SREI
-
శ్రేయి కంపెనీలకు ఎన్ఏఆర్సీఎల్ అత్యధిక బిడ్
కోల్‌కతా: సంక్షోభంలోని రెండు శ్రేయి గ్రూప్ కంపెనీలను దక్కించుకునేందుకు నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) అత్యధికంగా రూ. 5,555 కోట్ల మేర ’ప్రస్తుత నికర విలువ’ ప్రాతిపదికన బిడ్ దాఖలు చేసింది. ఇందులో రూ. 3,200 కోట్లు నగదు రూపంలో ఉండనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు 10 గంటల పాటు రుణదాతల కమిటీ (సీవోసీ) నిర్వహించిన బిడ్డింగ్‌లో వర్దే పార్ట్నర్స్ కన్సార్షియం పక్కకు తప్పుకుంది. ఎన్ఏఆర్సీఎల్ అత్యధికంగా బిడ్ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల దానికన్నా స్వల్పంగా వెనుకబడిన ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా బరిలోనే ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని ఒక అధికారి తెలిపారు. రెండు సంస్థలు (ఎన్ఏఆర్సీఎల్, ఆథమ్) తమ సమగ్ర ప్రణాళికలను సీవోసీకి సమర్పిస్తాయని, జనవరి 8–9 మధ్య తుది ఓటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం దివాలా పరిష్కార ప్రణాళిక దాదాపు రూ. 13,000–14,000 కోట్ల స్థాయిలో ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కనిష్టంగా రూ. 9,500–10,000 కోట్లయినా రావచ్చని పేర్కొన్నాయి. గవర్నెన్స్ లోపాలు, రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ల కారణంగా శ్రేయి గ్రూప్‌లోని శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ (ఎస్‌ఐఎఫ్‌ఎల్), దాని అనుబంధ సంస్థ శ్రేయి ఎక్విప్మెంట్ ఫైనాన్స్ (ఎస్‌ఈఎఫ్‌ఎల్) బోర్డులను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. ఈ రెండు నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) .. బ్యాంకులకు రూ. 32,750 కోట్ల మేర బాకీ పడ్డాయి. వీటిని రాబట్టుకునేందుకు 2021 అక్టోబర్‌లో దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభమయ్యాయి. -
శ్రేయీ గ్రూప్ లావాదేవీల మోసం
న్యూఢిల్లీ: మొత్తం రూ. 3,025 కోట్ల మోసపూరిత లావాదేవీలపై పాలనాధికారికి ట్రాన్సాక్షన్ ఆడిటర్ నుంచి నివేదిక అందినట్లు ప్రయివేట్ రంగ కంపెనీ శ్రేయీ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ తాజాగా పేర్కొంది. ఇది 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాలలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన నివేదికగా వెల్లడించింది. సంక్షోభంలో చిక్కుకున్న శ్రేయీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, శ్రేఈ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ బోర్డులను గతేడాది అక్టోబర్‌లో రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. ఆపై బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ సీజీఎం రజనీష్ శర్మను శ్రేయీ గ్రూప్ కంపెనీలకు పాలనాధికారిగా నియమించింది. తదుపరి పాలనాధికారికి సహకరించేందుకు ముగ్గురు సభ్యుల సలహాదారుల కమిటీని నియమించింది. శ్రేయీ గ్రూప్ కంపెనీలు ప్రస్తుతం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
శ్రేయి చేతికి డెక్కన్ క్రానికల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) విషయంలో శ్రేయి మల్టిపుల్ అస్సెట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌కు చెందిన విజన్ ఇండియా ఫండ్ సమర్పించిన రూ.1,000 కోట్ల పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపింది. శ్రేయి పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ(సీవోసీ) గతంలోనే 81.39% మెజారిటీతో ఆమోదం తెలియజేయగా, దీనికి తాజాగా ఎన్సీఎల్టీ కూడా ఓకే చెప్పింది. డీసీహెచ్ఎల్ నుంచి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రూ.8,000 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉన్నాయి. వీటిల్లో దాదాపు రూ.400 కోట్ల వరకు ఎక్స్పోజర్ కలిగిన కెనరా బ్యాంకు పరిష్కారం కోరుతూ ఎన్సీఎల్టీని ఆశ్రయించడం తెలిసిందే. పరిష్కార ప్రణాళికకు చట్ట ప్రకారం అవసరమైన అన్ని రకాల అనుమతులను ఏడాదిలోగా పొందాల్సి ఉంటుందని ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ తన ఆదేశాల్లో పేర్కొంది. -
ఈక్విటీగా డీసీ రుణం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అప్పుల ఊబిలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) వాటిని తీర్చడానికి ఈక్విటీ మార్గాన్ని ఎంచుకుంది. శ్రేయి ఇన్ఫ్రా నుంచి తీసుకున్న రుణాన్ని ఈక్విటీగా మార్చే ప్రక్రియను చర్చించడానికి ముగ్గురు డెరైక్టర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు డీసీహెచ్ఎల్ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్కి తెలియచేసింది. శుక్రవారం సమావేశమైన బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ కింద శ్రేయి ఇన్‌ఫ్రాకి షేర్లను కేటాయిస్తామని, కానీ దీనికి సంబంధించిన ఒప్పందాలు, తుది అనుమతులు లభించాల్సి ఉందని పేర్కొంది. కానీ తీసుకున్న రుణం విలువను మాత్రం డీసీహెచ్ఎల్ తెలియచేయలేదు. శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రూ.220 కోట్లు స్వల్ప కాలిక రుణం ఇచ్చినట్లు గతంలో తెలిపారు. రుణాన్ని ఈక్విటీగా మార్చమని శ్రేయి ఇన్ఫ్రా నుంచి వచ్చిన ప్రతిపాదనను బోర్డు పరిగణనలోకి తీసుకొని ముగ్గురు డెరైక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు డీసీహెచ్ఎల్ తెలిపింది. డిసెంబర్, 2013 నాటికి డీసీహెచ్ఎల్లో ప్రమోటర్ల వాటా 32.66 శాతంగా ఉండగా, డీఐఐల వాటా స్వల్పంగా తగ్గి 8.17 శాతంగా ఉంది. ఇదే సమయంలో ఇతర షేర్‌హోల్డర్ల వాటా స్వల్పంగా పెరిగి 59.10 శాతానికి చేరింది. ఆడిట్ కమిటీ సిఫార్సుల మేరకు జాయింట్ ఆడిటర్‌ను నిమమించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆడిటర్ ఎంపిక బాధ్యతను ముగ్గురు డెరైక్టర్ల కమిటీకి అప్పజెప్పింది. ఇందుకోసం దేశంలోని ఆరు ప్రధాన ఆడిటింగ్ సంస్థలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఒక సంస్థను ఎంపిక చేయనున్నట్లు డీసీహెచ్ఎల్ తెలిపింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ.3.74 వద్ద ముగిసింది.