల్లించాలని సూచించారు. 2014-15 సంవత్సరాలకు రెన్యూవల్, నూతన ఉపకార వేతనాలు పొందేందుకు ఈ నెల 30లోపు తమ అడ్మిషన్ల వివరాలను విద్యార్ధులు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్దీన్ తెలిపారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన నాలుగు జతల యూనిఫాంలు, బెడ్ షీట్స్, కార్పెట్లు, నోట్ బుక్స్, వర్క్ బుక్క్‌లను, కాస్మాటిక్ చార్జీల పంపిణీని శాఖ వారీగా సమీక్షించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చక్రపాణి, మైనారిటీ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.