Spartan Sports
-
సచిన్‌కు ‘స్పార్టన్’ క్షమాపణలు
న్యూఢిల్లీ: భారత దిగ్గజం సచిన్, ఆస్ట్రేలియాకు చెందిన బ్యాట్ల తయారీ కంపెనీ ‘స్పార్టన్’ల మధ్య ఏడాది కాలంగా కొనసాగుతోన్న వివాదం ముగిసింది. ఒప్పంద ఉల్లంఘనకుగాను గురువారం కంపెనీ క్షమాపణలు తెలపడంతో సచిన్ ఈ వివాదాన్ని ముగించేందుకు అంగీకరించాడు. ‘ఇచ్చిన మాట తప్పినందుకు టెండూల్కర్ మన్నించాలి’ అని స్పార్టన్ సీఓఓ లెస్ గాల్‌బ్రెత్ కోరాడు. ‘స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని గౌరవించనందుకు సచిన్‌కు హృదయపూర్వక క్షమాపణలు. అత్యంత ఓపికగా ఈ వివాదాన్ని పరిష్కరించిన సచిన్ తీరుకు మా కృతజ్ఞతలు’ అని ఆయన చెప్పారు. 2016లో స్పార్టన్ కంపెనీకి సచిన్ ప్రచారకర్తగా వ్యవహరించాడు. అయితే ఒప్పందం ప్రకారం రాయల్టీ, ఎండార్స్మెంట్ ఫీజులు చెల్లించడంలో స్పార్టన్ విఫలమైంది. ఒప్పందం ముగిశాక కూడా అనుమతి లేకుండా సచిన్ ఫొటోలు, పేరు వాడుకుంటూ వ్యాపారం చేసింది. దీంతో న్యాయబద్ధంగా పోరాటం చేసిన సచిన్ గతేడాది జూన్‌లో ఆ కంపెనీపై 2 మిలియన్ డాలర్లు (రూ. 15.1 కోట్లు) దావా వేశాడు. -
ధోనిని మోసగించిన కంపెనీ!
న్యూఢిల్లీ:ఇప్పటికే టెస్టుల నుంచి వీడ్కోలు తీసుకుని బ్రాండ్ అంబాసిడర్‌గా వెనుకబడ్డ టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఓ ప్రముఖ కంపెనీ ఊహించని షాకిచ్చింది.ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్టింగ్ కంపెనీ స్పార్టాన్ ధోనికి రావాల్సిన కోట్ల మొత్తాన్ని ఇవ్వకుండా ఎగవేసింది. ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ధోనికి దాదాపు రూ.13 కోట్లను ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతుంది. కేవలం ఇప్పటివరకూ నాలుగు వాయిదాలు మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఎగ్గకొట్టే యత్నంలో ఉన్నట్లు ధోని స్పోర్ట్ మేనేజ్ మెంట్ కంపెనీ రితి స్పోర్ట్స్ స్పష్టం చేసింది. కనీసం మెస్సేజ్‌లకు సైతం ఆ సంస్థ స్పందించడం లేదని రితీ స్పోర్ట్స్ వ్యవహారాలను చూసే అరుణ్ పాండే తెలిపారు. ఈ కంపెనీతో 2013లో ధోని ఒప్పందం చేసుకోగా, 2016 మార్చిలో చివరిసారి ఒక వాయిదా చెల్లించినట్లు అరుణ్ పాండే అన్నారు. ఆ సదరు కంపెనీపై న్యాయపోరాటానికి సిద్దమవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు సిడ్నీలోనూ, ఇటు ఢిల్లీలోనూ ఆ కంపెనీపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
‘ఐదో’ విలువైన ఆటగాడు
‘ఫోర్బ్స్’ విలువైన ప్రపంచ అథ్లెట్ల జాబితాలో ధోనికి ఐదో స్థానం న్యూయార్క్: భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని... ప్రపంచంలో విలువైన అథ్లెట్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ‘ఫోర్బ్స్’ తయారు చేసిన ఈ జాబితాలో భారత్ నుంచి కేవలం మహీ ఒక్కడికే స్థానం దక్కింది. 2014లో ధోని బ్రాండ్ విలువ 20 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.122 కోట్లు)గా లెక్కగట్టింది. గతేడాదితో పోలిస్తే ధోని బ్రాండ్ విలువ 1 మిలియన్ డాలర్లు తగ్గింది. అయినా ధోని ఐదో స్థానంలో నిలిచాడు. 2013 చివర్లో స్పార్టన్ స్పోర్ట్స్, అమిటీ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న బ్యాట్ ఒప్పందంతో ధోని బ్రాండ్ విలువ బాగా పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది. బ్యాట్ కోసం రీబాక్ ఏడాదికి 1 మిలియన్ డాలర్లు ఇస్తే... స్పార్టన్ 4 మిలియన్ డాలర్లు చెల్లించిందని వెల్లడించింది. అమెరికా బాస్కెట్ బాల్ స్టార్ ప్లేయర్ లీబ్రాన్ జేమ్స్ (37 మిలియన్ డాలర్లు) ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... టైగర్ వుడ్స్ (36 మిలియన్ డాలర్లు), రోజర్ ఫెడరర్ (32 మిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్, రియల్ మాడ్రిడ్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో, లియోనాల్ మెస్సీ (అర్జెంటీనా), రాఫెల్ నాదల్ టాప్-10లో ఉన్నారు.