sp rajasekhar babu
-
టీడీపీ జెండాలతో కొండకు వచ్చిన ప్రభలు
నరసరావుపేట: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వద్ద నిర్వహించే తిరునాళ్లకు వచ్చే ప్రభలపై రాజకీయ పార్టీల జెండాలు ఉంటే సహించబోం. అంటూ రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబు చేసిన హెచ్చరికలను టీడీపీ శ్రేణులు పట్టించుకున్నట్లుగా కన్పించలేదు. ఆయన ఆదేశాలను ఖాతరు చేయకుండా రెండు ప్రభల నిర్వాహకులు ఏకంగా టీడీపీ జెండాలతో తీసుకొనిరావటం గమనార్హం. సోమవారం కోటప్పకొండ వద్ద జరిగిన తిరునాళ్లకు సుమారు 11 విద్యుత్ ప్రభలు తరలిరాగా, వాటిలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వచ్చిన యడవల్లి, కమ్మవారిపాలెం గ్రామాలకు చెందిన ప్రభలు ఏకంగా తెలుగుదేశం పార్టీ జెండాలను ఏర్పాటుచేసి కొండకు తీసుకొచ్చారు. ప్రభలపై తెలుగుదేశం పార్టీ ప్రభ అంటూ బోర్డులను సైతం ఏర్పాటుచేయటం గమనార్హం. -
కానిస్టేబుల్స్ రాతపరీక్షకు పకడ్బందీ చర్యలు
-మొత్తం పరీక్ష కేంద్రాలు: 43 - హాజరుకానున్న అభ్యర్థులు: 23.095 - నేటి ఉదయం 10 గంటల నుంచి ఒకటి దాకా పరీక్ష అనంతపురం సెంట్రల్ : జిల్లాలో ఆదివారం నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ రాజశేఖరబాబు ఆదేశించారు. శనివారం పోలీసు అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్షల నిర్వహణ బాధ్యత జేఎన్టీయూ తీసుకుందన్నారు. జిల్లాలో అనంతపురం, గుత్తి, పామిడి పట్టణాల్లో మొత్తం 43 కేంద్రాల్లో 23,095 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వివరించారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలని, ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకూ పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. లేకపోతే దేహధారుడ్య, తదితర పరీక్షలకు అర్హత కోల్పోతారన్నారు. డీఎస్పీలు మల్లికార్జున, ఖాసీంసాబ్, మల్లికార్జునవర్మ, రవికుమార్, నాగసుబ్బన్న, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, పలువురు సీఐలు, ఎస్ఐలు, ఐటీ కోర్‌టీం సభ్యులు పాల్గొన్నారు. -
పరిస్థితి పూర్తిగా అదుపులోకి
– ‘పురం’లో మకాం వేసిన డీఐజీ, ఎస్పీ హిందూపురం అర్బన్ : హిందూపురంలో ఇరువర్గాల మధ్య గొడవల కారణంగా చెలరేగిన ఉద్రిక్తత వాతావరణం పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఎస్పీ రాజశేఖర్‌బాబు అన్నారు. మంగళవారం రాత్రి శ్రీకంఠపురం, రహమత్‌పురంలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరింపజేశారు. చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి సీఐలు, ఎస్ఐలతో పాటు స్పెషల్ పోలీసులు తరలివచ్చి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. సంఘటన జరిగిన వెంటనే ఎస్పీ హిందూపురానికి చేరుకుని పరిస్థితి పర్యవేక్షించారు. బుధవారం ఉదయం డీఐజీ ప్రభాకర్‌రావు కూడా పట్టణానికి వచ్చి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లోని గెస్ట్‌హౌస్ వద్ద అధికారులతో సమావేశమయ్యారు. అలాగే సంఘటనకు కారకులైన ఇద్దరు ద్విచక్రవాహనదారులను వేర్వేరుగా పిలిపించి విషయాన్ని తెలుసుకున్నారు. రహమత్‌పురం, శ్రీకంఠపురంలో ఉన్న కొందరు అనుమానితులను కూడా పోలీసుస్టేషన్‌కు రప్పించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ సంఘటన తెలిసిన వెంటనే పెనుకొండ, మడకశిర, కదిరి, గోరంట్ల, అమరాపురం ఇతర మండలాల నుంచి 10 మంది డీఎస్పీలు, 16 మంది సీఐలు, సిబ్బందిని ఇక్కడికి తీసుకువచ్చి బందోబస్తు చేశామన్నారు. అసాంఘిక శక్తులను కూకటి వేళ్లతో పెకలించి వేస్తామన్నారు. -
అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారు
అనంతపురం సెంట్రల్ : తమ భూమిని అమ్మలేదని అక్రమంగా ఎస్సీ,ఎస్టీ కేసు బనాయించారని ముదిగుబ్బ మండలం ఎనుముల వారిపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డి, ఆయన భార్య, కొడుకు(పుట్టకతో మూగవారు) జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... సర్వేనెంబర్ 302, 304లో 2.84 ఎకరాలు, సర్వేనెంబర్ 302 బీ1లో 72 సెంట్లు 2014లో కదిరికి చెందిన మట్రా పార్వతికి రిజిస్టర్ చేయించామని తెలిపారు. అయితే ఆమె గడువులోగా డబ్బులు చెల్లించకపోవడంతో తామే భూమిని సాగు చేస్తున్నామని వివరించారు. ఇటీవల వచ్చి తన భూమి తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని తెలిపారు. కాగా తాము విక్రయించమని, అప్పట్లో ఇచ్చిన డబ్బును కూడా తిరిగి చెల్లిస్తామని చెప్పామన్నారు. దీంతో ఆమె స్వయంగా గాయపర్చుకొని కదిరి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ,ఎస్టీ కేసు తమపై పెట్టిందని వివరించారు. తమతో పాటు గ్రామస్తులైన బయపరెడ్డి, కోటేశ్వరరెడ్డి, పురుషోత్తంరెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నరసింహారెడ్డిలను కేసులో అక్రమంగా ఇరికించారని తెలిపారు. దీనిపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారని బాధితులు వివరించారు. -
‘ఉగ్ర ’విచారణలో మా పాత్ర లేదు
జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రజలు ఆందోళన చెందొద్దు అనంతపురం సెంట్రల్ : అనంతపురం జిల్లాకు వచ్చిన ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారిస్తోందని, ఇందులో జిల్లా పోలీసుల పాత్ర నామమాత్రంగానే ఉంటుందని జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారు. పూర్తి స్థాయి విచారణలో తమ పాత్ర ఉండదని ఆయన స్పష్టం చేశారు. గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాకు ఉగ్రవాదులు వచ్చిన విషయం తాను కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నానన్నారు. అయితే మీడియా ఎక్కువ వార్తలు రాస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని తెలిపారు. జిల్లాలో భద్రత విషయంపై ముందునుంచి అప్రమత్తంగానే ఉన్నామని చెప్పారు. జిల్లాకు ఉగ్రవాదులు వచ్చింది? ఎవర్ని కలిసింది? ఎక్కడ ఉండేది తదితర విషయాలపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. జిల్లాలో ప్రతి ఒక్క లాడ్జిల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే పెద్ద లాడ్జీల నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నారని, చిన్న లాడ్జీల నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులు వలన పెట్టుకోలేకపోతున్నామని చెబుతున్నారన్నారు. కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు విషయంలో కచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. నగరంలో ప్రముఖ ప్రాంతాల్లో, సున్నిత ప్రదేశాల్లో సైతం సీసీ కెమెరాలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.