Special Tariff Voucher
-
జలమండలికి ప్రత్యేక టారిఫ్
సాక్షి, హైదరాబాద్: జలమండలికి సంబంధించిన విద్యుత్ సబ్సిడీలను ప్రభుత్వం విడుదల చేయట్లేదని, వీటిని సకాలంలో విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) తోసిపుచ్చింది. జలమండలికి ప్రస్తుతం రాయితీపై అమలు చేస్తున్న ప్రత్యేక టారిఫ్ స్థానంలో పాత హెచ్‌టీ–4(బీ) కేటగిరీ టారిఫ్‌ను కొనసాగించా లన్న డిస్కంల మరో విజ్ఞప్తిని కూడా ఈఆర్సీ నిరాకరించింది. జలమండలి ప్రత్యేక టారిఫ్‌పై పెండింగ్‌లో ఉన్న కేసులో ఇటీవల డిస్కంలు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. సత్వరమే పెండింగ్ టారిఫ్ ప్రతిపాదనలను దాఖలు చేయాలని, టారిఫ్ ఉత్తర్వుల్లో జలమండలికి సంబంధించిన ప్రత్యేక టారిఫ్ అంశంపై తుది ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. అప్పట్లోగా జలమండలికి సంబంధించిన తాగునీటి సరఫరా పంప్‌హౌస్‌లకు విద్యుత్ కనెక్షన్లను కట్ చేయబోమని డిస్కంలు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని ఈఆర్సీ కోరింది. హైదరాబాద్ మెట్రో రైలు కోసం యూనిట్ విద్యుత్‌కు రూ.3.95 చొప్పున అమలు చేస్తున్న ప్రత్యేక టారిఫ్‌ను తాగునీటి సరఫరా పంప్‌హౌస్‌లకు సైతం వర్తింపజేయాలని జలమండలి చేసిన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందిస్తూ గతేడాది జూలైలో ఈఆర్సీ తాత్కాలిక నిర్ణయం తీసుకుంది. 2019–20, 2020–21 సంవత్సరాల్లో ఈ ప్రత్యేక టారిఫ్‌ను వర్తింపజేయాలని అప్పట్లో ఈఆర్సీ ఆదేశించింది. ప్రత్యేక టారిఫ్ అమలుతో గతేడాది జూన్ నాటికి రూ.538.95 కోట్లు నష్టపోయామని డిస్కంలు తెలిపాయి. జలమండలి ద్వారా తాగునీటి సరఫరాకు అవుతున్న ఖర్చులతో పోలిస్తే అవుతున్న వ్యయం అధికంగా ఉందని, 2016–17లో రూ.232 కోట్లు, 2017–18లో రూ.330 కోట్లు, 2018–19లో రూ.299 కోట్లు, 2019–20లో రూ.577 కోట్లు, 202–21 అక్టోబర్ వరకు రూ.265 కోట్ల నష్టాలు వచ్చాయని జలమండలి ఈఆర్సీకి నివేదించింది. పాత టారిఫ్ ప్రకారం విద్యుత్ చార్జీలు పెంచితే భరించలేమని వాదనలు వినిపించింది. డిస్కంలు, జలమండలి వాదనలు విన్న ఈఆర్సీ.. డిస్కంల మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
జియో ఎఫెక్ట్: బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్స్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరో సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. టెలికాం రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో తక్కువ టారిఫ్ వోచర్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ప్రీపెయిడ్ వినియోగదారులకోసం కాల్ చార్జీలను భారీగా తగ్గించినట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది. ప్రీ పెయిడ్ వినియోగదారుల కాల్ చార్జీలను తగ్గించామని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తన సరికొత్త రూ. 8 ఎస్.టి.వి (స్పెషల్ టారిఫ్ వోచర్) వోచర్‌పై బిజిఎన్ఎల్-టు-బిఎస్ఎన్ఎల్ కాల్ రేటును నిమిషానికి 15 పైసలకు తగ్గించామనీ , ఈ తక్కువ కాలింగ్ రేట్ ను ఆస్వాదించండంటూ బిఎస్ఎన్ఎల్ ట్వీట్ చేసింది. 30 రోజుల పాటు చెల్లుబాటయ్యే రూ. 8 స్పెషల్ వోచర్ పై బీఎస్ఎన్ఎల్ సొంత నెట్‌వర్క్‌లో నిమిషానికి 15పైసలు చార్జ్ చేస్తుంది. ఇతర నెట్ వర్క్‌లపై ని. 35పైసలు వసూలు చేయనుంది. అలాగే ఇవే కాల్ చార్జీలతో రూ.19 రీచార్జిపై 90రోజుల వాలిడిటీతో కూడా వోచర్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. మరిన్ని వివరాలకు కస్టమర్ కేర్ నంబర్ 1800-345-1500ను సంప్రదించాలని బీఎస్ఎన్ఎల్ కోరింది. Enjoy #BSNL low calling rate on on-net and off-net STV. pic.twitter.com/jbB5lPOUP3 — BSNL India (@BSNLCorporate) September 6, 2017 -
వినాయకచవితికి బీఎస్ఎన్ఎల్ ఆఫర్లు
గుంటూరు మెడికల్: వినాయకచవితి సందర్భంగా బీఎస్ఎన్ఎల్ మొబైల్ సర్వీస్‌లో ప్రత్యేక టారిఫ్ ఓచర్లు ప్రవేశపెట్టినట్లు జిల్లా టెలికం మేనేజర్ ఎంఎల్ఎన్ రావు చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి వచ్చిన ఫెండ్స్,్ర ఫ్యామిలీ స్పెషల్ టారిఫ్ ఓచర్లు 90 రోజులపాటు అమలులో ఉంటాయని తెలిపారు. కేవలం 97 రూపాయలతో 60 నిమిషాలు ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చన్నారు. 16 రూపాయల రీఛార్జితో అన్ని ఎస్టీడీ కాల్స్ మూడు నిమిషాలకు 1.3 పైసల చొప్పున 30 రోజులపాటు చేసుకోవచ్చని తెలిపారు. ఇలాంటి ఆఫర్లు మరిన్ని ఉన్నాయని చెప్పారు. మీసేవ కేంద్రాల్లో ల్యాండ్‌లైన్, పోస్టుపెయిడ్ మొబైల్ బిల్లులు చెల్లించుకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. దీనికి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నెలసరి స్థిర చార్జీలు రూ.500, అంతకన్నా ఎక్కువ ఉన్న అన్లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ కాంబోప్లాన్లు ఎన్నుకుని సొంత మోడెమ్ ఉన్న వినియోగదారులకు రెండో బిల్లింగ్ సైకిల్ నుంచి నెలకు 150 చొప్పున 3 నెలలపాటు అదనపు ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఇస్తున్నామన్నారు. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ ఎ.గోపాలకృష్ణారావు, డీజీఎంలు బి.చంద్రసేన, ఎ.ప్రభాకర్, పి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.