మోడీ కోసం జోధ్‌పురి సూట్!
ప్రమాణం సందర్భంగా ధరించేందుకు రూపొందించిన ముంబై డిజైనర్
ముంబై: నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజేపీ నేత నరేంద్ర మోడీ ధరించేందుకుగాను ముంబైకి చెందిన సాయి సుమన్ అనే ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యేక సూట్‌ను రూపొందించారు. రెండు స్లీవ్‌లెస్ జాకెట్లతో, బీజేపీ గుర్తు కమలంతో కూడిన గుండీలతో కుట్టిన ఈ జోధ్‌పురి సూట్‌ను ప్రమాణ స్వీకారం సందర్భంగా మోడీ ధరిస్తే చూడాలని ఉందని ఆదివారం ఆమె ‘పీటీఐ’తో తెలిపారు. మోడీని తాను చాలారోజుల నుంచీ పరిశీలిస్తున్నానని, ఈ సూట్ ఆయనకు సరిగ్గా నప్పుతుందని అభిప్రాయపడ్డారు.
మోడీ ఇష్టాలను దృష్టిలో పెట్టుకునే తాను రంగులు, వస్త్రాన్ని ఉపయోగించానన్నారు. మోడీ ఎన్నికల్లో గెలిచి ప్రధాని అవుతారని తనకు గట్టి నమ్మకం ఉండేదని, సిడ్నీలో ఫ్యాషన్ షో చేస్తుండగా మోడీకి సూట్ కుట్టాలన్న ఆలోచన వచ్చిందన్నారు. దీనిని ప్రమాణ స్వీకారానికి ముందే ఆయనకు బహుమతిగా అందించేందుకు ప్రయత్నిస్తానన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు తేలికపాటి రంగుల దుస్తులు వేసుకుంటారని, కానీ మోడీ మాత్రం వివిధ రంగులతో ప్రయోగాలు చేస్తార న్నారు.