తెలుగువారు లేరనా?!
తిరుమల తిరుపతి దేవస్థానాల వ్యవస్థ ఆవిర్భవించి దాదాపు శతాబ్దం గడిచింది. చరిత్రాత్మకమైన ఆ ఆలయాల పరిపాలనా వ్యవహారాలు ఇంతకాలం ఒక సంప్రదాయం మేరకు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హఠాత్తుగా ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టింది. ఉత్తర భారతదేశానికి చెందిన ఐఏఎస్ అధికారిని తొలిసారి టీటీడీ కార్యనిర్వహణాధికారి పదవికి ఎంపిక చేసింది. తెలుగు ప్రాంతానికి చెందిన ఐఏఎస్ అధికారిని నియమించే సంప్రదాయమే ఇంతవరకు టీటీడీలో ఉన్నది. ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు తప్పించవలసిన అవసరం ఏమీ కనిపించదు. అలాగే ఇలాంటి నియామకం చేపట్టడానికి దారితీసిన ప్రత్యేక పరిస్థితులు ఏమీ కానరావు.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రశ్నార్థకంగా మారింది. ఒకింత వివాదాస్పదంగా తయారైంది కూడా. తెలుగు వారైన, సమర్థులైన ఐఏఎస్ అధికారులు, దక్షిణాదివారు చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమల ఆలయ పాలన చరిత్ర, పాలన బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తించారో, ఆ వ్యక్తులు, సంస్థలు ఎలాంటివో ఒక్కసారి మననం చేసుకోవడం అవసరం. దానితో కాలక్రమంలో టీటీడీ పాలనా వ్యవస్థలో వచ్చిన మార్పులను కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాసం ఉద్దేశం అదే.
తిరుమల ఆలయ చరిత్ర
తిరుమల వేంకటేశుని ఆలయ చరిత్ర పురాతనమైనది. ప్రాచీన తమిళ సాహి త్యంలో ఈ ఆలయ ప్రస్తావన విరివిగా కనిపిస్తుంది. తిరుమలను ‘వడ వెంగడము’ అని పిలిచేవారు. అంటే–ఉత్తర దిక్కున ఉన్న పర్వతం. ‘తోల్కప్పీయం’ అనే ప్రాచీన తమిళ వ్యాకరణ గ్రంథంలో తిరుమల గిరులను తమిళదేశానికి ఉత్తర సరిహద్దుగా పేర్కొన్నారు. సంగమ సాహిత్యంలో కూడా తిరుమల ఆలయ ప్రస్తావన ఉంది. ఇక తిరుమల ఆలయ ప్రాచీనతను శాసనాధారాలు కూడా ఆవిష్కరిస్తున్నాయి. పల్ల వుల శాసనాలలో తిరుమలేశుని ఆలయం గురించి వివరణ ఉంటుంది. తరువాత చోళులు, పాండ్యులు, యాదవ వంశీయులు తిరుమల ఆల యాన్ని సంరక్షించడంతో పాటు, అభివృద్ధి చేసేందుకు కూడా పాటు పడ్డారు. వైష్ణవ మతాన్ని ఆదరించి పోషించిన విజయనగర సామ్రాజ్య ఏలికలు తమ కాలంలో తిరుమల ఆలయానికి ఎంతో సేవ చేశారు. గుడిలో దీపాలు వెలిగించడం కోసం పల్లవులు, చోళులు బంగారం, భూములు సమర్పించుకున్నట్టు వారి శాసనాలు ఘోషిస్తున్నాయి. ధూప దీపాలతో పాటు నైవేద్యాలు, అన్న సంతర్పణకు నిధులు ఏర్పాటు చేసిన వివరాలు కూడా వారి శాసనాలలో కనిపిస్తుంది. ఆలయ నిర్వహణ కోసం తిరు చానూరు శ్రీవైష్ణవ బ్రాహ్మణ సభను ఏర్పాటు చేసినది పల్లవుల కాలంలోనే. ఇలాంటి విధులను నిర్వహించడం కోసం స్థానిక ప్రముఖులతో ‘స్థానత్తార్’ అనే ఆలయ సంఘాన్ని ఏర్పాటు చేయించినవారు కూడా పల్లవులే.
