Son Of Sardaar 2 Movie
-
సన్ ఆఫ్ సర్దార్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అశ్విని ధీర్ కుమారుడు మృతి చెందారు. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో జలజ్ (18) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో అతనితో పాటు స్నేహితుడు కూడా మరణించారు. ఈ ఘటనతో దర్శకుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.నవంబర్ 23న ముంబయిలోని విలే పార్లేలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని సహారా స్టార్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తన స్నేహితులైన సాహిల్ మెంధా (18), సర్త్ కౌశిక్ (18), జెడాన్ జిమ్మీ (18)తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాహిల్, జెడాన్ స్వల్ప గాయాలతో బయటపడగా.. సర్త్, జలజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న సాహిల్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ముంబయి పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో కారు 120 కిలోమీటర్లకు పైగా స్పీడుతో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కాగా.. బాలీవుడ్ దర్శకుడు అశ్విని ధీర్ తన కెరీర్లో పలు చిత్రాలను తెరకెక్కించారు. సన్ ఆఫ్ సర్దార్, ఉ మే ఔర్ హమ్, అతిథి తుమ్ కబ్ జావోగే లాంటి చిత్రాలను రూపొందించారు. అంతేకాకుండా సినిమాలతో పాటు హమ్ ఆప్కే హై ఇన్ లాస్, హర్ షాఖ్ పే ఉల్లు బైతా హై వంటి ప్రముఖ సీరియల్స్‌కు కూడా దర్శకత్వం వహించారు. కాగా.. 2017లో గెస్ట్ లిన్ లండన్ అనే సినిమాకు చివరిసారిగా దర్శకత్వం వహించారు. -
'హీరోను పలకరించలేదని సినిమా నుంచి తీసేశారు!'
'సన్ ఆఫ్ సర్దార్'.. 2012లో వచ్చిన ఈ హిందీ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇది తెలుగులో వచ్చిన మర్యాద రామన్న మూవీకి రీమేక్ అన్న విషయం తెలిసిందే! పుష్కరకాలం తర్వాత 'సన్ ఆఫ్ సర్దార్' మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించనున్నాడు.ప్రవర్తన బాగోలేదనే..ఈ సీక్వెల్లో నటుడు విజయ్ రాజ్‌ను కూడా సెలక్ట్ చేశారు. తర్వాత అర్ధాంతరంగా అతడిని సినిమా నుంచి తొలగించారు. అతడి ప్రవర్తన బాగోలేదనే మూవీలో నుంచి తీసేశామని చిత్ర సహ నిర్మాత కుమార్ మంగట్ పాఠక్ అంటున్నాడు. ఆయన మాట్లాడుతూ.. 'అవును, మా సినిమా నుంచి విజయ్ రాజ్‌ను తీసేశాం. అది సరిపోదట!అతడికి విశాలవంతమైన గదులు కావాలట.. పెద్ద వానిటీ వ్యాన్ కావాలని డిమాండ్ చేస్తున్నాడు. పైగా అతడి కిందపనిచేసేవారికి రోజుకు రూ.20,000 ఇవ్వాలంటున్నాడు. పెద్ద పెద్ద నటులు కూడా అంత డబ్బు తీసుకోరు. యూకేలో అందరికీ మంచి గదులు తీసుకున్నాం. ఒక్క రోజుకు ఒక్క గది అద్దె.. రూ.45,000. అది తనకు సరిపోదట! ఇంకా పెద్ద లగ్జరీ రూమ్ కావాలన్నాడు.నేనేమీ అడుక్కోలేదుఅంతే కాకుండా.. ఈ సినిమాలో యాక్ట్ చేయమని మీరు నన్ను సంప్రదించారు. ఛాన్సివ్వమని నేనేమీ మిమ్మల్ని అడుక్కోలేదు అంటూ రూడ్‌గా మాట్లాడాడు' అని చెప్పుకొచ్చాడు. మరోవైపు సెట్లో అజయ్ దేవ్‌గణ్‌ను పలకరించలేదనే తనను తప్పించారని విజయ్ ఆరోపించాడు. -
హిందీలో ‘మర్యాద రామన్న’ సిక్వెల్.. సోనాక్షి ప్లేస్‌లో మృణాల్!
సన్నాఫ్ సర్దార్‌గా అజయ్ దేవగన్ అతి త్వరలో స్కాట్లాండ్ వెళ్లనున్నారని బాలీవుడ్ సమాచారం. అజయ్ దేవగన్, సోనాక్షీ సిన్హా, సంజయ్ దత్ లీడ్ రోల్స్‌లో అశ్వినీ ధీర్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘సన్నాఫ్ సర్దార్’ (2012). రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’కు హిందీ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత ‘సన్నాఫ్ సర్దార్’కు సీక్వెల్‌గా ‘సన్నాఫ్ సర్దార్ 2’ చిత్రం రానుందని సమాచారం. తొలి భాగంలో లీడ్ రోల్స్‌లో నటించిన అజయ్ దేవగన్, సంజయ్ దత్ సీక్వెల్లోనూ నటించనున్నారని, హీరోయిన్గా మాత్రం సోనాక్షీ సిన్హా ప్లేస్‌లో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారని భోగట్టా. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్‌ని స్కాట్లాండ్లో జరిపేలా ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ దాదాపు యాభై రోజులకు పైగా ఉంటుందని, అజయ్ దేవగన్–మృణాల్ ఠాకూర్ల కాంబినేషన్ ట్రాక్ అంతా విదేశాల్లోనే చిత్రీకరిస్తారని టాక్. ఈ సినిమాకు అజయ్ దేవగనే దర్శకత్వం వహిస్తారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.