‘అఖిలేశ్‌తో ఎలా వేగమంటారు?’
న్యూఢిల్లీ: త్వరలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల కోసం కేంద్రంలోని అధికార పార్టీ వేగంగా దూసుకెళుతుండగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాది పార్టీ మాత్రం ఇంకా ఇంటి పంచాయితీలతోటే సతమతమవుతోంది. ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, ఆయన మద్దతు దారులు తనను అవమానిస్తున్నారని మరోసారి ఎస్పీ నేత అమర్ సింగ్ ఫిర్యాదు చేశారు. దేనికైనా ఒక హద్దు ఉంటుందని, ఆ మేరకు మాత్రమే భరించగలమని, ఈ విషయంలో ఏం చేయమంటారో చెప్పండంటూ ఆయన సోమవారం పార్టీ చీఫ్ ములాయం సింగ్‌తో భేటీ అయ్యారు.
‘నాకు అఖిలేశ్ ను బాధపెట్టడం ఇష్టం లేదు. కానీ నా సహనాన్ని మించిన అవమానాలు ఎదురయ్యాయి. నా మనసు గాయపడింది. నేను ములాయంతో మాట్లాడుతాను. కుమారుడిని కూడా కాదని నేరుగా నాకు మద్దతిచ్చిన వ్యక్తి ములాయం. ఆయన ఏది చెప్తే అదే చేస్తాను’ అని అమర్ సింగ్ ములాయంను కలవకముందు మీడియాతో చెప్పారు. అవమానాలు ఎదురవుతున్న నేపథ్యంలో రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా ములాయంను గాయపరిచే ఏ చర్యలను తాను చేయబోనని ఆయన చెప్పారు. ‘నేను అఖిలేశ్ తో ఉండకపోవచ్చు. కానీ ఎప్పటికీ ములాయంతోనే ఉంటాను. అయినప్పటికీ నేను ఎప్పుడు ఏం మాట్లాడినా అఖిలేశ్‌కు అనుకూలంగా మాట్లాడతాను. నేతాజీకి నేనేమిటో పూర్తిగా తెలుసు’ అని ఆయన చెప్పారు.