నాలుగు నెలల్లో దిగుబడి, తక్కువ ఖర్చు.. మార్కెట్లో ఫుల్ డిమాండ్
సాక్షి,రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని విసంపేట గ్రామంలో పలువురు రైతులు కీర దోసకాయ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో వరి సాగు చేయొద్దని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వం పేర్కొనడంతో ప్రత్నామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. ఇందులో భాగంగా తక్కువ పెట్టుబడితో నాలుగు నెలల్లో గరిష్టంగా దిగుబడి పొందే అవకాశం ఉండటంతో పలువురు రైతులు కీర దోస సాగుపై మొగ్గు చూపారు. విసంపేటలో సుమారు 20 ఎకరాల్లో కీర దోస సాగు చేస్తున్నట్లు ఉద్యానవన అధికారులు పేర్కొంటున్నారు.
ఖర్చు తక్కువ.. దిగుబడి అధికం
కీర దోస సాగు ప్రారంభించిన తర్వాత నాలుగు నెలల కాలంలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి వస్తుంది. భూమిలో బలం కోసం నెలకోసారి యూరియా చల్లితే సరిపోతుంది. నెల తర్వాత దిగుబడి ప్రారంభమై ప్రతిరోజూ సుమారు క్వింటాల్ కీర దోస పడుతుంది. భూమిపై పూర్తిగా పరుచుకొని సాగవుతుండటంతో కలుపు సమస్య ఉండదు. నీటి వినియోగం కూడా తక్కువ. దిగుబడి ప్రారంభమయ్యాక ప్రతిరోజూ కాయలు తెంపాలి. మరుసటి రోజు తెంపితే ముదిరిపోయే అవకాశం ఉంటుంది.
అధిక పోషక విలువలు..
∙కీర దోసకాయల్లో అధిక పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
∙నీటి శాతం, అంటీ యాక్సిడెంట్లు ఎక్కువ.హైడ్రేషన్‌ను ప్రోత్సహిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ జీవప్రక్రియ మెరుగ్గా ఉంటుంది.
∙వేసవిలో వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు, గొంతు తడిగా ఉంటూ శరీరం చల్లాగా ఉండేందుకు ఉపయోపడుతుంది.
∙300 గ్రాముల పొట్టు తీసిన దోసకాయలో కేలరీలు 45 గ్రాములు, కార్పొహైడ్రేట్స్ 11 గ్రాములు, ప్రోటీన్ 2 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు, విటమిన్ సీ 14%, ప్రతీరోజు తీసుకోవడం వల్ల 62% కాల్షియం, మెగ్నీషియం 10%, పొటాషియం 13%, మాంగనీస్ 12% లభ్యమవుతాయి.
∙శరీరంలోని అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
∙బరువు, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గడంలో సహాయపడుతుంది.
∙మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఎముక ల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
ఆదాయం బాగుంది
నాకున్న అర ఎకరంలో ఫిబ్రవరి 10వ తేదీన దోస సాగు ప్రారంభించా. నెల రోజులకు దిగుబడి ప్రారంభమైంది. ప్రతిరోజూ సుమారు 50 కిలోల దిగుబడి వస్తోంది. ఖర్చు తక్కువ, మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉండటంతో తెంపిన క్షణంలోనే విక్రయిస్తున్న. 50 కిలోలకు రూ.800వరకు ధర పలుకుతోంది. ఆదాయం బాగుంది.
– బర్పటి సంతోశ్, కీర దోస సాగు రైతు, విసంపేట
రైతులను ప్రోత్సహిస్తున్నాం
నిత్యం మార్కెట్లో విరివిగా డిమాండ్ ఉన్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, కాయలను ఉత్పత్తి చేసే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. విసంపేటలో రైతులు కీరదోసతో లాభాలు గడించడంతో మరికొంత మంది రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి మళ్లిస్తారు.
– శ్రీకాంత్, ఉద్యానవనశాఖ అధికారి
ప్రయోజనకరం
వేసవిలో కీర దోస ఎంత ఎక్కువ తింటే అంత ప్రయోజనం. నీటి శాతం ఎక్కువ ఉండటంతో డీహైడ్రేషన్‌కు అవకాశం ఉండదు. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ అధికంగా ఉండటంతో సైడ్ ఎఫెక్టŠస్ ఉండవు. శరీరంలో నీటిశాతం పెరగడంతో వేడిని గ్రహించదు. దాని విలువ తెలియడంతో ప్రతీ ఫంక్షన్, హోటల్లలో ముందుగా కీరదోస ముక్కలు అందిస్తున్నారు.
– డాక్టర్ కటుకం అమర్నాథ్, ఎండీ(ఆయుర్వేదం)