‘ఉగ్ర ’విచారణలో మా పాత్ర లేదు
Published Fri, Jul 8 2016 11:46 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM
జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు
ప్రజలు ఆందోళన చెందొద్దు
అనంతపురం సెంట్రల్ : అనంతపురం జిల్లాకు వచ్చిన ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారిస్తోందని, ఇందులో జిల్లా పోలీసుల పాత్ర నామమాత్రంగానే ఉంటుందని జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారు. పూర్తి స్థాయి విచారణలో తమ పాత్ర ఉండదని ఆయన స్పష్టం చేశారు. గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాకు ఉగ్రవాదులు వచ్చిన విషయం తాను కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నానన్నారు. అయితే మీడియా ఎక్కువ వార్తలు రాస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని తెలిపారు. జిల్లాలో భద్రత విషయంపై ముందునుంచి అప్రమత్తంగానే ఉన్నామని చెప్పారు. జిల్లాకు ఉగ్రవాదులు వచ్చింది? ఎవర్ని కలిసింది? ఎక్కడ ఉండేది తదితర విషయాలపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. జిల్లాలో ప్రతి ఒక్క లాడ్జిల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే పెద్ద లాడ్జీల నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నారని, చిన్న లాడ్జీల నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులు వలన పెట్టుకోలేకపోతున్నామని చెబుతున్నారన్నారు. కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు విషయంలో కచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. నగరంలో ప్రముఖ ప్రాంతాల్లో, సున్నిత ప్రదేశాల్లో సైతం సీసీ కెమెరాలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
Advertisement