అసలు స్థానత్తార్ బాధ్యతే దేవళాల సక్రమ నిర్వహణ. చోళులు కూడా ఈ సంప్రదాయాన్నే కొన సాగించారన్న సంగతిని విస్మరించలేం. కానీ చోళుల కాలంలో ఆలయ నిర్వహ ణలో లోపాలు తలెత్తినట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీనితో ఈ అంశాన్ని రాజ్యాధి కారులు విచారించి, దీపారాధన సక్రమంగా జరగడానికి చర్యలు చేపట్టారు. ఈ విషయాలు కూడా శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. విజయనగర పాలకుల కాలంలో ఆలయాల నిర్వహణలో స్థానత్తార్లకు ప్రాధాన్యం తగ్గింది. వైష్ణవ మతాన్ని అవలంబించి, పోషించిన వారు కావడం చేత విజయనగర రాజుల కాలంలో స్థానిక శ్రీవైష్ణవులకు ఆలయ నిర్వహణ బాధ్యతను స్వీకరించే అవ కాశం వచ్చింది. తమకు సాయంగా ఉంటూ ఆలయ ఆదాయ వ్యయాలను చూసేందుకు ఈ శ్రీవైష్ణవులే కొందరు అధికారులను నియమించుకున్నారు. విజయనగర పాలకులలో ప్రముఖుడు సాళ్వ నరసింహరాయలి కాలంలోనే, ఆయన సహాయ సహకారాలతోనే కందాడై రామానుజ అయ్యంగార్ ఆలయ పరిపాలన, సేవలు, ఇతర కార్యక్రమాల నిర్వహణలో సమూలమైన మార్పులు తీసుకుని వచ్చారు. ఇక శ్రీకృష్ణదేవరాయలు తిరుమల ఆలయం పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు చూపారు. ఏడుసార్లు శ్రీవేంకటేశుని దర్శించుకుని, భూరి విరా ళాలు, కానుకలు సమర్పించుకున్నాడు. ఆ తరువాత అచ్యుతరాయలు, సదా శివరాయులు కూడా ఆలయానికి విశేషమైన సేవలు అందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే విజయనగర సామ్రాజ్య వైభవ దశలో ఆలయ నిర్వహణ మొత్తం శ్రీవైష్ణవుల చేతిలోనే కొనసాగింది.
మహమ్మదీయుల చేతిలో పాలన
విజయనగర సామ్రాజ్య పతనం తరువాత దక్షిణ భారతంలో పెనుమార్పులు సంభవించాయి. తిరుమల ఆలయ పరిపాలన కొంతకాలం గోల్కొండ నవాబుల పర్యవేక్షణలో ఉండేది. వారి మంత్రులు అక్కన్న, మాదన్న ఆలయాభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆలయ నిర్వాహకులుగా స్థానాల వారిని నియమించినది కూడా అక్కన్న, మాదన్నలే. ఆపై తిరుమల ఆలయం నిర్వహణ ఆర్కాట్ నవాబు అధీనంలోకి వెళ్లింది. ఆర్కాట్ నవాబు కాలంలో ఆలయ నిర్వహణ కోసం శ్రీనివాసాచారి, వాసుదేవాచారి అనే అమల్దారులను ఏర్పాటు చేశారు. ఏటా నవాబుకు నిర్ణీత పైకం చెల్లించే పద్ధతిన ఈ నియామకాలు జరిగాయి. ఆలయ నిర్వహణలో హిందూ రాజుల కాలానికీ, మహ్మదీయుల కాలానికీ మధ్య ఒక ముఖ్య వైరుధ్యం కనిపిస్తుంది. ఆలయ సక్రమ నిర్వహణకీ, అభివృద్ధికీ హిందూరాజులు ప్రాధాన్యం ఇచ్చారు. మహ్మదీయ పాలకులు ఆలయాన్ని ఆదా యాన్ని సమకూర్చే ప్రధాన వనరుగా గుర్తించారు. అందుకు తగ్గట్టే ఆలయ వ్యవ హారాలను నిర్వహించారు కూడా. ఎవరు ఎక్కువ ధనం నవాబుకు సమకూర్చ గలరో వారి చేతికే ఆలయ నిర్వహణ అప్పగించారు.
ఈస్టిండియా కంపెనీ పాలన
కర్ణాటక యుద్ధాలలో చేసిన సాయానికి గాను ఆర్కాట్ నవాబు మహమ్మదలీ తిరుమల ఆలయ ఆదాయాన్ని ఈస్టిండియా కంపెనీకి దఖలు పరిచాడు. ఆ విధంగా 1801లో ఆలయ ప్రత్యక్ష పాలన ఈస్టిండియా కంపెనీ వశమైంది. అప్పటి నుంచి మళ్లీ 1843లో హాథీరాంజీ మఠానికి అప్పగించే వరకు కంపెనీయే ఆలయ నిర్వహణను చూసింది. ఉత్తర ఆర్కాట్ కలెక్టర్ పర్యవేక్షణలో బ్రూస్‌కోడ్ అనే విధివిధానాలను అనుసరించి పరిపాలన సాగింది. అప్పుడు ఆలయ పాల నలో కలెక్టర్‌కు సాయపడిన వాడే పారుపత్తిదారు. ఈనాటి కార్యనిర్వహణాధి కారి పదవికి బీజం పారుపత్తిదారు విధుల నుంచే పడింది. నిజానికి ఈస్టిం డియా కంపెనీ ఆలయ పాలనను సమర్థంగానే నిర్వహించింది. ఆలయ ఆచార సంప్రదాయాలకనుగుణంగా పాలన నిర్వహించడానికీ, ఆ సంప్రదాయాలు ఎలాంటివో తెలుసుకునేందుకూ ఒక విధానం అనుసరించారు.
