‘సాక్షి’ స్పెల్బీకి విశేష స్పందన
మార్కాపురం : ‘సాక్షి’ స్పెల్బీ కార్యక్రమానికి మార్కాపురం డివిజన్లో విశేష స్పందన లభిస్తోంది. నిత్య జీవితంలో తరచూ వాడే పదాలు, ఇంగ్లిషు స్పెల్లింగ్, అర్థాలు, అవగాహన, వీలైనన్ని ఎక్కువ పదాలు నేర్చుకోవడం, భాషపై పట్టు సాధించాలనే లక్ష్యంతో సాక్షి స్పెల్బీ చేపట్టిన కార్యక్రమానికి డివిజన్ కేంద్రమైన మార్కాపురం పట్టణంలో వివిధ పాఠశాలల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఇంగ్లిషు భాషపై ఒకటో తరగతి నుంచే పట్టుసాధించేందుకు స్పెల్బీ ఉపయోగపడుతుందని పలువురు విద్యార్థులు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇంగ్లిషుపై పట్టుసాధిస్తే ప్రపంచంలో ఏ దేశంలోనైనా రాణించవచ్చనే నమ్మకం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిషు భాషపై, నిత్యం వాడుతున్న పదాలపై పట్టుసాధించేందుకు సాక్షి స్పెల్బీ పుస్తకం ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి 5 విభాగాలుగా విభజించి అక్టోబర్ 15న మొదటి దశ పరీక్ష, నవంబర్ 9న రెండో దశ, నవంబర్ 23న మూడో దశ, డిసెంబర్ 5న చివరి దశ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో 1, 2 తరగతులు, రెండో విభాగంలో 3, 4 తరగతులు, మూడో విభాగంలో 5, 6, 7 తరగతులు, నాలుగో విభాగంలో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు స్పెల్బీ పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. పట్టణంలోని ఓం సాయివికాస్ విద్యానికేతన్, విశ్వశాంతి పబ్లిక్ స్కూల్, కమలా కాన్సెప్ట్ స్కూల్, సాయిచైతన్య స్కూల్, తదితర పాఠశాలల విద్యార్థులు స్పెల్ బీ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు.