సవాళ్లను ఎదుర్కొన్నాం!
గతంలో ఎన్నడూ చవిచూడనంతగా సవాళ్లను ఎదుర్కొని బాధితుల్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చామని ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ ఎస్పీ సెల్వన్ వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల నుంచి సమష్టి సహకారం అభినందనీయమని, విపత్తుతో ఎదురైన సవాళ్ల నడుమ సహాయక చర్యల్ని విజయవంతం చేశాం.
చెన్నై: ప్రకృతి ప్రళయానికి చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాలు పెను కష్టాల్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఒక్క రాత్రికే కుండపోతగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలే కాదు, మిట్ట ప్రాంతాలు సైతం జలదిగ్బంధంలో చిక్కాయి. ఈ పరిసరాల్లోకి వచ్చేందుకు కనీసం రోడ్లు కూడా లేదు. ఆకాశ మార్గంలో దిగాలన్నా వాన జోరు తప్పలేదు. రైళ్లు ముందుకు సాగాలి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సమాచారం అందగానే ఎన్డీఆర్ ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. తొలి, రెండో అంతస్తులు వరకు మునిగే స్థాయికి నీళ్లు చేరినా, బాధితుల్ని రక్షించడమే తమ ప్రధాన కర్తవ్యంగా వారం రోజుల పాటుగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరుల్లో ఈ బృందాలు శ్రమించాయి.
తమకు రోడ్లు ఎక్కడున్నాయో అన్న రూట్ మ్యాప్ కూడా తొలుత అందక పోవడంతో, ఎన్నో సవాళ్లను అధిగమించక తప్పలేదు. ఎన్ని సవాళ్లను అధిగమించినా లక్ష్య సాధనే తమ కర్తవ్యంగా ముందుకు సాగారు. విజయవంతంగా బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు అభినందనీయం. ఈ పరిస్థితుల్లో తాము ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ ఆ విభాగం డీఐజీ ఎస్పీ సెల్వన్ మీడియాతో మాట్లాడారు. తుపాన్ మొదలవుతుందన్న సమాచారంతో సాధారణంగా తాము అలర్ట్ అవుతామన్నారు. ఒక్క రాత్రి కురిసిన కుండ పోత వర్షం తమకు ఓ సవాల్‌గానే మారిందన్నారు.
సమాచారం అందగానే, అరక్కోణం చేరుకున్నా, చెన్నై వైపుగా వచ్చేందుకు మార్గాలు లేక సతమతం కావాల్సి వచ్చిందని, రోడ్డు ఎక్కడున్నదో, ఎంత లోతులో నీళ్లు ప్రవహిస్తున్నదో అన్న వివరాలు కూడా తమ చేతిలో లేదని వివరించారు. 50 బృందాలు రంగంలోకి దిగినా, బృందాల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం తీవ్ర కష్టంగా మారిందన్నారు. సమాచార వ్యవస్థ స్తంభించి ఉండడంతో ఎలాగైనా తమ లక్ష్యం బాధితుల్ని రక్షించడం, సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం అన్న నిర్ణయంతో ముందుకు సాగామన్నారు. తమకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, స్థానికులు, సంఘాలు, సంస్థలు, ఆర్మీ, నావికాదళం, ఎయిర్ ఫోర్స్ సంపూర్ణ సహకారం అందించాయన్నారు.
ప్రధానంగా తమిళనాడు పోలీసులు అందించిన సహకారం అభినందనీయమని కొనియాడారు. తాము ఎలా వెళ్లాలో అని సతమతమవుతున్న సమయంలో దారి చూపించి తమిళనాడు పోలీసులేనని పేర్కొన్నారు. విపత్తులను, ప్రకృతి విలయాన్ని అడ్డు కోవడం ఎవరి తరం కాదని, వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తుగా సిద్ధం కూడా ఉండాల్సిన అవసరం ఉందని వివరించారు.
తమ బృందాల్లో రెండు పుదుచ్చేరికి, ఒకటి కడలూరుకు పంపించామని, మిగిలిన 47 బృందాలు, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరులో తమ సేవల్ని విజయవంతంగా అందించాయని, ఆ బృందాల్లోని ప్రతి సభ్యుడ్ని కొనియాడారు. సమష్టి సహకారం, కృషితో పెను ప్రాణ న ష్టం జరగకుండా చేశామన్నారు. తమ సహాయక చర్యలు ఆదివారంతోనే ముగిశాయని, అయితే, కొన్ని చోట్ల మాత్రం బృందాల్ని ఇంకా వెనక్కు తీసుకోలేదన్నారు.
చెంగల్పట్టు, మధురాంతకం పరిసరాల్లో, కాంచీపురం పరిధిలో అతి పెద్ద చెరువులు నిండి ఉన్నాయని, ఉబరి నీరు అధికంగా వెళ్తున్న దృష్ట్యా, ముందస్తుగా అక్కడి గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా, ఏదేని ప్రమాదం ఎదురైన పక్షంలో అక్కడి వారిని రక్షించడం లక్ష్యంగా కొన్ని బృందాలు అక్కడక్కడా సిద్ధంగా ఉన్నాయని వివరించారు.