ప్రధాని 'సోమాలియా' వ్యాఖ్యలపై భగ్గుమన్న ట్విట్టర్ జనం
'దేవుడి సొంత ప్రదేశం' అని పేరున్న కేరళ రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమాలియాతో పోల్చడంతో ఆయనపై ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో జనం దుమ్మెత్తిపోస్తున్నారు. కేరళలో ఎన్నికల ప్రచారం చేసిన మోదీ.. ప్రజల ఆరోగ్యం, అభివృద్ధిలో కేరళ సోమాలియా కన్నావెనుకబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇటీవల జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలు, దళిత యువతిపై అత్యాచారం, హత్య లాంటి విషయాల్లో ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు.
అయితే.. మోదీ ఇలా వ్యాఖ్యానించడంపై ట్విట్టర్ జనాలు తీవ్రంగా స్పందించారు. 'పో మోన్ మోదీ' అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ఇది ఓ మళయాళం సినిమాలోని ఫేమస్ డైలాగ్ 'పో మోనే దినేశా'కు పేరడీ. 'ఇక చాలు, ఇంటికి వెళ్లు' అని దీనికి అర్థం. ఎన్నికల్లో గెలుపు కోసమే ప్రధాని ఇలా వ్యాఖ్యానించారని, రాష్ట్రాన్ని సోమాలియాతో పోల్చడం సిగ్గుచేటని కేరళ సీఎం ఊమెన్ చాందీ అన్నారు. సోమాలియా లాంటి కరువు దేశం లక్షణాలు ఒక రాష్ట్రంలో ఉన్నాయనడం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు.
మే 16న కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధానంగా సోలార్ కుంభకోణం, ఒక మహిళ సీఎం మీద, ఆయన కుమారుడి మీద చేసిన ఆరోపణల లాంటివి సంచలనం సృష్టించాయి.