అవకాశాలకు వేదిక
కొత్తదనం కోరుకునే కంపెనీలే కాదు... సరికొత్త ఆలోచనలను అందించే యువత ఈ సిటీలో ఉన్నారు. వాళ్లను గుర్తించి ప్రోత్సహిస్తే మౌలిక వసతుల రంగంలో వినూత్న ఒరవడి సృష్టించవచ్చు. ఇలాంటి వేదికే ఆగస్ట్ ఫెస్ట్. దీని ద్వారానే తన నెట్‌వర్క్‌ను పెంచుకోవడం సాధ్యమైందని చెబుతున్నారు ‘స్పూర్స్’ అధినేత రామకృష్ణారెడ్డి. అదెలాగో ఆయన మాటల్లోనే విందాం.
దాదాపు 15 ఏళ్లు మైక్రోసాఫ్ట్, ఇంటెల్ కంపెనీల్లో పనిచేశా. యాంత్రిక జీవనం కిక్ ఇవ్వలేదు. ఓ గుర్తింపు కావాలనుకుని ఆలోచనల్లో పడ్డా. ఉద్యోగానికి రాజీనామా చేసి, హైదరాబాద్‌కు వచ్చా. ఓ రోజు ఇంట్లో పనికోసం ప్లంబర్‌ను పిలిచా. ఎప్పుడు కాల్చేసినా ‘ఇదిగో వస్తున్నా... ఇక్కడే ఉన్నా‘ అంటున్నాడే తప్ప రాలేదు. అతను అబద్ధం ఆడుతున్నాడని తెలిసిపోయింది. అక్కడి నుంచే నా ఆలోచన మొదలైంది. బిజీగా ఉండే సిటీలో ఇలా ఒకరి కోసం సమయం వృథా చేసుకోవడం ఏమిటి? చాలా కంపెనీల్లో ఫీల్డ్ వర్క్ చేసే వాళ్లూ ఇలాగే చేస్తే..! కస్టమర్లు ఎలా ఫీలవుతారు? దీనికి పరిష్కారం కనుక్కోవడమే లక్ష్యంగా పెట్టుకున్నా.
మొబైల్ యాప్
ఓ మిత్రుడిని భాగస్వామిగా చేసుకుని ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చా. నాలుగేళ్ల క్రితం మొబైల్ యాప్ రూపొందించా. స్పూర్స్ పేరుతో మార్కెట్లోకి వెళ్లా. నిజానికి ఇలాంటి సాఫ్ట్వేర్ ఇప్పటి వరకూ మార్కెట్లో ఎక్కడా లేదు. కేవలం మొబైల్ ఫోన్ ద్వారానే ఫీల్డ్ వర్క్ మొత్తం సంస్థ యజమాని తెలుసుకోవచ్చు. ఫీల్డ్ వర్క్‌కు వెళ్లినవారు వుళ్లీ ఆఫీసుకు రాకుండానే మొత్తం తన పని అంతా రిపోర్టు చేసే సదుపాయంఇందులో ఉంటుంది.
ఫెస్ట్‌తో ప్రోత్సాహం
కష్టపడి ఓ కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసినా, దాన్ని మార్కెట్ ఎలా చేసుకోవాలో... ఎవరిని కలవాలో తెలియలేదు. ఈ సమయంలో గత ఏడాది ఆగస్టు ఫెస్ట్ నిర్వహించారు. దాంట్లో నా ప్రొడక్ట్‌ను పారిశ్రామికవేత్తలకు పరిచయం చేశా. చాలామంది ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మెడ్‌ప్లస్ సహా 30 కంపెనీలు నా సాఫ్ట్వేర్ వాడుతున్నాయి. ఈసారి కూడా ఆగస్ట్ ఫెస్ట్‌లో పాల్గొంటున్నా. ఇప్పటికి నా బిజినెస్ కేవలం 3 శాతమే పెరిగింది. ఇంకా 97 శాతం మార్కెటింగ్ అవకాశాలున్నాయి. నా మార్కెట్ సర్వే ప్రకారం హైదరాబాద్‌లో దాదాపు 200 కంపెనీలు ఫీల్డ్ వర్క్‌లో పారదర్శకత, వురింత నాణ్యమైన సేవలు కోరుకుంటున్నాయి. ఇందుకు నా సాఫ్ట్వేర్ బాగా ఉపయోగపడుతుంది.