ఆలయ పాల నలో అనుభవం ఉన్న వారిని కొన్ని ప్రశ్నలు వేసి, వారి జవాబులనే విధానాలుగా స్థిరీకరించారు. దీనినే ‘సవాల్ జవాబ్ పట్టీ’ అంటారు. ఈనాటికీ తిరుమల అంశంలో ఏ వివాదానికైనా న్యాయస్థానాలు కూడా ఈ సవాల్ జవాబ్ పట్టీని ప్రామాణికంగా స్వీకరిస్తున్నాయి. అదే విధంగా ఆలయంలో వివిధ కార్యక్ర మాలు నిర్వహించే వారి వివరాలతో కైంకర్య పట్టీ రూపొందించారు. పై మాయిష్ అనే పత్రంæ ద్వారా అన్ని విగ్రహాల వివరాలను రూపొందించారు. దిట్టం పుస్తకం ద్వారా ప్రసాదాల పరిణామాలను బట్టి దానికి కావలసిన సరు కుల ముడి పదార్థాల పరిణామాలు స్థిరీకరించడం జరిగింది. ఈ విధంగా ఈస్టిం డియా కంపెనీ తిరుమల ఆలయంలో ప్రథమంగా ఒక వ్యవస్థీకృత నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టి, పాలనను నిర్వహించారు.
హాథీరాంజీ మఠం కేంద్రంగా...
కానీ కంపెనీ ప్రత్యక్షంగా ఆలయాన్ని నిర్వహించడానికి ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్లు అభ్యంతరం తెలిపారు. ఫలితంగానే 1843 నుంచి ఆలయ నిర్వహణ హాథీరాంజీ మఠం మహంతులకు అప్పగించారు. అప్పటి నుంచి 1933 వరకు ఆరుతరాల మహంతుల విచారణకర్తలుగా వ్యవహరించారు. వీరి నిర్వహణ కాలంలో చాలా కోర్టు కేసులు నడిచాయి. ఒక మహంతు హత్యకు గురయ్యాడు. సేవాదాస్ అను మహంతుకు బంగారు నాణాల దుర్వినియోగం కేసులో శిక్ష పడింది. మహంతుల కాలంలో పరిపాలన సరిగా లేనందున ప్రీవి కౌన్సిల్ ఒక స్కీంను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం జిల్లా కోర్టును ఆలయ నిర్వహణలో భాగస్వామిని చేశారు. ఆలయానికి ఒక కోశాధికారిని జిల్లా కోర్టు నియమిస్తుంది. అన్ని ఆదాయ వ్యయ వివరాలు ఆయనే చూస్తారు. విచా రణకర్త ప్రతి సంవత్సరం జిల్లా కోర్టుకు ఆదాయ వ్యయ వివరణతో కూడిన బడ్జెట్ సమర్పించాలి. ప్రధానంగా ఈ స్కీమ్‌లో మిగులు ధనం ఆలయ అభి వృద్ధికే వినియోగించాలని నిర్దేశించారు. ఈ విధంగా విచారణకర్తల అధీనంలో ఆలయ నిర్వహణ 1933 వరకు జరిగింది.
కార్యనిర్వహణాధికారి పదవి
1932 సంవత్సరంలో మద్రాస్ ప్రభుత్వం టీటీడీ చట్టాన్ని రూపొందించి ఏడు గురు సభ్యుల మండలికి తిరుమల నిర్వహణ బాధ్యతను అప్పగించింది. ఒక కమిషనర్‌ను ఆలయ నిర్వహణ కోసం నియమించారు. ఈ చట్టం స్థానంలో 1951లో మరో చట్టం వచ్చింది. 1951నాటి చట్టంలో ప్రప్రథమంగా కార్య నిర్వహణాధికారి పదవిని సృష్టించారు. 1965లో ప్రథమ ఐఏఎస్ ఆఫీసరు ఉమాపతి కార్యనిర్వహణాధికారి బాధ్యతలు చేపట్టేదాకా ఎనిమిది మంది 1933 చట్టం క్రింద కమిషనర్లుగా, 1951 చట్టం తరువాత కార్య నిర్వహణాధికారు లుగా బాధ్యతలు నిర్వహించారు. వీరిలో ఏడుగురు తెలుగువారు. రఘునాథ మొదలియారు 1936–39 వరకు కమిషనరు బాధ్యతలను నిర్వహించారు. వీరిలో సుదీర్ఘకాలం–1949 నుంచి 1964 వరకు సి. అన్నారావు మొదట కమిష నరుగా, ఆపై కార్య నిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గాడిలో పెట్టిన సమర్థవంతుడైన అధికారిగా వీరికి పేరు న్నది. ఆ పై కాలంలో టీటీడీ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
ఉత్తర భారత ఐఏఎస్ పట్ల అభ్యంతరం ఎందుకంటే...
