జమ్ములో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
శ్రీనగర్: జమ్మూలో మరోసారి మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. జమ్మూలో హింస నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మొబైల్, ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్ సింరాన్దీప్ సింగ్ బుధవారమిక్కడ తెలిపారు. ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత సర్వీసులను పునరుద్దరిస్తామన్నారు. కాగా రూప్నగర్ ప్రాంతంలో ఓ పురాతన హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలతో రెండు వర్గాలు ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే.
అది కాస్తా ఉద్రిక్తంగా మారటంతో ఆందోళనకారులు రెండు స్కూల్ బస్సులతో పాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో దుష్ర్పచారం, వదంతులు చెలరేగే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా అల్లర్లకు సంబంధం ఉన్న పలువురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కర్ఫ్యూ విధించినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. మరోవైపు జమ్మూలో హింసపై కశ్మీర్ అసెంబ్లీలో విపక్షాల ఆందోళనకు దిగాయి. దీంతో అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారాయి.