హిందూపురంలో ఇరువర్గాల మధ్య గొడవల కారణంగా చెలరేగిన ఉద్రిక్తత వాతావరణం పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఎస్పీ రాజశేఖర్‌బాబు అన్నారు.
– ‘పురం’లో మకాం వేసిన డీఐజీ, ఎస్పీ
హిందూపురం అర్బన్ : హిందూపురంలో ఇరువర్గాల మధ్య గొడవల కారణంగా చెలరేగిన ఉద్రిక్తత వాతావరణం పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఎస్పీ రాజశేఖర్‌బాబు అన్నారు. మంగళవారం రాత్రి శ్రీకంఠపురం, రహమత్‌పురంలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరింపజేశారు. చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి సీఐలు, ఎస్‌ఐలతో పాటు స్పెషల్ పోలీసులు తరలివచ్చి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. సంఘటన జరిగిన వెంటనే ఎస్పీ హిందూపురానికి చేరుకుని పరిస్థితి పర్యవేక్షించారు. బుధవారం ఉదయం డీఐజీ ప్రభాకర్‌రావు కూడా పట్టణానికి వచ్చి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లోని గెస్ట్‌హౌస్ వద్ద అధికారులతో సమావేశమయ్యారు.
అలాగే సంఘటనకు కారకులైన ఇద్దరు ద్విచక్రవాహనదారులను వేర్వేరుగా పిలిపించి విషయాన్ని తెలుసుకున్నారు. రహమత్‌పురం, శ్రీకంఠపురంలో ఉన్న కొందరు అనుమానితులను కూడా పోలీసుస్టేషన్‌కు రప్పించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ సంఘటన తెలిసిన వెంటనే పెనుకొండ, మడకశిర, కదిరి, గోరంట్ల, అమరాపురం ఇతర మండలాల నుంచి 10 మంది డీఎస్పీలు, 16 మంది సీఐలు, సిబ్బందిని ఇక్కడికి తీసుకువచ్చి బందోబస్తు చేశామన్నారు. అసాంఘిక శక్తులను కూకటి వేళ్లతో పెకలించి వేస్తామన్నారు.