సర్వేకు.. పథకాలకు సంబంధం లేదు
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధం లేదని, ఎలాంటి సందేహాలు లేకుండా కుటుంబం పూర్తి వివరాలు ఎన్యూమరేటర్‌కు చెప్పాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న జిల్లా ప్రజలను కోరారు. పూర్తి వివరాలు తెలిస్తేనే ఎంత మంది ప్రజలు సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నారనే విషయం తెలుస్తుందని పేర్కొన్నారు.
సోమవారం ఆదిలాబాద్‌లో జిల్లా పరిషత్ కార్యలయ సమావేశ మందిరంలో ‘సమగ్ర కుటుంబ సర్వే’పై ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లబ్ధి పొందిన వివరాలు చెబితే తమకు వచ్చే సంక్షేమ పథకాలు రాకుండా పోతాయని, సంక్షేమ పథకాల కోసం మేం పెట్టుకున్నవన్నీ రద్దు అవుతాయని ప్రజలు అనుకోవద్దని తెలిపారు. మేం వివరాలు చెబితే మాకు రుణ మాఫీ కాదేమోనని, సంక్షేమ పథకాలు వర్తించవోనని అనుకోకూడదని అన్నారు.
కుటుంబ సర్వేకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. కుటుంబ వివరాలతో పాటు స్థిరాస్తులు, చరాస్తులు అన్ని వివరాలు సమగ్రంగా తెలిపితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. జనాభా ఎంత ఉంది, పథకాల లబ్ధి చేకూరుతుందా లేదా తదితర వివరాలు తెలుసుకునేందుకే సర్వే చేనపడుతున్నట్లు తెలిపారు. 19న అందరు ఇంట్లోనే ఉండి వివరాలు తెలుపాలని కోరారు.
సర్వేపై ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు కరపత్రాలు ముద్రించుకొని వారి నియోజకవర్గాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాగా, ఈ సదస్సుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభారాణి హాజరుకాకపోగా, ఇతర ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం గైర్హాజరయ్యారు. కలెక్టర్ జగన్మోహన్, సీపీవో షేక్మీరా, డీపీవో పోచయ్య, ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, దివాకర్‌రావు, జెడ్పీటీసీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.