ధోనిని మోసగించిన కంపెనీ!
న్యూఢిల్లీ:ఇప్పటికే టెస్టుల నుంచి వీడ్కోలు తీసుకుని బ్రాండ్ అంబాసిడర్గా వెనుకబడ్డ టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఓ ప్రముఖ కంపెనీ ఊహించని షాకిచ్చింది.ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్టింగ్ కంపెనీ స్పార్టాన్ ధోనికి రావాల్సిన కోట్ల మొత్తాన్ని ఇవ్వకుండా ఎగవేసింది. ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన ధోనికి దాదాపు రూ.13 కోట్లను ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతుంది.
కేవలం ఇప్పటివరకూ నాలుగు వాయిదాలు మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఎగ్గకొట్టే యత్నంలో ఉన్నట్లు ధోని స్పోర్ట్ మేనేజ్ మెంట్ కంపెనీ రితి స్పోర్ట్స్ స్పష్టం చేసింది. కనీసం మెస్సేజ్లకు సైతం ఆ సంస్థ స్పందించడం లేదని రితీ స్పోర్ట్స్ వ్యవహారాలను చూసే అరుణ్ పాండే తెలిపారు. ఈ కంపెనీతో 2013లో ధోని ఒప్పందం చేసుకోగా, 2016 మార్చిలో చివరిసారి ఒక వాయిదా చెల్లించినట్లు అరుణ్ పాండే అన్నారు. ఆ సదరు కంపెనీపై న్యాయపోరాటానికి సిద్దమవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు సిడ్నీలోనూ, ఇటు ఢిల్లీలోనూ ఆ కంపెనీపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.