sp senthil kumar
-
పులివెందులలో వైఎస్ జగన్ ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లు
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందులలోని బాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ ఇంటిని ఆదివారం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ సెంథిల్‌కుమార్ ఇతర పోలీసు అధికారులతో కలసి సందర్శించారు. వైఎస్ జగన్ ఇంటివద్ద ఎలాంటి భద్రత ఏర్పాటు చేయాలి, సీసీ కెమెరాలు ఎక్కడ అమర్చాలి, సందర్శకులను ఇంటి లోపలికి ఏవిధంగా పంపించాలి అనే అంశాలపై చర్చించారు. అనంతరం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్, అగ్నిమాపక అధికారులకు ఎస్పీ సెంథిల్‌కుమార్ పలు సూచనలు ఇచ్చారు. అనంతరం హెలీప్యాడ్ ప్రాంతాన్ని కూడా వారు పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులరెడ్డి, ఇంటలిజెన్స్ డీఎస్పీ ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ రమణయ్య, పులివెందుల డీఎస్పీ నాగరాజు, అర్బన్ సీఐ రామాంజి నాయక్, రూరల్ సీఐ రామకృష్ణుడు, ఎస్ఐ శివప్రసాద్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
'ఎమ్మెల్యే కాపుపై కేసు నమోదు చేశాం'
అనంతపురం : వైఎస్ఆర్ సీపీ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశామని అనంతపురం ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. కౌన్సిలింగ్ పేరుతో తాము ఎవరినీ వేధించలేదని ఆయన శనివారమిక్కడ అన్నారు. వాహనాలు తనిఖీలు, సోదాలలో భాగంగా ఇప్పటివరకూ రూ.2.78కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎన్నికల భద్రత కోసం జిల్లాకు 5000మంది పోలీసులు కావాలని కోరినట్లు ఆయన తెలిపారు. కాగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోగ్య పరిస్థితి క్రమంగా కుదుటపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాయదుర్గం పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ మంగళవారం ఆయన పోలీసు స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స కోసం ముందు బళ్లారికి, అక్కడనుంచి బెంగళూరుకు తరలించిన విషయం విదితమే. -
ఎస్పీ సెంథిల్‌కుమార్‌ను సస్పెండ్ చేయండి: ఎంపీ అనంత
అనంతపురం జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్‌పై ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల పేరుతో సామాన్యులను టార్గెట్ చేసుకోవడం తగదని, నేరచరిత్ర లేకున్నా కూడా కార్యకర్తలను కౌన్సెలింగ్ పేరుతో వేధిస్తున్నారని ఆయన అన్నారు. కౌన్సెలింగ్ పేరుచెప్పి కొంతమంది కార్యకర్తలపై అవసరం లేకున్నా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కూడా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎస్పీ సెంథిల్ కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.