దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక యాప్
విజయవాడ: ఈ దసరాకు బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లగోరే భక్తులకు శుభవార్త. ఉత్సవాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అక్కడ ఎలాంటి సౌకర్యాలున్నాయి? ఏయే వేళల్లో విశిష్ఠ పూజలు జరుగుతాయి? అమ్మవారి దర్శనం సాఫిగా జరగాలంటే ఏం చేయాలి? తదితర వివరాలు తెలసుకోవడం ఇక అరచేయి చూసుకున్నంత సులువు. ఈ దసరా ఉత్సవాల కోసం విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం రూపొందించిన ప్రత్యేక యాప్ డౌన్ లోడ్ చేసుకోవటం ద్వారా మీరూ ఈ వివరాలు పొందొచ్చు.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ సాఫ్ట్ట్వేర్ ఉన్న ఫోన్ వినియోగదారులు ప్లేస్టోర్స్ నుంచి ఈ యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దసరా ఉత్సవాలు 2015 పేరిట రూపొందించిన ఈ యాప్ ముఖచిత్రంలో అమ్మవారి ఫొటోతోపాటు సీఎం చంద్రబాబు ఫొటో, రాష్ట్ర ప్రభుత్వ లోగోను ఉంచారు. సర్వీసులు, గ్యాలరీ, ఈవెంట్స్, దసరా, అలంకారాలు, న్యూస్ ఇలా ఆరు విభాగాలుగా యాప్లో పలు అంశాలను జోడించారు. సర్వీసు అంశానికి వచ్చేసరికి ట్రాన్స్పోర్టు, మెడికల్ క్యాంపుల వివరాలను పొందుపరిచారు. ఈ యాప్ను దేవస్థానం అధికారులు సోమవారం లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.