తిరుమల, శబరిమలై, ఉడిపి సహా ఎన్నో మహా పుణ్యక్షేత్రాలు మనకు ఉన్నాయి. అందులో మొత్తం భారతదేశంలో శ్రీవేంకటేశుని తిరుమల దేవస్థానం తలమాని కమైనది. ఇక్కడ ఆచరిస్తున్న ఆగమ సంప్రదాయంలో 21 కులాలకు సంబంధం ఉంది. ఇవన్నీ అర్థం చేసుకోవడం తేలిక కాబట్టే ఇంతకాలం స్వరాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిని కార్యనిర్వహణాధికారిగా నియమించడం జరిగింది. ఇది సహేతుకమైన సంప్రదాయం. ఈ నేపథ్యం ఉన్న ఆలయంలో ఉత్తర భారత దేశా నికి చెందిన ఒక ఐఏఎస్ అధికారిని కార్యనిర్వహణాధికారిగా నియమించారు. ఇది జీర్ణించుకోలేని నిర్ణయమే. అయితే ఒక విషయం అర్థం చేసుకోవడం అత్యవసరం.
ఇక్కడ ఉత్తర భారతదేశ అధికారి నియామకం పట్ల అభ్యంతరం అంటే, అది వ్యక్తుల పట్ల వ్యతిరేకత కాదు. భౌగోళికమైనది అంతకంటే కాదు. ఇది సంప్రదాయాల మధ్య సంఘర్షణకు, ముఖ్యంగా ఆగమ సంప్రదాయాలకు భాష్యం చెప్పుకోవడం దగ్గర, ఆచరింపచేయడం దగ్గర సంఘర్షణ చెలరేగే అవకాశం ఉన్నదని చెప్పడానికే. దీనితో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం కోసమే. ఆగమ సంప్రదాయం, దాని పరమార్థాలు, లోతుపాతులు ఔత్తరాహులకు ఎంతవరకు అవగతమో తెలియదు. ఆగమ పండితులు ఇచ్చే వివరణకు ఉత్తరభారతీయులు ఎంతవరకు ఆమోదిస్తారో కూడా తెలియదు. ఉత్తర భారత దేశం సేవాభావం ప్రధానంగా కలది. దక్షిణ భారతదేశం అలా కాదు. ఇది కర్మ భూమి. యజ్ఞయాగాదులకు ఇక్కడ ప్రాధాన్యం ఎక్కువ. ఈ అంశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పరిగణనలోనికి తీసుకోవడం లేదో అర్థం కాదు.
అంతా తెలుగువారే
1965లో మొదలైన ఐఏఎస్ అధికారుల కార్యనిర్వహణాధికారి బాధ్యతలు ఈనాటికీ కొనసాగుతున్నాయి. 1965 నుంచి నేటి వరకు 21 మంది ఐఏఎస్ అధికారులు ఈ పదవి నిర్వహించారు. 1972–74 మధ్య కార్యనిర్వహణాధి కారిగా పనిచేసిన సుబ్రహ్మణ్యం మినహా మిగిలిన అధికారులందరూ తెలుగు వారే. శతాబ్దాలుగా, అవిచ్ఛిన్నంగా వస్తున్న సంప్రదాయానికి తిలోదకాలివ్వ వలసిన ప్రత్యేక పరిస్థితులేమిటో అర్థం కావటం లేదు. సమర్థులు, ప్రతిభావం తులైన తెలుగు అధికారులు లేరా అంటే అది నిజం కాదు. ఇప్పుడు నియ మించిన అధికారి సమర్థతను శంకించడం లేదు. చాలాకాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని ఉల్లంఘించాల్సిన అవసరమేదీ కన్పించడం లేదన్నది నా అభి ప్రాయం. ఎడ్మండ్ బర్క్ చెప్పినట్లు ‘Institutions of antiquity should not be altered for temporal reasons’(సనాతనంగా వస్తున్న విధానాలను లౌకిక ప్రయోజనాల కోసం మార్చడం సమంజసం కాదు).
శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి
విశాఖ శారదాపీఠం అధిపతి